శాశ్వత బృందాలు..


Wed,July 10, 2019 12:34 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రతిఏటా వర్షాకాలంలో సహాయక చర్యలకోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ఉపయోగించే మాన్‌సూన్ రిలీఫ్ టీమ్‌లు, ఇన్‌స్టెంట్ రిపేర్ టీమ్‌లు, సెంట్రల్ ఎమర్జెన్సీ టీమ్‌లు త్వరలో రద్దుకానున్నాయి. వీటిస్థానంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లు శాశ్వత ప్రాతిపదికన పనిచేయనున్నాయి. వచ్చే ఏడాదినుంచి శాశ్వత బృందాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే దిశగా జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తుంది. దీనివల్ల సుమారు రూ. 30 కోట్లకు పైగా ఆదా అవుతుందని అధికారుల అంచనా. జీహెచ్‌ఎంసీ ఏటా వర్షాకాలంలో ముం పు ప్రాంతాల్లో నీరు తొలగింపు, చెట్ల కొమ్మల తొలగింపు, రోడ్ల మరమ్మతులు, ఇతర విపత్తుల సందర్భంగా సహాయక చర్యలు చేపట్టేందుకు నాలుగు నుంచి ఆరునెలల కోసం రూ. 35 కోట్ల వ్యయంతో ప్రత్యేక బృందాలను నియమిస్తుంది. ఇన్నిరకాల బృందాలున్నా ఆశించిన ఫలితాలు రావడంలేదు. అంతేకాదు, ఈ బృందాలపై పర్యవేక్షణ లేకపోవడంతో అవి వాస్తవంగా పనిచేస్తున్నాయో లేదో అంతుబట్టడంలేదు. కాగితాలపైనే బృందాలు ఉన్నట్లు, వాటిపై వెచ్చిస్తున్న సొమ్ము అధికారుల జేబుల్లోకి చేరుతుందనే ఆరోపణలున్నాయి. మరోవైపు, ఇటీవల వీధిలైట్ల విభాగంతోపాటు వివిధ విభాగాల్లో పనిలేకుండా ఉన్న దాదాపు 350 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటుచేశారు. వర్షాకాలంలో ఏర్పడే ముంపు సమస్యే కాకుండా ఎక్కడ ఎటువంటి విపత్తులు సంభవించినా వెంటనే ఈ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. అంతేకాదు, నిబంధనలను ఉల్లంఘించేవారిని గుర్తించి జరిమానాలు విధించేందుకు కూడా ఈ బృందాలు పనిచేస్తున్నాయి. ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు, అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, సైన్‌బోర్డుల తొలగింపు, బాధ్యులకు జరిమానాలు, ఫైర్‌సేఫ్టీలేని కోచింగ్ సెంటర్ల సీజింగ్, ముంపు ప్రాం తాల్లో నీటి తొలగింపు, రోడ్లపై, చెరువుల్లో వ్యర్థాలు వేయకుండా నిఘా, శిథిల భవనాల కూల్చివేతలు, అగ్నిప్రమాదాల వంటివి జరిగినప్పుడు సహాయక చర్యలు తదితర అనేక విధులను ఈ బృందాలు నిర్వహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, తాజాగా బల్దియా నిర్వహించే వివిధ విధుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి ప్రత్యేకంగా ఎటువంటి బృందాలనూ నియమించకుండా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలనే అన్ని విధులకూ ఉపయోగించుకోవాలని, చివరికి ఆస్తిపన్ను వసూళ్లకు కూడా వారి సేవలు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఎలాగో వీరికి ప్రతినెలా వేతనాలు చెల్లిస్తున్నందున ఆయా సీజన్లలో వారికి తగిన విధులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఇప్పటికే మాన్‌సూన్ బృందాలకు టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో వచ్చే ఏడాది నుంచి ఎటువంటి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయరాదని నిశ్చయించారు. దీనివల్ల ఏటా వాటికి వెచ్చిస్తున్న రూ. 30 నుంచి రూ. 35 కోట్ల వరకూ ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా శాశ్వత బృందాలతో పారదర్శకత ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...