స్వచ్ఛ నగరం కోసం స్పష్టమైన వ్యూహం..


Sat,July 20, 2019 03:09 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరాన్ని పట్టిపీడిస్తున్న వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు పీసీబీ యంత్రాం గం నడుంబిగించింది. ఎట్టకేలకు కదిలిన అధికారులు వాయుకాలుష్య నియంత్రణకు పరిష్కారమార్గాలను అన్వేషించారు. ఇందుకోసం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించాలని పీసీబీ అధికారులు నిర్ణయించారు. వాహనాలన్నింటికీ ఎప్పటికప్పుడు కాలుష్య తనిఖీలు నిర్వహించడం, సీఎన్‌జీ, ఎల్‌పీజీతో నడిచే వాహనాలను ప్రొత్సహించడం, వ్యక్తిగత వాహనాలను పక్కనబెట్టి ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించడం, వాహన పూలింగ్‌ల ద్వారా కాలుష్యాన్ని అదుపుచేయగలమని అధికారులు భావిస్తున్నారు. ఈ మూడు అంశాలను అనుసరించి నగరవాసులంతా కాలుష్య నియంత్రణకు కృషి చేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) సభ్యకార్యదర్శి వి.అనిల్‌కుమార్ సూచించారు. నగరవాసులంతా సహకరించి చారిత్రక నగరాన్ని క్లీన్ ఏయిర్ నగరంగా, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.

వాహన విస్ఫోటనం..
గ్రేటర్‌లో వాహనాల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. దీనికితోడు కాలంచెల్లిన వాహనాలు సైతం రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యం నగర జీవనాన్ని నరకప్రాయంగా మారుస్తోంది. రవాణా శాఖ తాజా లెక్కల ప్రకారం నగరంలో 60లక్షల పైచిలుకు వాహనాలు ప్రతిరోజూ రోడ్డెక్కుతున్నాయి. వీటి నుంచి వెలువడే పొగ నగరాన్ని కాలుష్యమయం చేస్తోందన్నారు. నగరంలో వెలువడుతున్న కాలుష్యంలో 55శాతం కాలు ష్యం వాహనాల నుంచే వెలువుడుతున్నదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా భారీన పడుతున్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు ముప్పుగా పరిణమించాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను అదుపుచేయడం వల్లే కాలుష్యాన్ని నియంత్రించగలమని భావించిన అధికారులు ఇందుకు నగరవాసుల భాగస్వామ్యాన్ని కోరుతున్నారు.

కాలుష్య తనిఖీలు తప్పనిసరి..
నగరంలో తిరుగుతున్న వాహనాలన్నీ కాలుష్య తనిఖీలు చేయించుకోవాలి. ద్విచక్రవాహనాల నుంచి మొదలుకుంటే భారీ వాహనాల వరకు 6మాసాలకు ఒకసారి చొప్పున కాలుష్య తనిఖీలు చేయించుకోవాలి. కానీ గ్రేటర్‌లో తనిఖీలు తూతూమంత్రంగా సాగుతున్నాయి. కాలుష్య తనిఖీల అంశం రవాణా శాఖ పరిధిలో ఉండటం, ట్రాఫిక్ పోలీసులు తరుచూ ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేయాల్సి ఉండటంతో సమన్వయ లోపం కారణంగా ఇష్టారీతిన నడుస్తున్నాయి. నగర రోడ్లపై 60లక్షలకు పైగా వాహనాలు తిరుగుతుండగా, కేవలం 248 పొల్యూషన్ టెస్టింగ్ వాహనాలు మాత్రమే ఉన్నాయి. నగరవాసులంతా విధిగా వాహనాలను 6 మాసాలకు ఒకసారి చొప్పున తనిఖీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రజారవాణా... వెహికిల్ పూలింగ్..
నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలను విస్తరించడం ద్వారానే కాలుష్యాన్ని అదుపుచేయగలం. నగరంలో పలు రకాలైన ప్రజారవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. నగరంలో 3,700లకు పైచిలుకు బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. ఆర్టీసీ ద్వారా 3 లక్షలు, ఎంఎంటీఎస్ ద్వారా ప్రతిరోజు 2 లక్షలు, ఇటీవలే ప్రారంభమైన మెట్రోలో మరో 3 లక్షల మంది గమ్యం చేరుకుంటున్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులను ప్రవేశపెట్టడం, కొన్ని రూట్లల్లో మినీ బస్సులను నడిపించడం, కొత్త మార్గాల్లో ఎంఎంటీఎస్, మెట్రోను విస్తరించడం ద్వారా కాలుష్యానికి చెక్ పెట్టవచ్చు. నగరవాసులు సైతం సొంత వాహనాలను పక్కనబెట్టి, ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించడం, కార్‌పూలింగ్, టూవీలర్ పూలింగ్‌ను ఎంచుకొని కాలుష్య నియంత్రణకు కృషి చేయాలని పీసీబీ అధికారులు సూచిస్తున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...