నల్లని మబ్బులు చల్లని జల్లులు


Wed,July 17, 2019 03:32 AM

-సరూర్‌నగర్‌లో 3.6 సెంటీమీటర్లు
-నైరుతి రుతుపవనాలు అనుకూలంగా ఉన్నాయంటున్న వాతావరణ శాఖ
-రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌లో మంగళవారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సరూర్‌నగర్‌లో 3.6 సెంటీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. హిమాయత్‌నగర్‌లో 2.6, ఉప్పల్‌లో 2.5, నాగోల్‌లో 1.9, అసిఫ్‌నగర్‌లో 1.8 సెంటీ మీటర్ల మేర వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ల, టోలీచౌకీ, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, తార్నాక, ఉప్పల్, నాగోల్, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, సాగర్ రోడ్డు, ఎల్బీనగర్, వనస్థలిపురం, చంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. మధ్యాహ్న సమయంలో దాదాపు ఆరగంటపాటు కురిసిన వర్షంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి...మ్యాన్‌హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. ముఖ్యమైన కూడళ్లలో వర్షపు నిలిచిపోవడంతో జీహెచ్‌ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, జలమండలి శాఖలు ఆప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. మాన్‌సూన్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలతో వాహనదారుల ఇబ్బందులను తొలగించారు. కాగా మందగమనంలో ఉన్న రుతుపవనాలు అనుకూలంగా మారడంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు బలంగా వీస్తున్నాయని, బుధ, గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని చెప్పారు. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.

సహాయక చర్యల్లో బల్దియా సిబ్బంది
నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సుమారు 50చోట్ల రోడ్లపై నీరు నిలిచింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు కూలాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్‌ఎంసీకి చెందిన మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూటీమ్‌లు వెంటనే రంగంలోకి దిగి నీరు నిలిచిన ప్రాంతాల్లో నీరు సాఫీగా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశాయి. హిమాయత్‌నగర్ తెలుగు అకాడమీ ఎదురుగా, అంబర్‌పేట్‌లోని చెన్నారెడ్డినగర్ ప్రాంతాల్లో చెట్టు నేలకూలడంతో వెంటనే డీఆర్‌ఎఫ్ బృందాలు వాటిని తొలగించాయి. సీతాఫల్‌మండీలో నాలాలో నీటి ప్రవాహానికి కేబుల్ పైప్‌లైన్లు అడ్డుగా రావడంతో వాటిని తొలగించి నీరు వెళ్లే విధంగా తగిన ఏర్పాట్లు చేశారు. హిమాయత్‌నగర్, మాదాపూర్, బంజారాహిల్స్, అంబర్‌పేట్, ఐఎస్‌సదన్, యాకత్‌పుర, టోలీచౌకీ, షేక్‌పేట్, అమీర్‌పేట్, శ్రీనగర్‌కాలనీ, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు నీటిని తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశాయి. దీంతోపాటు జీహెచ్‌ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నగరంలో నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించి అధికారులు సమీపంలోని మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలకు సమాచారం అందించి సహాయక చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...