ప్రతీ నీటిబొట్టుఒడిసి పట్టాల్సిందే..


Fri,May 17, 2019 12:41 AM

-జలవనరులను సంరక్షించుకోవాలి
- భవిష్యత్‌ అవసరాలను తీర్చుకోవాలి
-18న నగరమంతా ఇంకుడు గుంతల మరమ్మతులు
ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ : ప్రతి వర్షపు నీటి చుక్క ఎక్కడికక్కడే ఇంకిపోయేలా ఇంటింటికీ నీటి గుంతలు ఏర్పాటు చేసుకొని ఆదర్శ కాలనీగా నిలిచింది నాగోలు కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ కాలనీ. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలతో పాటు, వరదనీరు రోడ్లపై పారకుండా నేరుగా ఇరువైపులా ఉన్న మొక్కలు, చెట్లకు వెళ్లే విధంగా, ఆపై కాలనీల్లోని ఖాళీ స్థలాల్లోకి మళ్లే విధంగా ఏర్పాట్లు చేయడంతో వరదనీరు కూడా భూమిలోకే ఇంకుతున్నది. కాలనీల్లోని మూల మలుపులు, పల్లపు ప్రాంతాల్లో రోడ్ల పక్కన కూడా పెద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని నీటిని ఒడిసి పడుతున్నారు. ఈ కాలనీలో 70 నుంచి 80 అడుగుల లోతులోనే బోరు నీరు వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ కాలనీలో బోరు వేసే వారు 200 అడుగుల కంటే ఎక్కువ లోతు వేసేందుకు కాలనీ సంక్షేమ సంఘం అనుమతించదు.

అంచెలంచెలుగా ..
నాగోలు గ్రామం పక్కనే కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ కాలనీ దాదాపు 30 ఏండ్ల క్రితం ఏర్పడింది. ప్రస్తుతం ఈ కాలనీలో 228 నివాసాలు, 26 బహుళ అంతస్తుల భవన సముదాయాల్లో 303 ఫ్లాట్లలో మొత్తం 8100 జనాభా నివసిస్తున్నది. 2002లో పర్యావరణంపై దృష్టి పెట్టిన కాలనీ వాసులు కాలనీలోని రోడ్లకు ఇరువైపులా సుమారు 1000 వేప, కానుగ చెట్లను నాటారు.

ప్రతి ఇంటికీ ఇంకుడుగుంత
భూగర్భ జలాలు అడుగంటకుండా కాలనీవాసులు 2013 మే నెలలో ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించి భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కాలనీలో మొత్తం 180 ఇంకుడు గుంతలను నిర్మించారు. అనంతరం ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఉండేలా చొరవ తీసుకున్నారు. కాలనీలోని అపార్ట్‌మెంట్‌ సముదాయాల్లో రెండేసి ఇంకుడు గుంతలు కూడా ఉన్నాయి.

రెండే బోర్లు.. నిండా నీళ్లు..
హైదర్‌నగర్‌ : భారీగా పెరుగుతున్న నీటి వినియోగం.. నానాటికీ అడుగంటుతున్న భూగర్భ జలాల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో విలువైన నీటిని పొదుపుగా వాడుకుంటూ భూగర్భ జలాలను పెంపొందించుకోవడంలో తమ వంతు పాత్రను పోషించేలా జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోన్‌ అధికారులు నడుం బిగించారు. ఈ మేరకు ప్రజల్లో నీటి ప్రాధాన్యతను తెలిపేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకోసం వెస్ట్‌ జోన్‌ పరిధిలో వందల సంఖ్యలో విస్తరించి ఉన్న ఐటీ కంపెనీల్లో పని చేసే ఐటీ ఉద్యోగులను వలంటీర్లుగా ప్రజా చైతన్య కార్యక్రమానికి వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌ దాసరి హరిచందన శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ రూపొందించిన ప్రత్యేక యాప్‌ ద్వారా ఇప్పటికే 3 వేల వరకూ ఐటీ సహా ఆయా రంగాలకు చెందిన ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు వలంటీర్లుగా నమోదయ్యారు. తొలుతగా ఐటీ సెక్టార్‌లోని ఐటీ కంపెనీలలోనే నీటి పొదుపుపై తోటి ఉద్యోగులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జోనల్‌ కమిషనర్‌ నేతృత్వంలో వలంటీర్లు చేపడుతున్నారు. వారంలో రెండు రోజుల పాటు వలంటీర్లు ఐటీ కంపెనీలను సందర్శిస్తూ నీటి ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ఇంకుడు గుంతల ద్వారా భూగర్భజలాలను పెంపొందించుకోవడం లాంటి అవగాహన కార్యక్రమాలను వలంటీర్ల ద్వారా చేపడుతున్నారు. ఈ విషయంలో ప్రజలు సైతం తమ వంతు కనీస బాధ్యతను నిర్వర్తించాలని అధికారులు సూచిస్తున్నారు.

490 ఇంకుడు గుంతల పునర్నిర్మాణం..
వెస్ట్‌ జోన్‌ వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపునకు అధికారులు ఇంకుడు గుంతల ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఇందుకోసం తమ వ్యక్తిగత నివాస, ఆవాసాల్లో ఉన్న ఇంకుడు గుంతలను సైతం తమ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వెస్ట్‌ జోన్‌ అధికారుల ఈ పిలుపునకు ఇప్పటికే గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని గుల్మొహర్‌ పార్కు కాలనీ వాసులు జోనల్‌ కమిషనర్‌ను సంప్రదించారు. కాగా శేరిలింగంపల్లి వెస్ట్‌ జోన్‌ పరిధిలోని ఐదు సర్కిళ్లలో కలిపి మొత్తం 490 వరకూ ఇంకుడు గుంతలున్నాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాల మేరకు, జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోన్‌, జలమండలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18న వాటన్నింటినీ పునర్నిర్మాణం చేయనున్నారు. తద్వారా వర్షాకాలంలోనే నీరు కాల్వల ద్వారా వృథాగా పోకుండా, ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటి నిర్మాణంలో విధిగా ఇంకుడు గుంతను తవ్వాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ నిర్మాణదారులు, గృహ యజమానులు సింహభాగం నిర్లక్ష్యం చేస్తుండటంతో భూగర్భ జలాలు ఏమాత్రం పెరగపోతుండటం...విపరీత వినియోగంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

వంద ఇంకుడు గుంతలు
శేరిలింగంపల్లి : ఇంకుడుగుంతలతో నీటిని ఒడిసి పడుతూ జలకళను సంతరించుకున్నది లక్ష్మీవిహార్‌ ఫేజ్‌-2 గేటెడ్‌ కమ్యూనిటీస్‌ కాలనీ. శేరిలింగంపల్లిలోని నలగండ్ల గ్రామంలో 14 ఎకరాల విస్తీర్ణంలో 87 ఇండిపెండెంట్‌ విల్లాలతో 2006లో ఏర్పడిన ఈ గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీ ఆహ్లాదకర వాతవరణంలో మొత్తం పచ్చని చెట్లతో దర్శనమిస్తుంది. వర్షపునీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టి వృథాగా పోనివ్వకుండా పెద్దుఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణంతో కాలనీలోని చెట్లు, మొక్కలకు ఆ నీరు చేరేలా ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా అందరి ప్రశంసలు పొందుతున్నది. ‘ఎకో ప్రెండ్లీ గ్రీన్‌ మోడల్‌ కాలనీ’గా జీహెచ్‌ఏంసీ అవార్డును రెండుసార్లు అందుకున్న ఘనతను సొంతం చేసుకున్నది.

పచ్చదనమే ఆభరణంగా..
కాలనీలోని పార్కులు, ఖాళీ స్థలాల్లో ఎక్కడచూసినా పచ్చని చెట్లు, వివిధ రకాల పూల మొక్కలను పెంచారు. కాలనీలో చాలా వరకు మామిడి, అల్లనేరేడు, సపోట, జామ లాంటి వివిధ పండ్ల మొక్కలతో పాటు వేప, రాగి, మర్రి, అశోక మొక్కలను పెంచారు. కాలనీలో దాదాపు 2000 చెట్లతో పాటు రంగురంగుల అందమైన పూలమొక్కలను, పచ్చటి గార్డెనింగ్‌తో అంతర్గత రహదారులను పచ్చదనం ఉట్టిపడేలా తీర్చిదిద్దుకున్నారు.

కాలనీ మొత్తానికి ఒకేబోరు.. అదీ 180 అడుగులే..
కాలనీలో ప్రతి వర్షపు నీటి చుక్క వృథాకాకుండా ఒడిసిపడుతున్నారు. కాలనీలో ప్రతి ఇంటికి ఓ ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకున్నారు. అలా మొత్తం 87 విల్లాలకు 87 ఇంకుడు గుంతలు ఉండటం ప్రత్యేకం. రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా 100కు పైగా ఇంకుడుగుంతలు తవ్వించారు. వీటితో పాటు కాలనీ మొత్తానికి అందుబాటులో ఉన్న పవర్‌ బోర్‌ ప్రాంతంలో భారీ ఇంకుడు గుంతలను తవ్వించి జలసంరక్షణలో ప్రత్యేకతను చాటుకున్నారు. ఫలితంగా కాలనీలోని కామన్‌ బోరు కేవలం 180 ఫీట్లకే వేసవిలో సైతం ఎండిపోకుండా, భూగర్భ జలాలు అడుగంటకుండా ఈ ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడుతున్నాయి. దీంతో పాటు ఇండ్లలో వాడిన నీటిని ఎస్టీపీ ద్వారా ప్రత్యేకంగా శుద్ధిచేసి కాలనీలోని మొక్కల పెంపకానికి వినియోగిస్తున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...