భద్రత గాలికి.. బస్సులు రోడ్డుపైకి


Fri,June 14, 2019 12:51 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రోడ్డు భద్రతతోపాటు చిన్నారుల భద్రతను పాఠశాలల యాజమాన్యాలు గాలికొదిలేస్తున్నాయి. ఫీజుల విషయంలో నిక్కచ్చిగా వసూలు చేసే యాజమాన్యాలు పిల్లలను తీసుకెళ్లే బస్సుల ఫిట్‌నెస్ విషయాన్ని పట్టించుకోవడం లేదు. నగరంలో 10 వేలకు పైగా బస్సులున్నప్పటికీ ఇప్పటివరకు సుమారు 3 వేల బస్సులు ఫిట్‌నెస్ చెకింగ్‌కే రాలేదు. కొన్ని బస్సులైతే ఏకంగా ఫిట్‌నెస్‌తో పాటు పర్మిట్ కూడా లేకుండా విద్యార్థులనెక్కించుకుని రోడ్డెక్కుతున్నాయి. వీటిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉంటున్నాయి. ఉన్నత విలువలు, అంతర్జాతీయ స్థాయి విద్య అంటూ ఊదరగొడుతున్న పాఠశాలలు పిల్లల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి స్పెషల్ డ్రైవ్ చేసి 13 పాఠశాలల బస్సులను సీజ్ చేయడంతో పాటు 9 బస్సులపై కేసు నమోదు చేసినట్లు డీటీసీ ప్రవీణ్‌రావు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో పోలీసు, రవాణాశాఖ అధికారులు సమన్వయంగా తనిఖీలు చేపట్టి పర్మిట్, ఫిట్‌నెస్‌లేని బస్సులను సీజ్ చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని జోన్ల పరిధిలో తనిఖీలు చేపట్టగా 14 బస్సులు నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడ్డాయి. ఇందులో 9 బస్సులను సీజ్ చేసినట్లు జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. అయితే ఫిట్‌నెస్ లేకుండా పట్టుబడ్డ బస్సులు, ఓవర్‌లోడ్‌తో ఉన్న ఆటోలు పట్టుబడడంతో అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. బస్సులు సీజ్ చేసి ఇతర వాహనాల్లో ఇంటికి పంపించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...