అక్రమ ఓడీలపై రవాణాశాఖ మంత్రి సీరియస్‌


Thu,May 16, 2019 11:46 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని ఇష్టారీతిన వేసిన ఆన్‌డ్యూటీ(ఓడీ)ల వ్యవహారంపై రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఈ నెల 10వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ లో ‘కదలరు.. వదలరు’ శీర్షికన ప్రచురితమైన వార్తపై స్పందించారు. తక్షణమే వార్తలో ఉన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని రవాణాశాఖ కమిషనర్‌ సునీల్‌శర్మను మంత్రి ఆదేశించారు. లాంగ్‌స్టాండింగ్‌లో ఒకే కార్యాలయంలో అప్పటికే ఓడీలుగా పనిచేస్తున్న వారితోపాటు, ఇతరులను వేరే కార్యాలయాలకు ప్రభుత్వం బదిలీ చేసినప్పటికీ మళ్లీ ఓడీలు ఇవ్వాల్సిన అవసరమేంటని, దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై నివేదిక తయారుచేసిన విజిలెన్స్‌ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా రిపోర్టును తయారుచేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ఆర్‌టీవోలు లేదా డీటీసీల మీద తోసేస్తూ నివేదికలో వాస్తవాలు వక్రీకరించినట్లు తెలిసింది. తమకు సిబ్బంది తక్కువగా ఉన్నదని, తమ కార్యాలయానికి సిబ్బందిని కేటాయించినట్లు కోరిన మీదటే ఓడీలు వేసినట్లు పేర్కొన్నారు. అయితే కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉన్నదని సిబ్బందిని పంపించమని కోరిన మాట నిజమైనప్పటికీ బదిలీపై వెళ్లిన సిబ్బందిని మళ్లీ ఇదే కార్యాలయానికి పంపాలని అడుగలేదని పలువురు రవాణాశాఖ అధికారులు తెలిపారు. పైగా కొంతమందికి అవినీతి ఆరోపణలున్నప్పటికీ మళ్లీ ఇక్కడికే పంపించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపినప్పటికీ ఓడీలపై వచ్చిన వారినే కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం ఓడీలు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక శాఖలో జరిగిన వ్యవహారంపై నివేదిక కోరడం మొదటిసారి. దీంతో రవాణాశాఖ ఉద్యోగుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...