కార్టూన్ రంగంలో శేఖర్ అగ్రగణ్యుడు


Mon,May 20, 2019 04:04 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :కార్టూన్ రంగంలో శేఖర్ అగ్రగణ్యుడని, ఆయన లేని లోటు మనలో స్పష్టంగా కనపడుతున్నదని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. జయశంకర్ రాజకీయ, సాంస్కృతిక అధ్యయన కేంద్రం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం శేఖర్ టూనిజం సదస్సును రవీంద్రభారతి సమావేశ మందిరంలో నిర్వహించారు. దివంగత ప్రముఖ కార్టూనిస్టు కంబాలపల్లి చంద్రశేఖర్ సంస్మరణ సభను పురస్కరించుకొని పలు పత్రికల కార్టూనిస్టులు, జర్నలిస్టులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, కార్టూనిస్టులంతా సమాజంలో రాజకీయంగా చైతన్యం తీసుకువచ్చారన్నారు. కార్టూన్లు గీయాలంటే రాజకీయంగా పరిజ్ఞానం ఉండాలని, ప్రపంచ పోకడలపై అవగాహన ఉంటేనే రాణించగలుగుతారన్నారు. సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ శేఖర్ సామ్రాజ్య వాదం మీద దృష్టి కేంద్రీకరించి సఫలీకృతుడయ్యారన్నారు. సృజనాత్మక వ్యంగ్య చిత్రకారుడు శేఖర్ అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ, ఉద్యమ కాలంలో ఉద్యమకారుల నినాదాలు ఎలా వినిపించేవో, శేఖర్ కార్టూన్స్ కూడా అలాగే జన బాహుళ్యంలో కనిపించేవన్నారు. నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్టూనిస్ట్ మృత్యుంజయ మాట్లాడుతూ కార్టూన్ ఈజ్ ఏ ఆర్ట్ ఆఫ్ కైంప్లెంట్ (ఇదొక ఫిర్యాదు కళ) అని తనకు శేఖర్ చెప్పారన్నారు. కార్యక్రమానికి తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సాక్షి దిన పత్రిక కార్టూనిస్ట్ పామర్తి శంకర్ , నవ తెలంగాణ దిన పత్రిక కార్టూనిస్ట్ నర్సిం, శేఖర్ కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, కార్టూనిస్టులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...