డైనో వరల్డ్ అద్భుతం


Thu,May 23, 2019 12:00 AM

అబ్దుల్లాపూర్‌మెట్: పిల్లలకు వింత అనుభూతిని కలిగించే తరహాలో డైనో వరల్డ్ పార్కు అద్భుతంగా ఉందని రాష్ట్ర పర్యటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మండలంలోని బండరావిర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన డైనోసర్ థీమ్ పార్కును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. యానిమెట్రానిక్స్ నేపథ్యంలో పార్కులో తీర్చిదిద్దిన డైనోసర్స్‌ను వారు తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 35 రకాల రాక్షస బల్లులతో ఏర్పాటు చేసిన ఇలాంటి పార్కు దేశంలో ఎక్కడాలేదన్నారు. అలాంటి ఫార్కును గ్రేటర్ సిటీకి అతి సమీపంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు, పిల్లలకు ఎంతో అనుభూతిని కలిగించేందుకు ఈ పార్కు ఉపయోగపడుతుందన్నారు. డైనోసర్ థీమ్ పార్కులో సహజ సిద్ధమైన వాతావరణంలో పలు రకాల ప్రత్యేకతలు కల్పించడం వల్ల సందర్శకులను ఆకర్షిస్తున్నాయన్నారు.

డైనోసర్ జంతు సంపదను మన కండ్ల ముందు ఉన్నట్లే తీర్చిదిద్దారన్నారు. రాష్ట్రంలో పర్యటకులకు ఆహ్లాదాన్ని కల్గించేందుకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. మహబూబ్‌నగర్‌లో 350 ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ కూడా ఇలాంటి పార్కు ఏర్పాటు చేస్తే 3, 4 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు. టూరిజం శాఖకు అనుసంధానం చేసేవిధంగా కృషి చేస్తామన్నారు. ఒక కుటుంబం వస్తే రెండు గంటలు ఉండేవిధంగా ఆలోచించి మరిన్ని రకాలను ఫార్కులో ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో అద్భుతమైన పార్కుగా అభివృద్ధి చెందుతుందన్నారు. నగరానికి చెందిన ప్రశాంత్ మొటాడు, అభినవ్ పాలముర్తి, సుశాంత్‌గౌర్నే, మార్కెటింగ్ ఇన్‌చార్జి చైతన్యలు డైనోసర్స్‌ను చైనాలో ప్రత్యేంగా తయారు చేయించి ఏడాది పాటు కృషి చేసి పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ డైనోసర్ల చరిత్రను తెలుసుకునేందుకు ఇలాంటి పార్కులు ఉంపయోగపడుతాయన్నారు. పర్యటకులు గంటపాటు సమయాన్ని కేటాయించే విధంగా ఈకో పార్కును కూడా ఏర్పాటు చేయాలన్నారు. తన నియోజక వర్గంలో గొప్ప పార్కును ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో క్రీడల చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సినీ డైరెక్టర్ శశికిరణ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లకా్ష్మరెడ్డి, ఎంపీపీ బబ్బూరి మంజులగౌడ్, సర్పంచ్ కవాడి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీ ఫ్లోర్‌లీడర్ నోముల కృష్ణగౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్, నాయకులు బబ్బూరి దేవేందర్‌గౌడ్, పూజారి చక్రవర్తిగౌడ్, జగదీశ్, గౌరీశంకర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పర్యటకులు తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...