తానియాకు తాలియా !


Sat,May 25, 2019 01:03 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : షేక్ తానియా బేగం ఓ ఎనిమిదేండ్ల చిన్నారి. అంబర్‌పేట వాసి, సామాజిక కార్యకర్త అయిన షేక్ సలావుద్దీన్ కూతురు. సలావుద్దీన్ పదేండ్లుగా సోషల్ యాక్టీవిస్ట్‌గా పని చేస్తున్నారు. సమాజంలో ఒక మార్పు తీసుకువచ్చేందుకు చేసే కృషిలో భాగంగా మూడు సంవత్సరాల నుంచి తానియా కూడా పాలుపంచుకుంటున్నది. హాకథాన్, మారథాన్ లాంటి కార్యక్రమాలు, డ్రగ్ ఫ్రీ వరల్డ్, స్వచ్ఛ వాతావరణం, సమాజంలో పేరుకు పోతున్న అన్యాయం, అసమానతలు, ఇంకా క్యాబ్ డ్రైవర్స్ సమస్యలుపై కూడా ఆమె తన వంతుగా కృషి చేస్తున్నది. తానియా చిన్న వయస్సులోనే ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్నది. డ్రగ్ ఫ్రీ వరల్డ్ అనే అంతర్జాతీయ సంస్థ తానియాను భారత జూనియర్ అంబాసిడర్‌గా డిసెంబర్ 15, 2017న నియమించింది. తానియా ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, పలువురు రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి డ్రగ్ ఫ్రీ వరల్డ్‌పై వారి మద్దతును కూడగట్టుకున్నది. డ్రగ్ సమస్యలపై తానియా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి సైతం లేఖలు రాసింది. హరిత హారం కార్యక్రమంపై ఎంతో మందికి అవగాహన కల్పించింది. ఎందరికో స్ఫూర్తినిస్తున్నది.

ఎక్కడైనా సమస్య కనిపిస్తే..
తానియా రోజూ టీవీలో వచ్చే వార్తలను మిస్ కాకుండా ఫాలో అవుతున్నది. ముఖ్యంగా డ్రగ్స్‌పై వార్తలు, కథనాలపై దృష్టి పెట్టింది. వాటిపై ఆరా తీసేది. అసలు డ్రగ్స్ అంటే ఏంటి? వాటి వల్ల ఉపయోగమేంటి? అని అడిగేది. డ్రగ్స్ వినియోగం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలేంటో తెలుసుకునేది. వాటిని సమాజంలో నిర్మూలించడానికి తన వంతుగా ఏం చేయగలదో తెలుసుకున్నది. ఆ విధంగా సమాజ పురోభివృద్ధి నేపథ్యంలో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. తానియా బేగం అంబర్‌పేటలోని యూనీసన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నది.

అంతర్జాతీయ సంస్థకు జూనియర్ అంబాసిడర్
మూడేండ్ల కిందట డ్రగ్ ఫ్రీ వరల్డ్ అనే అంతర్జాతీయ సంస్థకు సోషల్ మీడియాలో ఎక్కడో తానియా ఫొటో కనిపించింది. అంత చిన్న పాప చేతిలో అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్ల కార్డు ఉండడం చూసి ఆ సంస్థ ఆశ్చర్యపోయింది. ఆ తదుపరి వెంటనే ఈ చిన్నారి వివరాల కోసం ఆ సంస్థ ప్రతినిధులు అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. తనను కలిసి మాట్లాడాక, తానియా వల్ల కచ్చితంగా సమాజంలో మార్పు తీసుకురావొచ్చని వారికి నమ్మకం కలిగింది. వెంటనే తనను భారత జూనియర్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఆ బాధ్యతలను నిర్వహిస్తూనే ఉంది. డ్రగ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం.. ఇందుకు కావాల్సిన సామగ్రిని అమెరికా నుంచి తెప్పించుకొని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వాటిని పంచుతుంది. అలాంటి సామాజిక అంశాలపై అనర్గళంగా ప్రసంగాలు కూడా ఇస్తున్నది తానియా.

ఈవెంట్స్ కన్నా ముందే...
ఎక్కడ ఈవెంట్స్ జరిగినా.. మంచి పని కోసం జరిగే.. ఏ రన్, వాక్‌లకైనా తానియా ముందుంటుంది. తానియా కార్యక్రమం ఉందంటే చాలు.. ఉదయం నాలుగు గంటలకే లేస్తున్నది. తండ్రిని హడావుడి చేస్తూ మరీ బయలుదేరుతుంది. అనేక అవగాహన, పలు రకాల ఈవెంట్లలో చాలా హుషారుగా పాల్గొంటుంది. ఎలాంటి అంశమైనా నలుగురిలో నిర్భయంగా మాట్లాడుతుంది. ప్రధానంగా డ్రగ్స్‌కు సంబంధించిన ప్రతి అంశం తనకు బాగా గుర్తుంటుంది. వాటి వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నది. తన దగ్గర ఉన్న వస్తు సామగ్రిని జనానికి పంచుతున్నది.

అకడమిక్స్‌లోనూ చురుకుగా...
సామాజిక అవగాహన కోసం కృషి చేస్తూనే.. చదువులో కూడా చాలా చురుకుగా రాణిస్తున్నది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటుంది. హోం వర్క్‌కు ప్రత్యేకంగా సమయం కేటాయించి మరీ చేస్తుంది. ఈ వయసు పిల్లలు బడిలో చెప్పే పాఠాలనే సరిగా మనసుకు ఎక్కించుకోరు. అలాంటిది ఈ అమ్మాయి ఇటు పాఠాలు వింటూనే.. తనదైన పద్ధతిలో సమాజానికి పాఠాలు చెబుతున్నది అని పాఠశాల ప్రిన్సిపాల్ ఆశ్చర్యపోతున్నారు. తానియా లాంటి పిల్లలు సమాజంలో ఇంకా రావాలని, ఇప్పుడే రేపటి భవిష్యత్ ఆరోగ్యంగా ఉండాలని దానిపై చైతన్యం తీసుకురావడం అభినందనీయమని ప్రిన్సిపాల్ అన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...