సందేహాలన్నీ నివృత్తి


Sun,July 14, 2019 02:54 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రతి ఒక్కరూ వైద్య వృత్తినే దైవంగా భావిస్తారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు పునర్జన్మ అందించే శక్తి ఒక్క వైద్యుడికే ఉంది. అలాంటి సేవలందించాలంటే వైద్య విద్యను ఔపోసన పట్టాలి. వైద్యుడి గొప్పతనం పల్లె నుంచి పట్నం వరకు అందరికి సుపరిచితమే. అందుకే చాలామంది తమ పిల్లలను డాక్టర్ చేయాలని కళలుకంటారు. ఇక్కడ సరైన కాలేజీలో సీటు రాకపోతే విదేశాల్లో వైద్య కోర్సు చేయించడానికి కూడా వెనకాడరు. కొంతమంది సాధరణంగానే విదేశాలను ఎంచుకోటానికి ఆసక్తి చూపిస్తారు. అయితే విదేశం అనగానే తల్లిదండ్రుల్లో కొంత టెన్షన్.. భయం మొదలవుతుంది. ఇతర దేశానికి తమ బిడ్డలను పంపించాలంటే అనేక ఆలోచనలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఏ దేశంలో ఎంబీబీఎస్ కోర్సు బాగుంటుంది? ఎంత ఫీజులు ఉంటాయి? వసతులు ఎలా ఉంటాయి? ఇంతకుముందు ఆ కాలేజీల్లో చదివిని తెలుగు వాళ్లు ఎవరైనా ఉన్నారా? తదితర విషయాలను తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఆరాట పడుతారు. అలాంటి వారి కోసం టీన్యూస్ ఆధ్వర్యంలో శనివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2019ను ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించారు. అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ఫెయిర్‌కు విశేష స్పందన
మొదటి రోజు ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు విశేషస్పందన వచ్చింది. వివిధ దేశాలకు చెందిన వైద్య యూనివర్సిటీలు 30కిపైగా తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఎంబీబీఎస్ కోర్సు అందించే విదేశీ యూనివర్సిటీల సమాచారం ఒకే వేదిక వద్ద తెలుసుకునే అద్భుత అవకాశం లభించిందని పేరేంట్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఫిలిప్పిన్స్ దావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్, సెయింట్ పాల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్, జియోర్జియన్ అమెరికన్ యూనివర్సిటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ, కిైర్గెజ్ స్టేట్ మెడికల్ అకాడమీ, ఆదిత్య ఓవర్సీస్ ఎడ్యుకేషన్, సెంట్రల్ అమెరికా, అర్మేనియా, అపెక్స్ కన్సల్టెన్సీ, న్యూఎరా ఎన్‌లైట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, విస్‌డమ్ ఓవర్సీస్, ఆస్ట్రేలియన్ కేరీర్ కాలేజీ, కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. తల్లిదండ్రులు కోరిన సమాచారం ఇచ్చాయి. ఏ దేశంలో ఎంబీబీఎస్ కోర్సు చేస్తే భవిష్యత్ బాగుంటుంది? ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి తదితర విషయాలపై వైద్య నిపుణులు సైతం సలహాలు, సూచనలు చేశారు. పిల్లలను వెంటతీసుకొని తల్లిదండ్రులు వచ్చి వివిధ స్టాళ్లకు వెళుతూ సమాచారం సేకరించుకున్నారు. ముఖ్యంగా ఫీజుల వివరాలు, కాలేజీల సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీలకు సంబంధించిన స్టాఫ్‌తో నేరుగా మాట్లాడి అక్కడి దేశంలో ఎంబీబీఎస్‌కు ఉన్న డిమాండ్‌ను తెలుసుకున్నారు.

అనేక ప్రశ్నలకు సమాధాన వేదిక ఫెయిర్
నాణ్యమైన విద్యను అభ్యసిస్తేనే వైద్యుడిగా స్థిరపడగలం. అలాంటి కోర్సును చదువాలంటే కాలేజీ ఎంపిక చాలా ప్రధానం. ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ కావాలంటే మొదటగా ఆ కాలేజీలో సదుపాయాలను పూర్తిగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాలేజీకి అనుబంధంగా వైద్యశాలలు ఉన్నాయా అనేది కచ్చితంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ల్యాబ్‌ల సదుపాయం ఎలా ఉందో కూడా ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కళాశాలలను ఎంపిక చేసే ముందర వీటన్నింటి గురించి ఆలోచించుకోవాలని తల్లిదండ్రులకు ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అవగాహన కల్పిస్తున్నది.

డాక్టర్ అవ్వాలన్నది చిన్నప్పటి కల
చైతన్య కాలేజీలో ఇంటర్ చదివాను. ఎంసెట్ నాకు వచ్చిన ర్యాంకుకు అనుగుణంగా ఏ కాలేజీ అయితే బాగుంటుందో తెలుసుకున్నాను. ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌తో మా అనుమానాలు చాలా వరకు నివృత్తి అయ్యాయి. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. విదేశాల్లో ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుందో సంబంధిత స్టాఫ్‌ను అడిగి తెలుసుకున్నాను. ఫెయిర్ నిర్వహించిన టీన్యూస్‌కు చాలా థ్యాంక్స్.
-నిహారిక, సికింద్రాబాద్

నా మనవరాలిని డాక్టర్‌గా చూడాలనుకుంటున్న
లక్షల్లో ఫీజులు కట్టిన తర్వాత నాణ్యమైన చదువు లభించకపోతే వృథా. నేను నా మనవరాలిని డాక్టర్‌గా చూడాలనుకుంటున్నాను. ఇందుకోసమే ఈ ఫెయిర్ జరుగుతున్నట్లు న్యూస్‌లో చూశాను. వెంటనే ఇక్కడికి వచ్చాను. వివిధ దేశాల యూనివర్సిటీల సిబ్బందితో మాట్లాడే అవకాశం ఒకే చోట లభించింది. ఫెయిర్ నిర్వహించడం మంచి నిర్ణయం. ఎంబీబీఎస్‌కు యూరోపియన్ కంట్రీస్ అయితే బాగుంటాయని నా నిర్ణయం. అక్కడా ఇంగ్లిష్‌లోనే బోధన ఉంటుంది. అంతేకాదు అక్కడ ఇంగ్లిష్ మాట్లాడుతారు. -ఓంప్రకాశ్, విశ్రాంత ఇంజినీర్, నల్లకుంట

టీ న్యూస్‌కు ప్రత్యేక అభినందనలు
నా కొడుకులను డాక్టర్ చదివించాలనుకుంటున్నాను. అయితే ఏ కాలేజీ బాగుంటుంది? ఏ దేశంలో సెక్యూరిటీ ఉంది? అనే విషయాలు తెలసుకోవడానికి చాలా రోజులు ప్రయత్నించాను. కానీ పూర్తి సమాచారం దొరకలేదు. కానీ ఇక్కడికి వచ్చాక మా అనుమానాలు తొలగిపోయాయి. ఏ దేశంలో ఎంబీబీఎస్ కోర్సు ఎలా ఉంటుందనేది మాకు ఓ ఐడియా వచ్చింది. ఫెయిర్ నిర్వహించిన టీన్యూస్‌కు ప్రత్యేకంగా అభినందనలు.
-కిశోర్‌కుమార్, శ్రీకాకుళం

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...