ఉచ్ఛాస నిశ్వాసలకు రక్తమే ఇంధనం


Fri,June 14, 2019 12:53 AM

నమస్తేతెలంగాణ, సిటీబ్యూరో: దేహంలోని అవయవాలకు ప్రాణవాయువును చేరవేసే ఒక వాహకమే రక్తం. మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో రక్తం కూడా అంతే ముఖ్యం. శ్వాస ద్వారా మనం తీసుకున్న ప్రాణవాయువు(ఆక్సిజన్)ను రక్తం శరీరంలోని ప్రధాన అవయవాలైన శరీరంలోని అన్ని అవయవాలకు చేరవేస్తుంది. ప్రమాదాల్లో రక్తం కోల్పోయినప్పుడు మెదడు, గుండె తదితర అవయవాలకు రక్త సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక అవయవాలు పనిచేయడం మానేస్తాయి. దీంతో బాధితుడు మరణించే ప్రమాదం ఉంటుంది. అందుకే వెంటనే రక్తం ఎక్కిస్తుంటారు. అలాగే శస్త్ర చికిత్సల్లోనూ రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రక్తదానానికి ప్రాముఖ్యత పెరిగింది. రక్తదాన ఆవశ్యక్తతను గుర్తించి, రక్తం దానం చేసే దాతలను ప్రోత్సహించే క్రమంలో ప్రతి ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాన అవగాహన దినోత్సవంగా పరిగణిస్తారు.

అత్యవసర పరిస్థితుల్లో..
ఓ-పాజిటీవ్ రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో అన్ని పాజిటీవ్ గ్రూప్‌ల వారికి ఎక్కించవచ్చు. కానీ నెగిటివ్ గ్రూపులకు అంటే ఎ-నెగిటివ్, బి-నెగిటివ్, ఎబి-నెగిటివ్, ఓ-నెగిటివ్ గ్రూపు రక్తం గలవారికి ఎక్కించరాదు.

రక్తంలోని అంశాలు..
రక్తంలో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్స్, ప్లాస్మా అనే నాలుగు ప్రధానమైన పదార్థాలుంటాయి. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రక్తాన్ని హైస్పీడ్ రెవల్యూషన్ పద్ధతి ద్వారా వీటిని వేరు చేస్తారు. సాధారణంగా రోగులకు ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను ఎక్కిస్తారు.

వినియోగం ఇలా..
ఎర్ర రక్త కణాలు శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తాయి. వీటిని 2-6 డిగ్రీల సెంటిగ్రేట్ మధ్య 43 రోజుల పాటు నిలువ ఉంచవచ్చు. ప్లేట్‌లెట్స్ కణాలు రక్తస్రావాన్ని అరికడతాయి. శస్త్ర చికిత్సల సమయంలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. కాలిన గాయాలు జరిగిన బాధితులకు ఎక్కువగా ప్లాస్మాను ఎక్కిస్తారు. వీరిలో రక్తంలోని ద్రవ పదార్థం శరీరం నుంచి ఆవిరైపోతుంది.

తొమ్మిది రకాలు..
ఎముకలోని మజ్జ నుంచి జనించే రక్తంలో మొత్తం ఎనిమిది ప్రధాన గ్రూపులున్నాయి. దీంతో పాటు మరో అరుదైన గ్రూపునకు చెందిన రక్తం ఉంది. ఎనిమిది ప్రధాన గ్రూపుల్లో ఏ, బీ, ఏబీ, ఓ గ్రూప్‌లకు చెందిన పాజిటీవ్, నెగిటీవ్ గ్రూపులుంటాయి. చాలా అరుదైన గ్రూప్ బాంబే బ్లడ్‌గ్రూప్. ఇది 10 వేల మందిలో ఒక్కరికి మాత్రమే ఉంటుందని నిమ్స్ బ్లడ్‌బ్యాంక్ విభాగం అధిపతి డాక్టర్ ఎస్.పాండురంగారావు తెలిపారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...