వ్యర్థాలు.. కళారూపాలు


Sun,October 13, 2019 01:34 AM

- ఒకే వేదికపై 40 మంది కళాకారుల సృజనలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వ్యర్థాలు..ఆకట్టుకునే కళారూపాలయ్యాయి.. వారి సృజనతో వృథా వస్తువులే షోకేజీ బొమ్మలయ్యాయి. 40 మంది కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్న భిన్న చిత్రాలు .. బంజారాహిల్స్‌లోని ప్యాలెస్‌ బ్యాంకెట్‌ హాల్‌ వేదికపై కొలువుదీరి ఆకట్టుకుంటున్నాయి.

ప్రతి కళారూపం ఒక చుక్కతోనే ప్రారంభమవుతుంది. ఆ దృక్పథం ప్రారంభమే.. ‘బిందు’ కళా ప్రదర్శన. ఇదో శిల్ప, చిత్ర కళా ప్రదర్శన. వృథా, వ్యర్థ సామగ్రిని ఆధారంగా చేసుకొని శిల్ప, చిత్రకళాకారులు వారిలోని సృజన శక్తికి, నైపుణ్యానికి పదును పెట్టారు. నగరానికి చెందిన జ్యోతి దాస్‌ ప్రముఖ న్యాయవాది. ఆమె కళ, పురాతన వస్తువుల పట్ల ఆమెకున్న అభిరుచిపై దృష్టి సారించింది. జ్యోతి తన వృత్తితో పాటు కళపై ఉన్న ఆసక్తితో దానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చింది. ఆమె తన అభిరుచిని చాటుకునే ప్రయత్నంలో హైదరాబాద్‌ ఆధారిత ఆర్ట్‌ క్యూరేటర్‌ ఎం.అన్నపూర్ణతో కలిసి పని చేస్తున్నది. తెలుగు రాష్ర్టాల నుంచి 40 మంది శిల్ప, చిత్రకళాకారులను ఏకం చేసి, చక్కని ఆర్ట్‌ షోను బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌:10లోని ‘ప్యాలెస్‌ బంకెట్‌ హాల్‌' వేదికపై ఏర్పాటు చేశారు. దానికే “బిందు” ‘..ఒక ఆరంభం’ అనే ఉప శీర్షికతో నగరంలోని కళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ఈ ప్రదర్శనలో ప్రఖ్యాత కళాకారుల సమకాలీన కళాకృతులను ప్రదర్శిస్తున్నారు. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.చంద్రయ్య, బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ప్రముఖ చిత్ర, శిల్పకళాకారులు లక్ష్మణ్‌ ఏలె, నగేశ్‌ గౌడ్‌, ఆనంద్‌ గడప, జయప్రకాశ్‌, రామకృష్ణ జి, శివరామాచారి, పవన్‌ కుమార్‌, ప్రీతి సంయుక్త, చిప్ప సుఘాకర్‌, మేఘనా రావు, శ్రీకాంత్‌ కురువా, మరో 30 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. ప్రముఖ చిత్రకారిణి, క్యూరేటర్‌ స్రవంతి జూలూరి కార్యక్రమంలో కళా ప్రేమికులతో కలిసి ‘బిందు’ వద్ద సృష్టించబడిన అద్భుతమైన వాతావరణంలో ఇమిడిపోయారు. ఈ ప్రదర్శన ఈ నెల 14 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

మంచి వేదిక..
మన కళాకారుల్లోనూ అద్భుతమైన కళాతృష్ణ, కళా సేవ ఉన్నది అందుకే 40 మంది కళాకారులను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు కృషి చేశాం. చిత్ర, శిల్పకళలోని అన్ని మాధ్యమాల్లో కళాకారులు వారి ప్రతిభను చాటుతూ వారి ఎగ్జిబిట్లను ఇక్కడ ప్రదర్శించారు. ప్రదర్శనలో 90 ఆర్ట్‌ వర్క్స్‌వర్క్స్‌ అందుబాటులో ఉన్నాయి.
- ఎం.అన్నపూర్ణ, క్యూరేటర్‌, చిత్రకళా ప్రదర్శన

కళకు గుర్తింపు రావాలి..
నాలుగు తరాలుగా మా కుటుంబం కళా సేవలో తరిస్తున్నది. మా తండ్రి సాలార్జంగ్‌ మ్యూజియం క్యూరేటర్‌గా కొనసాగుతున్నారు. శిల్ప, చిత్రకళా ప్రదర్శనను, కళాకారులను ఒకే గూటిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. కళాకారుల్లో ఎంతో నైపుణ్యత ఉంది. వారి కళకు గుర్తింపు రావడానికి వేదికలు అవసరం
- జ్యోతి దాస్‌, నిర్వాహకులు, చిత్రకళా ప్రదర్శన

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...