గురుకులాలు భవితకు నిలయాలు


Tue,June 18, 2019 04:09 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గురుకులాలు..ఆదికాలం నుంచి వేద కాలం వరకు విద్యనందించిన ఆశ్రమాలు. పేద వర్గాలకు విద్యాబుద్ధులు నేర్పిన సరస్వతీ నిలయాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 15 గురుకులాలు ప్రారంభమయ్యయి. మన్సూరాబాద్‌ కామినేని వెనకాల ఏర్పాటు చేసిన గోషామహల్‌, ముషీరాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల గురుకులాలను మంత్రులు మహమూద్‌అలీ, కొప్పులు ఈశ్వర్‌, వి. శ్రీనివాస్‌గౌడ్‌, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, బీసీ కమిషన్‌ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‌, జూలూరి గౌరీశంకర్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొని ప్రారంభించారు.

30కి చేరిన బీసీ గురుకులాలు..
సోమవారం ప్రారంభించిన వాటితో జిల్లాలో బీసీ గురుకులాల సంఖ్య 30కి చేరింది. 2017లో 15 గురుకులాలను ప్రారంభించగా, 2019 -20 విద్యాసంవత్సరానికి గాను కొత్తగా 15 గురుకులాలను ఏర్పాటు చేశారు. కొత్త వాటిలో ఏడు బాలురకు, ఎనిమిదింటిని బాలికల కోసం కేటాయించారు. పాత గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతుల వరకు నిర్వహిస్తుండగా, 400 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. కొత్తగా ప్రారంభించిన వాటిలో సెక్షన్‌కు 40 మంది.. రెండు సెక్షన్ల చొప్పున 5,6,7వ తరగతులను నిర్వహించనుండగా, 240 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. ఈ గురుకులాలు అట్టడుగువర్గాల విద్యార్థులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ.. బంగారు భవిష్యత్తునందిస్తున్నారు. కేవలం విద్యనందించడానికే పరిమితం కాకుండా విద్యార్థి సమగ్ర వికాసానికి బాటలు వేస్తున్నాయి. ఆటలు, పాటలు, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులకు తర్పీదునందిస్తున్నాయి.

గురుకులాల్లో మెరుగైన విద్య
ముషీరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీసీ గురుకులాల్లో మెరుగైన విద్యనందిస్తారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (బాలికల)ను మన్సూరాబాద్‌ ఎంఆర్‌ఆర్‌ కాంప్లెక్స్‌ భవన సముదాయంలో మంత్రులు మహమూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ దేశం గర్వీంచేలా సీఎం కేసీఆర్‌ బడుగు, బలహీన వర్గాల పిల్లల కోసం రెసిడెన్షీయల్‌ పాఠశాలలు ఏర్పాటు చేసిన నాణ్యమైన విద్యనందిస్తున్నారన్నారు. కార్పొరేట్‌కు దీటుగా రెసిడెన్షీయల్‌ పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, పోషక విలువల ఆహారం, వసతి కల్పిస్తున్నారన్నారు.

నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ గురుకుల రెసిడెన్షీయల్‌ పాఠశాలల ఏర్పాటుకు పూనుకున్నారని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు.కార్యక్రమంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌.రాములు, రచయిత జూలూరి గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

గురుకులాల్లో‘కార్పొరేట్‌' స్థాయి విద్య
ఉప్పల్‌, నమస్తే తెలంగాణ : గురుకులాల్లో కార్పొరేట్‌ పాఠశాలల స్థాయి విద్య అందుతుందని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఉప్పల్‌ నియోజకవర్గానికి చెందిన బీసీ గురుకుల పాఠశాలను మేడిపల్లిలో సోమవారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. పేద కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందించడానికి గురుకులాలను తీసుకువచ్చారని పేర్కొన్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ను ఇవ్వడానికి గురుకులాలు ఎంతో తోడ్పడుతాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రాన్సెస్‌, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం రవి, గరిక సుధాకర్‌, బన్నాల ప్రవీణ్‌ముదిరాజ్‌, తవిడబోయిన గిరిబాబు, పల్లె నర్సింగరావు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

గురుకులాల ఏర్పాటు చారిత్రాత్మకం
అంబర్‌పేట, నమస్తే తెలంగాణ : గురుకులాల ఏర్పాటు చారిత్రాత్మకమని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. అంబర్‌పేట నియోజకవర్గ బీసీ బాలికల గురుకుల పాఠశాలను హయత్‌నగర్‌, మునుగనూర్‌, నారాయణ కళాశాలలో సోమవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఒకే రోజు 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభించడం బీసీలకు శుభదినమన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ వెంకటనర్సయ్య, ఎస్‌.ఓ భాస్కర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ జానకిరాం, టీచర్లు సుజాత, కవిత తదితరులు పాల్గొన్నారు.

బీసీ గురుకులాల్లోడిజిటల్‌ తరగతులు
కీసర: దేశంలోనే ఎక్కడా లేని విధంగా డిజిటల్‌ తరగతులతో గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. భోగారంలోని తిరుమల ఇంజినీరింగ్‌ కళాశాలో మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, ఖైరతాబాద్‌ ఏరియాలకు చెందిన బీసీ గురుకుల పాఠశాలను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 119 గురుకుల పాఠశాలను ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే అన్ని సౌకర్యాలతో 281 గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా మన గురుకుల పాఠశాలలు ఉన్నాయని, ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.1.20 లక్షల రూపాయలు వెచ్చిస్తుందన్నారు.

ప్రభుత్వం సన్నబియ్యంతో నాణ్యత విద్యను అందిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కలలను సాకారం చేయడానికి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తుందన్నారు. ఈ లెర్నింగ్‌ క్లాస్‌ రూంలో విద్యను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, గురుకుల పాఠశాలల జిల్లా డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ రాజన్న, బీసీ జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రావు, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, జడ్పీటీసీ బెస్త వెంకటేశ్‌, బోగారం సర్పంచ్‌ సుంకరి జైహింద్‌రెడ్డి, మాధురి వెంకటేశ్‌, ఆకిటి మహేందర్‌రెడ్డి, ఘట్‌కేసర్‌ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీటీసీలు తటాకం నారాయణశర్మ, సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు మిట్టపల్లి అంజయ్యగౌడ్‌, పడమటి నర్సింహారెడ్డి, చెప్పాల వెంకట్రాంరెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...