22 నుంచి రోడ్డు మరమ్మతులు


Sun,October 20, 2019 03:26 AM

-పగలూ రాత్రి పనిచేయనున్న బీటీ మిక్సింగ్ ప్లాంట్లు
-డిసెంబర్ 1 వరకు రోడ్డు తవ్వకాలపై నిషేధం
-వచ్చే నెల నుంచి తక్షణ మరమ్మతు బృందాలు
-మలక్‌పేట రైల్వే అండర్ బ్రిడ్జి విస్తరణకు భూసేకరణ
-అపోలో దవాఖాన వద్ద రెండెకరాల్లో డబుల్ గృహాలు
-పార్కులకు ఎస్‌టీపీల నీరు
-జీహెచ్‌ఎంసీ నగర సమన్వయ సమావేశంలో నిర్ణయం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జూబ్లీహిల్స్‌లో అపోలో దవాఖాన సమీపంలోని రెండెకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకోసం కేటాయించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ హైదరాబాద్ జిల్లా సంయుక్త కలెక్టర్‌ను కోరారు. అలాగే, సమీపంలోని ఖాళీ జాగాలో కమ్యూనిటీ హాలును నిర్మించేందుకు భూమిని కేటాయించాలని పేర్కొన్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ, ఇప్పటికే ఆర్డీఓ తగిన నివేదిక రూపొందించారని, భూమి కేటాయింపు ప్రక్రియ త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు.
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం లోకేశ్‌కుమార్ అధ్యక్షతన సిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు ఇంకా కురుస్తున్న నేపథ్యంలో రోడ్డు తవ్వకాలపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని మరో నెలరోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ముందు నిర్ణయించిన ప్రకారం నవంబర్ ఒకటినుంచి తవ్వకాలకు అనుమతులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వర్షాల నేపథ్యంలో నిషేధాన్ని డిసెంబర్ ఒకటి వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ప్రధాన రోడ్ల నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నందున ఇకమీదట రోడ్డు తవ్వకాల అనుమతులు కూడా సంబంధిత ఏజెన్సీల నుంచే పొందాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున ఈనెల 22 నుంచి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించి నవంబర్ 10 లోగా పూర్తి చేస్తామని చెప్పారు. దీనికోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని అన్ని బీటీ మిక్సింగ్ ప్లాంట్లు 24గంటలూ పనిచేస్తాయన్నారు. వీటితోపాటు రోడ్ల మరమ్మతు పనులకు నవంబర్ నుంచి తక్షణ మరమ్మతు బృందాల(ఐఆర్‌టీ)ను కూడా రంగంలోకి దింపుతున్నామన్నారు. 680 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్ల నిర్వహణ ప్రైవేట్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినందున మిగిలిన అంతర్గత రోడ్ల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని బల్దియా ఇంజినీర్లను ఆదేశించారు.

అత్యవసర పనుల నిమిత్తం వాటర్‌బోర్డు తవ్వకాలు జరిపిన రోడ్లపై తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేపట్టాలని బల్దియా ఇంజినీర్లను కమిషనర్ ఆదేశించారు. బల్దియా ఆధ్వర్యంలోని పార్కుల అవసరాలకు వాటర్‌బోర్డు ఆధ్వర్యంలోని నీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్‌టీపీ)నుంచి వెలువడే నీటిని ఉపయోగించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్‌టీపీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే పార్కులకు ప్రత్యేకంగా పైప్‌లైన్ ద్వారా తరలించాలని ముందు భావించినప్పటికీ అధిక వ్యయంతోపాటు నిర్వహణలో ఇబ్బందుల వల్ల ప్రస్తుతానికి ట్యాంకర్ల ద్వారానే పార్కులకు నీటిని తరలించాలని ఆయన సూచించారు. మలక్‌పేట్ రైల్వేస్టేషన్ అండర్ బ్రిడ్జీని విస్తరించేందుకు భూసేకరణ వేగవంతం చేయాలని కోరారు. ఓల్డ్ ముంబయి హైవేలో క్యారేజ్ వేకుగాను అడ్డంకిగా ఉన్న మూడు ఆలయాలను సమీపంలో పునర్‌నిర్మించేందుకు కావాల్సిన భూమిని గుర్తించినట్లు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. ఒవైసీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా వంతెన నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలిగించేందుకు వాటర్‌బోర్డు, విద్యుత్, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి తగు పరిష్కార మార్గాలను చేపట్టాలని కమిషనర్ కోరారు. హైదరాబాద్ సంయుక్త కలెక్టర్ జి. రవి, ట్రాఫిక్ విభాగం డీసీపీ చౌహాన్, ఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితోపాటు జీహెచ్‌ఎంసీకి చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...