నిబంధనలకు నీళ్లు.. ప్రాణాలు గాలికి!


Fri,June 14, 2019 12:52 AM

పాఠశాలలకు జీ ప్లస్ టూ..
నగరంలో ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు రెండు అంతస్తులు(జీ ప్లస్ టూ)లోనే నిర్వహించాల్సి ఉన్నది. కానీ నగరంలో ఎక్కడా ఈ నిబంధనలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాటించడంలేదు. అనుమతి సమయంలో జీ ప్లస్ టూ భవనాన్ని చూపించి.. అనంతరం అక్రమంగా బహుళ అంతస్తులు, వ్యా పార సముదాయాల్లోకి మారుతున్నారు. పైఅంతస్తుల్లో తరగతులు నిర్వహించే పక్షంలో గ్రిల్స్‌ను ఏర్పాటు చేయాలి. వీటితో పాటుగా ప్రతి పాఠశాలలోనూ మానసిక నిపుణుడిని నియమించాలి. ఎందుకంటే.. నాగోల్ తరహా ఘటనలు జరిగిన పక్షంలో ముందుగా దాన్ని చూసేది తోటి విద్యార్థులే. వారికి రెండు మూడు వారాల వరకు ఆ ఘటన కండ్లముందే కదలాడుతుంది. దాంతో వారు భయభ్రాంతులకు గురై రాత్రిళ్లు కలవరించడం, ఉలిక్కిపడడం వంటివి చేస్తుంటారు. ఈ ఘటనలతో పిల్లలు మానసికంగా ఎంతో భయాందోళన చెందుతారు.

చట్టాలను ఖాతరు చేయని ప్రైవేటు స్కూళ్లు..
జీఓ ఎంఎస్ నం.1(జనవరి 1994) ప్రకారం ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులో 50 శాతం నిర్వహణ, ఇతర ఖర్చులకు వెచ్చించాలి. కేవలం 5 శాతం మాత్రమే లాభాలు తీసుకోవాలి. ఈ మేరకు ఏటా ఆర్థిక నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలి. అలాగే జీఓ నం.1 ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, మైదానం ఇతర మౌలిక వసతులు ఉండాలి. కానీ ప్రైవేటు పాఠశాలల, కార్పొరేట్ స్కూల్స్‌లో క్రీడా మైదానాలే కరువయ్యాయి. అలాగే ఏటా గుర్తింపు పొందిన పాఠశాలలు రెన్యువల్ సందర్భంగా విద్యాధికారులు వాటిని తనిఖీ చేసి వాటిలో వసతులన్నీ ఉంటేనే రెన్యువల్‌కు సిఫారసు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు యాజమాన్యాల వద్ద ముడుపులు తీసుకుని ఆ పాఠశాలల వైపు కన్నెత్తి చూడటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కనీస వసతులు కరువు..
నగరంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో సరైన వసతులు కల్పించకుండానే దర్జాగా విద్యా సంస్థలను నడిపిస్తున్నారు. కనీస సౌకర్యాల్లేవు. సరైన మూత్రశాలలు, మరుగుదొడ్లు, భోజనశాలలు, తాగునీరు, ఆట స్థలాలు లేకుండానే అపార్ట్‌మెంట్లలో, రేకుల షెడ్లలో కొనసాగిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వందలాది విద్యార్థులకు 1, 2 మూత్రశాలలుండడం గమనార్హం. భవనాలు, విశాలమైన ఆటస్థలం, ఫైర్‌సేఫ్టీ, రక్షిత తాగునీరు, అర్హులైన ఉపాధ్యాయులను నియమించడం, ఫీజుల బోర్డును ప్రదర్శించడం వంటివి తప్పనిసరిగా అమలు చేయాలి. అయితే నగరంలో 90శాతం స్కూళ్లల్లో నిబంధనలు ఏవీ అమ లుకావడం లేదు. విద్యాశాఖ అధికారులకు పెద్దఎత్తున మా మూళ్లు అందడమే దీనికి కారణమనే ప్రచారం సాగుతున్నది.

కొత్త స్కూల్ ప్రారంభించాలంటే..
ఏదైనా కొత్త పాఠశాలను ప్రారంభించాలంటే.. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. కానీ కొత్తగా పుట్టుకొస్తున్న స్కూల్స్ అవేమీ పాటించడం లేదు. జీఓ ఎంఎస్ నం.1లోని రూల్స్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రేకుల షెడ్లలో స్కూళ్లు ప్రారంభిస్తున్నాయి. ఆటస్థలం ఉన్నట్టు రికార్డుల్లో చూపిస్తున్నా.. ఎక్కడా కనిపించదు. అపార్ట్‌మెంట్లు, ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కి తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాలలోనూ 60 మంది విద్యార్థులు ప్రయోగాలు చేసుకునేందుకు వీలుగా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడంతోపాటు లైబ్రరీని సైతం నిర్వహించాలి. దీంతో పాటుగా

నగరాలు, పట్టణాల్లో కచ్చితంగా పోలీస్ అనుమతి ఉండాలి. వీటితోపాటు ప్రధానంగా బహుళ అంతస్తుల భవనంలో పాఠశాలను ఏర్పాటు చేయొద్దు. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మరో రెండస్తుల్లో నిర్వహించేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలకు 400 చ.మీ మైదానం, ఉన్నత పాఠశాలకు వెయ్యి చ.మీ క్రీడా మైదానం తప్పనిసరి. ప్రాథమిక పాఠశాలల్లో.. 200 మంది పిల్లలు ఉంటే 500 చ.మీ, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 700 చ.మీ కేటాయించాలి. కానీ నగరంలో 90 శాతం వరకు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఆటస్థలాలు కన్పించడం లేదు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...