ఆస్తిపన్నులో హెచ్చు తగ్గులకు చెక్ !


Thu,July 11, 2019 01:13 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఒకే ప్రాంతం, ఒకే వైశాల్యంగల భవనం.. అయినా ఆస్తిపన్ను మాత్రం ఒకదానికి కేవలం రూ. 300 ఉంటే మరో భవనానికి రూ. 30వేలు ఉంది. అధికారుల అవినీతి కారణంగా ఈ విధమైన అసాధారణ హెచ్చుతగ్గులు నగరంలో కోకొల్లలు. బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడంలేదు. దీంతో కొందరు పన్నులు చెల్లించడం మానేశారు. ఇటువంటి పరిస్థితిని అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ సరికొత్త మొబైల్ యాప్‌ను రూపొందించింది. పన్నుల్లో హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ నిర్ణీత ధరల ప్రకారమే పన్ను విధించేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను డేటా ప్రకారం నగరంలో సుమారు 16లక్షల ఇళ్లు ఉన్నాయి. రూ. 1200లోపు పన్ను పరిధిలోని భవనాలన్నీ దాదాపు నివాస భవనాలు కాగా, మిగిలినవి చాలావరకు పెద్ద భవనాలు, వాణిజ్య భవనాలుగా చెప్పవచ్చు. నివాస భవనాలకు దాదాపు రెండు దశాబ్ధాలుగా పన్ను పెంచలేదు. దీంతో బల్దియా అధికారులు తరచూ ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ పన్ను సవరణ చేస్తున్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం అద్దె విలువలో 30శాతం ఆస్తిపన్నుగా నిర్ణయించాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా ప్రాంతాలవారీగా అద్దెలపై శాస్త్రీయ పద్ధతుల్లో సర్వే నిర్వహించాలి. అనంతరం అద్దె ధర నిర్ణయించి దాని ప్రకారం పన్ను నిర్ధారణ చేయాలి. అయితే, గతంలో జీహెచ్‌ఎంసీ నిర్వహించిన సర్వే లోపభూయిష్టంగా సాగింది. అధికారులు, సర్వే సిబ్బంది లంచాలు దండుకుంటూ ఆఫీసులో కూర్చొని ఇష్టారాజ్యంగా పన్నులు నిర్ధారించారు. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడా లేకుండా ఖరీదైన ప్రాంతాల్లోని విలాస భవనాలకు సైతం నామమాత్రంగా పన్ను విధించగా, మారుమూల ప్రాంతాల్లోని చిన్నచిన్న ఇళ్లకు సైతం వేలల్లో పన్నులు విధించారు. దీంతో అధికపన్నుల భారం పడినవారు అవి చెల్లించలేక అనేక ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు.

ఎవరో వేసిన పన్నును మేమెలా సవరిస్తాం....?
అధికపన్నులను తగ్గించాలని అధికారుల చుట్టూ తిరుగుతుంటే ఫలితం ఉండడంలేదు. రోజూ సర్కిల్, జోనల్ కార్యాలయాలతోపాటు ప్రధాన కార్యాలయానికి వందలసంఖ్యలో బాధితులు పన్ను తగ్గింపు కోరుతూ అర్జీలు పెట్టుకుంటున్నారు. అయినా వారి గోడును పట్టించుకునే నాథుడు లేడు. బాధితుల అర్జీలను కమిషనర్ నుంచి సంబంధిత అధికారులకు చేరుతుంటే, వారు వాటిని క్షేత్రస్థాయి సిబ్బందికి పంపుతూ చేతులు దులుపుకుంటున్నారు. కాగా, ఒక్కసారి బల్దియా డేటాలో పన్ను నమోదయ్యాక దాన్ని సవరించడం మావల్లకాదని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. అప్పట్లో పన్ను నిర్థారించినవారు ఇప్పుడు బదిలీ అయ్యారని, వారు నిర్థారించిన పన్నును సవరించడం మావల్లకాదని వారు చేతులెత్తేస్తున్నారు. దీంతో పన్ను బాధితుల గోడు అరణ్యరోదనగానే మిగులుతోంది.

హెచ్చుతగ్గుల నివారణకు యాప్ దోహదం....
ఆస్తిపన్ను నిర్థారణలో పారదర్శకత తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ అత్యాధునిక మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ సహాయంతో పన్ను సవరణకు అన్నిరకాల భవనాలపై దశలవారీగా సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా రూ. 1200ల నుంచి రూ. ఒక లక్ష వరకు పన్ను పరిథిలోని సుమారు 2.6లక్షల ఇళ్లను, అనంతరం రూ. ఐదు లక్షల వరకు భవనాలపై సర్వే నిర్వహించాలని నిశ్చయించారు. ఆ తరువాత అంతకన్నా ఎక్కువ పన్ను చెల్లించే ఆస్తులపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు. సర్వే సందర్భంగా పన్నుల విభాగం సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ఆస్తుల ఫొటోతోపాటు దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తారు. మొబైల్ యాప్ ద్వారా సేకరించిన ఆస్తుల ఫొటోలు, ఇతర వివరాలను బల్దియా డేటాబేస్‌లో నిక్షిప్తంచేస్తారు. ఆస్తి యథావిథిగా ఉం దా, లేక అదనపు అంతస్తులు నిర్మించారా, అలాగే, నివాసానికి ఉపయోగిస్తున్నారా, లేక వాణిజ్యానికి ఉపయోగిస్తున్నారా అనే అంశాలను సర్వే సందర్భంగా గుర్తిస్తారు. దీని ఆధారంగా పన్నును సవరిస్తారు. ఎంతోకాలంగా తక్కువ పన్ను చెల్లిస్తున్నవారి పన్నులు నిబంధనల ప్రకారం పెరిగే అవకాశం ఉండగా, ఇంతకాలం అధిక పన్నులు చెల్లిస్తున్నవారి పన్ను తగ్గే వీలుంది. త్వరలో సర్వే ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...