నేడే కౌంటింగ్


Thu,May 23, 2019 12:03 AM

-ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు
-శంషాబాద్ మండలం పాలమాకులలోని గురుకుల పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి
-బరిలో 23 మంది అభ్యర్థులు.. 98 టేబుళ్లు 203 రౌండ్లు
-మొదట పోస్టల్ బ్యాలెట్లు.. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు
-ప్రతీ రౌండ్ ఫలితం సువిధ యాప్‌లో...
-కలెక్టర్ లోకేశ్‌కుమార్, సీపీ సజ్జనార్‌ల ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు
-మూడంచెల భద్రత, 144 సెక్షన్ అమలు
-నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ
-గెలుపుపై టీఆర్‌ఎస్ నాయకుల్లో ధీమా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శంషాబాద్ మండలం పాలమాకుల బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభకానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూ ర్తి చేశారు. ఉదయం 8గంటల నుంచి లెక్కింపు చేపట్టనుండగా సిబ్బంది..ఏజెంట్లు ఉదయం 6గంటలకే కేంద్రానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు గదులు, 98 టేబుళ్ల ద్వారా 203 రౌండ్లను నిర్వహిస్తారు. అత్యధికంగా శేరిలింగంపల్లి 43 రౌండ్లు, అత్యల్పంగా తాండూరు నియోజకవర్గం 19 రౌండ్లలో లెక్కిస్తారు.

ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత ప్రతీ నియోజకవర్గం నుంచి 5 వీవీ ప్యాట్లను లక్కీ డ్రా ద్వారా తీసి లెక్కించనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 24,42,600 మంది ఓటర్లుండగా, 12,99, 956 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, భువనగిరి పార్లమెంట్ స్థానానికి భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి పాలమూరు జిల్లా కేంద్రంలో, నాగర్‌కర్నూల్ స్థానానికి నాగర్ కర్నూల్‌లోని ఉయ్యాలవాడలో కౌంటింగ్ చేస్తారు.

ఉత్కంఠకు నేడు తెరపడనుంది. గత నెలన్నర రోజులుగా ఈవీఎంలలో నిక్షిప్తమైన చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితం నేడు తేలనుంది. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. తదనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. అయితే ప్రతీ రౌండ్ల వారీగా నియోజకవర్గాల వారీగా వివరాలివ్వడంతోపాటు లోక్‌సభ మొత్తంగా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలను వెల్లడించేందుకుగాను అధికారులు అంతా సిద్ధం చేశారు.

అయితే రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం పాలమాకులలోని గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతీ నియోజకవర్గం నుంచి ఐదు వీవీ ప్యాట్లను లెక్కించాల్సి ఉంది కాబట్టి అర్ధరాత్రి వరకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. మధ్యాహ్నం వరకు ఎవరూ గెలుస్తారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశమున్నా,...ఫైనల్ రిజల్ట్స్ మాత్రం అర్ధరాత్రి వరకు కానుంది. మరోవైపు లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. మరోవైపు గతనెల 11న జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌లో 12,99,956 ఓట్లు పోలుకాగా, 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి తదనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కించునున్నారు. అయితే ఉదయం 10 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి 14 టేబుళ్లతోపాటు ఒక రిటర్నింగ్ అధికారి టేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌తోపాటు అసిస్టెంట్ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు, వీరు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించనున్నారు. ఒక్కో రౌండుకు 14 ఈవీఎంలను లెక్కించనున్నారు.

ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 వీవీ ప్యాట్లను లక్కీ డ్రా ద్వారా తీసి లెక్కించనున్నారు. వీవీ ప్యాట్లను లెక్కించేందుకు 2-3 గంటల సమయం పడుతుంది కాబట్టి తుది ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశముంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను బట్టి రౌండ్లను నిర్ణయించారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 43 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తేగాని ఫైనల్ ఫలితం రానుంది. ఆయా నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాలు, రౌండ్ల వారీగా వివరాలకు సంబంధించి.. పరిగిలో 305 పోలింగ్ కేంద్రాలుండగా 14 కౌంటింగ్ టేబుళ్లతోపాటు ఒక రిటర్నింగ్ అధికారి టేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు, 22 రౌండ్లలో పరిగి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. వికారాబాద్‌లో 284 పోలింగ్ కేంద్రాలుండగా 14 కౌంటింగ్ టేబుళ్లు.. 21 రౌండ్లలో వికారాబాద్‌లో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. తాండూర్‌లో 262 పోలింగ్ కేంద్రాలుండగా 14 కౌంటింగ్ టేబుళ్లు.. 19 రౌండ్లలో తాండూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికానుంది.

చేవెళ్లలో 298 పోలింగ్ కేంద్రాలుండగా 14 కౌంటింగ్ టేబుళ్లు.. 22 రౌండ్లలో చేవెళ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. శేరిలింగంపల్లిలో 590 పోలింగ్ కేంద్రాలుండగా 14 కౌంటింగ్ టేబుళ్లు.. అత్యధికంగా 43 రౌండ్లలో శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికానుంది. మహేశ్వరంలో 511 పోలింగ్ కేంద్రాలుండగా 14 కౌంటింగ్ టేబుళ్లు.. మహేశ్వరంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ 37 రౌండ్లలో పూర్తికానుంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 535 పోలింగ్ కేంద్రాలుండగా 14 కౌంటింగ్ టేబుళ్లు.. రాజేంద్రనగర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ 39 రౌండ్లలో పూర్తి కానుంది. ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన ఓట్ల లెక్కింపు టేబుళ్లతో పాటు ఒక రిటర్నింగ్ అధికారి టేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అయితే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అర్ధరాత్రి కానుంది. అదేవిధంగా ఓట్ల లెక్కింపునకు సంబంధించి దాదాపు 1800 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. అదేవిధంగా ఒకవేళ ఈవీఎంలలో సాంకేతిక సమస్య వల్ల మొరాయించినట్లయితే వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కించనున్నారు.

లెక్కింపు కేంద్రం వద్ద భారీ భద్రత...
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. సుమారు 1200 మంది పోలీసు సిబ్బంది భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. అదేవిధంగా అనుమతి ఉంటేనే ర్యాలీలు తీసుకోవచ్చని, అనుమతి లేకుంటే ఎలాంటి ర్యాలీలను అనుమంతించకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లే సిబ్బంది, ఆయా పార్టీల ఏజెంట్లు తదితరులకై గురుకుల పాఠశాల సమీపంలోని చెరువు వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు, పార్కింగ్ స్థలం నుంచి లెక్కింపు కేంద్రానికి ప్రత్యేక వాహనాల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...