ఐపీఎస్‌నంటూ బురిడీ


Thu,May 16, 2019 11:47 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పోలీస్‌గా సమాజంలో చలామణి అవుతూ పలు ప్రభుత్వ సంస్థలను, అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఓ నకిలీ ఐపీఎస్‌ అధికారిని సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి వివరించారు. కర్నాటి గురువినోద్‌ కుమార్‌రెడ్డి అలియాస్‌ జీవీకే రెడ్డి స్వస్థలం వైఎస్‌ఆర్‌ కడప జిల్లా. ప్రకాశం జిల్లా గిద్దలూరులో తన 2015లో డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి మాజీ సైనిక ఉద్యోగి, ఉద్యోగం నుంచి రిటైర్డు అయిన తరువాత గిద్దలూరు మండలంలోని కేఎస్‌ పల్లి గ్రామంలో స్థిరపడ్డారు. జీవీకేరెడ్డికి ఐపీఎస్‌ అయి, పోలీసు డిపార్టుమెంట్‌లో చేరాలనే కోరిక ఉన్నది. ఈ కోరిక మేరకు 2016లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాశాడు. అయితే అందులో పాస్‌కాలేదు. 2017లో హైదరాబాద్‌కు వచ్చి ఆర్‌సీరెడ్డి కోచింగ్‌లో చేరి 8 నెలలు కోచింగ్‌ తీసుకొని మానేశాడు. ఆ సమయంలో పలువురితో స్నేహం ఏర్పడింది. అయితే తన స్వగ్రామంలో ఏం చేస్తున్నావంటూ పలువురు ప్రశ్నించడంతో ఐపీఎస్‌కు ఎంపికయ్యానని, దానికి సంబంధించిన ఓ నకిలీ ఐడీ కార్డును తయారు చేసి, లాల్‌బహుదూర్‌ శాస్త్ర నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ కోసం లెటర్‌ కూడా వచ్చిందంటూ ఓ నకిలీ లేఖను సృష్టించాడు. ముస్సోరిలో శిక్షణ తీసుకుంటున్నానంటూ అందరినీ నమ్మించాడు. కొన్నేండ్లకు అది నకిలీదని తేలడంతో గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లో 2017లో కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌లో మూడు కేసులు
హైదరాబాద్‌కు వచ్చిన జీవీకేరెడ్డి గోల్కొండ క్రాస్‌రోడ్డులోని పురుషోత్తం అపార్టుమెంట్‌లో నివాసముంటున్నాడు. ఈ ఏడాది జనవరి నెలలో డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ(సీడీఎం) క్యాంపస్‌లోకి ఎన్‌ఐఏ(నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ)లోఅసిస్టెంట్‌ కమాండ్‌నంటూ నకిలీ ఐడీ కార్డును చూపిస్తూ వెళ్లేందుకు ప్రయత్నించడంతో సెక్యూరిటీ గార్డులకు అనుమానం వచ్చి నేరెడ్‌మెట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి, నకిలీ ఎన్‌ఐఏ గుర్తింపు కార్డును సీజ్‌ చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత అశోక్‌నగర్‌లోని ఆర్‌సీరెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో సివిల్స్‌ కోచింగ్‌ కోసం చేరాడు. అక్కడ సైకాలజీ లెక్చరర్‌గా పనిచేస్తున్న రిటైర్డు మేజర్‌ అయిన జి.శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడి ఆయన రూంలోనే ఆశ్రయం పొందాడు. ఆ సమయంలో తాను ఎన్‌ఐఏలో అదనపు సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నానంటూ నమ్మించాడు. ఇలా అక్కడికొచ్చే రిటైర్డు ఐపీఎస్‌, ఐఏఎస్‌లతోపాటు ప్రముఖులతో సెల్ఫీలు దిగేవాడు.

తాను ఎన్‌ఐఏలో పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారినంటూ పోలీస్‌స్టేషన్లకు ఫోన్లు చేసి బెదిరించడం, పలాన పని చేసిపెట్టు అంటూ ఒత్తిడి చేసేవాడు. ఇలా శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసి ఎన్‌ఐఏ అధికారినంటూ డాటా తీసుకోవడంతో అక్కడి పోలీసులు ఇతడు నకిలీ అధికారి అని గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రిటైర్డు మేజర్‌ వద్ద ఉంటూ వ్యాపారులు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు ఫోన్లు చేసి బెదిరింపులు, ఒత్తిళ్లు చేసేవాడు. దీంతోపాటు రిటైర్డు మేజర్‌ వద్ద ఉన్న డమ్మీ గన్‌ను చోరీ చేశాడు. చోరీ తరువాత జీవీకేరెడ్డి కన్పించకపోవడంతో అనుమానం వచ్చి, ఎన్‌ఐఏ కార్యాలయంలో సంప్రదించాడు. అయితే అతడు నకిలీ అధికారి అని తేల్చడంతో రిటైర్డు మేజర్‌ గాంధీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇలా షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాల్స్‌, టోల్‌గేట్లు, రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లు, ఆలయాల వద్ద నకిలీ ఐడీ కార్డులు ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నాడు. విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాస్‌రావు బృందం జీవీకేరెడ్డిని అరెస్ట్‌ చేసి, అతని వద్ద నుంచి డమ్మీ పిస్టోల్‌, నకిలీ ఎన్‌ఐఏ ఐడీ కార్డు, రెండు ఎన్‌ఐఏకు సంబంధించిన నకిలీ రబ్బర్‌ స్టాంప్‌లు, ఎన్‌ఐఏ డెయిరీ, ఐప్యాడ్‌, 4 బైనోక్యులర్స్‌, హెచ్‌డీ ప్రాజెక్టర్‌, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...