నెట్టింట్లో.. ఇంటి పని


Wed,July 10, 2019 12:37 AM

-ఆన్‌లైన్ సాయంతో హోంవర్క్ చేస్తున్న విద్యార్థులు
-71 శాతం మంది అటువైపే..
-భవిష్యత్తులో కీలకం కానున్న ఇంటర్‌నెట్
-హోంవర్క్ చేయకపోవడానికి అనేక సాకులు
- బ్రెయిన్లీ సర్వేలో వెల్లడి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పాఠశాలల్లో ఇచ్చిన హోంవర్క్‌ను విద్యార్థులు ఆన్‌లైన్ సాయంతో పూర్తి చేస్తున్నారు. 71 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు బ్రెయిన్లీ నిర్వహించిన సర్వేలో తేలింది. విద్యార్థులు హోంవర్క్ చేసే తీరుపై అతిపెద్ద ఆన్‌లైన్ పీర్ టు పీర్ లెర్నింగ్ కమ్యూనిటీ సంస్థ బ్రెయిన్లీ సర్వేను నిర్వహించింది. రెండు వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ సర్వేలో సమయానికి హోంవర్క్ పూర్తి చేయకపోవడానికి చెప్పే సాకులు, ఇతర కారణాలపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాగా 71 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో తగిన సాయం పొందడం ద్వారా హోంవర్క్‌ను సమయానికి పూర్తి చేశామని చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులకు మంచి ప్రయోజనం చేకూర్చడంలో ఇంటర్‌నెట్ కీలకం కానున్నట్లు ఈ సర్వేలో తేలిందనే విషయాన్ని గమనించాల్సిందే.

62 శాతం మంది సమయానికే..
నగరంలో 43 శాతం మంది విద్యార్థులు హోంవర్క్‌ను సమయానికి పూర్తి చేయడం లేదని, దానికోసం సాకులు చెప్పాల్సి వస్తుందని అంగీకరించారు. కానీ 62 శాతం మంది విద్యార్థులు సకాలంలో హోంవర్క్‌ను పూర్తి చేయడంతో పాటు తామేప్పుడూ సాకులు చెప్పడం లేదని, 30 శాతం మంది మాత్రం తరచూ సాకులు చెబుతున్నట్టు తేలింది. అలా సాకులు చెప్పడం వల్ల 45 శాతం మంది చాలాసార్లు పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయామని అంగీకరించగా, 36 శాతం మంది దాదాపు ప్రతిసారీ విజయం సాధించినట్టు పేర్కొన్నారు

హోంవర్క్ గడువు పొడిగింపులకు సాకులు..
హోంవర్క్, ప్రాజెక్టు, పేపర్ల గడువు పొడిగించేందుకు తరచూ సాకులు ఉపయోగిస్తున్నారా? అన్న ప్రశ్నకు 69 శాతం మంది ఎప్పుడు సాకులు చెప్పబోమని, 15.8 శాతం మంది ప్రతిసారీ సాకులు చెబుతామని, 14.4 శాతం మంది అప్పుడప్పుడు చెబుతామని బదులిచ్చారు.

హోంవర్క్‌ను సకాలంలో
పూర్తి చేస్తారా?
ఇచ్చిన హోంవర్క్‌ను సకాలంలో పూర్తి చేస్తారా? మిస్ చేస్తారా? అసంపూర్తిగా చేస్తారా? అన్న ప్రశ్నకు అలా ఎప్పుడు చేయబోమని 50.8 శాతం, సంవత్సరంలో ఒకటి రెండు సార్లు చేస్తామని 22 శాతం మంది, ఏడాదిలో 7 సార్లు చేస్తామని 14.1 శాతం మంది, సంవత్సరంలో మూడు నాలుగుసార్లు వదిలేస్తామని 8.7 శాతం, ఐదు ఆరు సార్లు మాకున్న అడ్వాంటేజ్‌లను ఉపయోగించుకొని అసంపూర్తిగా వదిలేస్తామని 4.4 శాతం మంది విద్యార్థులు సమాధానాలిచ్చారు.

చిన్న సాకులే అధికం..
హోంవర్క్ ఎగ్గొట్టేందుకు చెప్పే సాకు ఏంటని విద్యార్థులు ప్రశ్నించగా, పోగొట్టుకున్నామని 18.7 శాతం మంది, గాయపడ్డామని 14.6 శాతం, అనారోగ్యం చేసిందని 14.1 శాతం, వైఫై లేదా సాంకేతిక కారణాల వల్ల చేయలేకపోయామని 12.1 శాతం, అనుకోకుండా ఇంట్లో అత్యవసర పని చేయాల్సి రావడం వల్ల అని 9.8 శాతం, హోంవర్క్‌ను కుక్క చింపిందని 4 శాతం, బంధువులకు ప్రమాదం జరుగడంతో చేయలేకపోయామని 2.9 శాతం, ఇతర కారణాలతో చేయలేకపోయామని 23.9 శాతం మంది విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

తరచూ చెప్పే కారణం..
హోంవర్క్ చేయకపోవడాడినిక తరచూ 43.3 శాతం మంది విద్యార్థులు మర్చిపోయామని చెబుతున్నారని తేలింది. బ్యాక్ ప్యాకెట్‌లో పెట్టుకుంటే ఎవరో దొంగిలించారని 13.1 శాతం, కాఫీ పడిందని 8.2 శాతం, ల్యాప్‌టాప్ చెడిపోయిందని 6.1 శాతం, కుక్క చింపిందని 5.3 శాతం, వేరే క్లాసులో పెట్టానని 4.4 శాతం, చిన్న పిల్లలు చింపారని 4.4 శాతం, గాలికి చేతుల్లోంచి ఎగిరిపోయిందని 4 శాతం, కాలిపోయిందని 3.4 శాతం మంది విద్యార్థులు తరచూ హోంవర్క్ నుంచి తప్పించుకునేందుకు చెప్పే సాకులని సర్వేలో తేలింది.
ఆన్‌లైన్ సాయంతో హోంవర్క్ సులభతరం..
ఆన్‌లైన్ సాయంతో హోంవర్క్ సకాలంలో పూర్తి చేస్తున్నట్లు ఎక్కువ శాతం మంది విద్యార్థులు తెలిపారు. 77.5 శాతం మంది ఆన్‌లైన్ సాయంతో సకాలంలో హోంవర్క్‌ను పూర్తి చేస్తున్నామని చెబితే.. 13.2 శాతం తెలియదని, 9.3 శాతం మంది విద్యార్థులు సకాలంలో పూర్తి కాదని చెప్పారు.

అదనపు సమయం కోరుతారా?
పాఠశాలలో ఇచ్చిన హోంవర్క్‌ను పూర్తి చేసేందుకు అదనపు సమయం గానీ, సెలవు గానీ కోరుతారా అని అడగ్గా, ఎప్పుడో ఒకసారి అని 45 శాతం మంది విద్యార్థులు చెప్పగా, ప్రతిసారి అదనపు సమయం అడుగుతామని 36 శాతం మంది, బహుశా సగం సమయం అడుగుతామని 19 శాతం మంది విద్యార్థులు సమాధానాలిచ్చారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...