సాగు సర్వే ముమ్మరం!


Mon,May 27, 2019 02:42 AM

-సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా సర్కార్ యోచన
-జిల్లా వ్యాప్తంగా 2.75లక్షల మంది రైతులు
-ఇప్పటివరకు 1.75లక్షల మంది వివరాల సేకరణ
-2.85 లక్షల హెక్టార్లలో పంట సాగు అంచనా
-జిల్లాలోని 25 మండలాల్లో సర్వే చేస్తున్న 81 మంది ఏఈఓలు
-39 అంశాలతో కూడిన వివరాల సేకరణ
-అర్హులైన ప్రతీ రైతు వద్ద సమాచారం తీసుకుంటున్న అధికారులు

షాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లాలో రైతు సమగ్ర సాగు సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. ఏప్రిల్ మాసంలో ప్రారంభమైన ఈ సర్వే మే నెల చివరిలోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో జిల్లా వ్యవసాయశాఖ ముందుకు సాగుతున్నది. ఇప్పటివరకు జిల్లాలో 61 శాతం సర్వే చేసి రైతుల వివరాలు నమోదు చేసింది. జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 2.75లక్షల మంది రైతులున్నారు. ఇప్పటివరకు అందులో 1.75 లక్షల మంది వివరాలు సేకరించారు. ఈ నెలాఖరుకల్లా సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా అధికారులు, సిబ్బంది సర్వే పనులపై మరింత అప్రమత్తమయ్యారు.

సాగులో విప్లవాత్మక మార్పులు
వ్యవసాయ సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చి రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం పంట కాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నది. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సేకరించడం, ప్రభుత్వం నుంచి పలు పథకాల ద్వారా లబ్ధిపొందడం, వ్యవసాయ భూములు, సాగునీటి వసతి తదితర అంశాలపై గ్రామాల్లో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా సమగ్ర సర్వే జరుపుతున్నారు. ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ సర్వే ఎన్నికలు రావడంతో పూర్తి కాలేదు. జిల్లాలోని గ్రామాల వారీగా ఏఈఓలు, హెచ్‌ఈఓలు, ఏఓలు రైతుల నుంచి అంశాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 81 మంది ఏఈఓలు సమాచార సేకరణలో పాల్గొంటున్నారు.

61 శాతం సర్వే నమోదు
జిల్లాలో 2.85 హెక్టార్లలో పంట సాగవుతున్నట్లు అంచనా. ఒకే రకం పంటలను రైతులంతా సాగు చేయకుండా నిరోధించడం, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఆయా సీజన్‌లు, పంటల అనుకూలతలను బట్టి వ్యవసాయశాఖ ద్వారా రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చి పంటల సాగుబడులు చేయించాలనే లక్ష్యం పెట్టుకుని ప్రభుత్వం సర్వే చేయిస్తున్నది. 39 రకాల అంశాలపై వివరాలు సేకరిస్తుండగా, భూమి, పంటల సాగు, విస్తీర్ణం వంటి అంశాలతో పాటు నీటి వసతి, బోరు, బావి, వర్షాధారం వంటి అంశాలను నమోదు చేస్తున్నారు. రైతులు సాగు చేసే పంటలు, దిగుబడి ఎంత వస్తుంది, గిట్టుబాటు అవుతుందా లేదా మార్కెట్ వసతి, ఏ పంట వేస్తే లాభదాయకంగా ఉంటుంది అనే అంశాలను కూడా సేకరిస్తున్నారు.

ఈ నెల చివరి కల్లా సర్వే పూర్తి
ఈ నెల చివరికల్లా సమగ్ర సాగు సర్వేను పూర్తి చేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే సమాచార సేకరణలో కొంత ఆలస్యం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారులు సర్వేను ముమ్మరం చేశారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న లక్ష మంది రైతుల వద్ద నుంచి సమాచారం సేకరించగలిగితే నూటికి నూరు శాతం సర్వే పూర్తవుతుంది. వీరిలో చాలా మంది రైతులు స్థానికంగా లేకపోవడం, హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉంటున్నందున సర్వే శాతం తక్కువగా నమోదవుతున్నది. వీరంతా సర్వేలో పాల్గొని సమాచారం ఇస్తే తప్ప వందశాతం పూర్తి కావడం కష్టంగా ఉంటుంది. మిగిలిన రైతులందరికీ సమాచారం ఇచ్చి ఈ నెల చివరిలోపు సర్వేను ముగించాలనే ప్రయత్నంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...