సర్వం సిద్ధం.


Tue,May 21, 2019 11:47 PM

-చేవెళ్ల ఎంపీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
-98 టేబుళ్లు 203 రౌండ్లు బరిలో 23 మంది అభ్యర్థులు
-మొత్తం పోలైన ఓట్లు 12,99,956 ..నమోదైన పోలింగ్ 53.22%
-ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ షురూ
-ఫలితాలు ఎప్పటికప్పుడుసువిధ యాప్‌లో అప్‌లోడ్
-నేతల్లో తీవ్ర ఉత్కంఠ..
-పాలమాకులలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ లోకేశ్‌కుమార్,సైబరాబాద్ సీపీ సజ్జనార్

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ ;లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం ఇటు అభ్యర్థులు అటు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరో 24 గంటల్లో విజేత ఎవరో తేలిపోనున్న నేపథ్యంలో అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. శంషాబాద్ మండలం పాలమాకుల బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో గురువారం ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రక్రియ షురూ కానుంది. చేవెళ్ల పార్లమెంట్ స్థానం కోసం 23 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఏడు నియోజకవర్గాల్లో 24,42,039 మంది ఓటర్లున్నారు. పోలింగ్‌లో 12,99,956 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా, ఈ ఓట్లన్నింటినీ 98 టేబుళ్ల ద్వారా 203 రౌండ్లలో కౌంట్ చేయనున్నారు. ఒక్కో టేబుల్‌కు సూపర్‌వైజర్, అసిస్టెంట్‌తో పాటు మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అలాగే, పార్టీల అభ్యర్థులు తమ తరఫున లెక్కింపును పర్యవేక్షించేలా ఏజెంట్ల నియామకం ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. కాగా, కౌంటింగ్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లోకేశ్‌కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. పార్కింగ్, బందోబస్తు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ఆరా తీసి సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. అధికారులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సమన్వయంతో శాంతియుతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. - రంగారెడ్డి

లోక్ సభ ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడింది. మరో 24 గంటల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 43 రోజులుగా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓట్ల లెక్కింపుకు మరో రోజే మిగిలి ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం అందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేసింది. కౌంటింగ్ సిబ్బందిని గుర్తించిన అధికారులు వారికి లెక్కింపు రోజునే విధులు ఎక్కడనేది చెప్పనున్నారు. మరోవైపు పార్టీల అభ్యర్థులు తమ తరపున ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేలా ఏజెంట్ల నియామకం పూర్తి చేసుకున్నారు. ఆ జాబితాను రిటర్నింగ్ అధికారులకు అందజేసే ప్రక్రియ పూర్తయ్యింది.ఈ నెల 23న సిబ్బంది.. ఏజెంట్లు ఉదయం 6గంటలకే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకునేలా కార్యాచరణ రూపొదించడంతో అధికార యంత్రాంగంలో హడావుడి కనిపిస్తోంది. రౌండ్లవారీగా పరిశీలిస్తే అత్యధికంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 43 రౌండ్లు జరుగనుండగా, అత్యల్పంగా తాండూరు నియోజకవర్గం 19 రౌండ్లకు ముగియనుంది. లోక్ సభ ఫలితాలు 98 టేబుల్ ద్వారా 203 రౌండ్లు నిర్వహిస్తున్నారు.

పాలమాకులలోని బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు ఉండగా.. అందులో చేవెళ్ల,వికారాబాద్,పరిగి,తాండూరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరంలు ఉన్నాయి. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో 2,785 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 24, 42,039 మంది ఓటర్లుండగా, 53.08 శాతం పోలింగ్ నమోదైంది. ఈవీఎంలలో ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో 12,99,956 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్లన్నింటిని ఈనెల 23వ తేదీన శంషాబాద్ మండలం పాలమాకులలోని బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ప్రాంగణం కేంద్రంగా ఏడు కేంద్రాల్లో నియోజకవర్గాల వారీగా లెక్కించనున్నారు. తొలుత బ్యాలెట్ ఓట్లను ఆ తర్వాత ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్క తేల్చనున్నారు. ప్రతి నియోజకవర్గంలో14 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‌తో పాటు మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ఒక టేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ టేబుల్‌పై ముగ్గురు విధులు నిర్వహించనున్నారు. సిబ్బందిని 1700మందిని నియమించారు. కౌంటింగ్ సూపర్‌వైజర్లు 120, కౌంటింగ్ అసిసెంట్లు 130, మైక్రో అబ్జర్వర్లు 120,పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌కు 20, నాల్గొవ తరగతి ఉద్యోగులు 70 మంది చోప్పున ఇతర సిబ్బందిని నియమించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ అధికారితో పాటు ఇద్దరు పరిశీలకులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.

ఒక అభ్యర్థికి 16 మంది ఏజెంట్లు
లోక్‌సభ బరిలో 23 మంది అభ్యర్థులు బరిలో నిలువగా..వారు తమ ఓట్ల లెక్కింపును పరిశీలించేందుకు ఏజెంట్లను నియమించుకునే అవకాశం ఉంది. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటు నియమించుకునే వెలుసుబాటు కల్పించినా.. ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా..ఇతర స్వతంత్ర అభ్యర్థులు మాత్రం అరకొరగానే ఏజెంట్లను నియమించుకున్నారు.లోక్‌సభ అభ్యర్థికి 16 మంది ఏజెంట్లు నియమించుకుంటున్నారు. పోటీలో ఉన్న 23 మంది అభ్యర్థులకు 16 మంది చొప్పున 368 మందికి ఏజెంట్ల పాస్‌లు జారీ చేశారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో మూడు నియోజకవర్గాలు అర్బన్‌లో ఉండగా,నాలుగు నియోజకవర్గాలు గ్రామీణంలో ఉన్నాయి.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...