పెండ్లి చేసుకుందాం..రా


Thu,May 16, 2019 12:32 AM

-వివాహ ప్రతిపాదనతో మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయం
-విలువైన బహుమతి వస్తుందంటూ.. బురిడీ
-సైబర్‌ చీటర్ల చేతిలో లక్షల్లో మోసపోతున్న బాధితులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో జరుగుతున్న కొన్ని పెండ్లి సంబంధాలతో కొందరు మహిళలు భారీగా నష్టపోతున్నారు. విదేశాల్లో మంచి ఉద్యోగం.. భారీ సంపాదన అంటూ నమ్మించి పెండ్లి పేరుతో మోసం చేస్తున్న సైబర్‌చీటర్ల చేతిలో తరుచూ మహిళలు చిక్కుతున్నారు. పెండ్లి చేసుకోబోయేవాడు కదా.. మోసం చేస్తాడా? అనే ఆలోచన కూడా వారికి రాకుండా తియ్యని మాటలతో మభ్యపెట్టి నిండా ముంచేస్తున్నారు. విలువైన బహుమతి పంపిస్తున్నానంటూ నమ్మించి.. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు విలువైన బహుమతిని పట్టుకున్నారని, లక్షలు, కోట్ల రూపాయల విలువైన ఆ గిఫ్టులను తీసుకోవాలంటూ.. వారు చెప్పే క్లియరెన్స్‌లకు డబ్బులు చెల్లించాలంటూ.. నమ్మించి మోసం చేస్తున్నారు. చదువుకున్న వారే ఈ మోసాలకు గురవుతున్నారు. కొందరు వేలల్లో నష్టపోయి తేరుకుంటుండగా.. మరికొందరు మాత్రం లక్షల్లో మోసపోతున్నారు. ఇలా వారానికొకరు సైబర్‌చీటర్ల చేతిలో మోసపోతున్నారు. తక్కువ మొత్తంలో మోసపోయిన వారు, ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక.. పోలీసులను ఆశ్రయించరు. ఎక్కువ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నవారే పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ఇలా మోసం చేశారు...
-అంబర్‌పేట్‌కు చెందిన ఓ సాప్ట్‌వేర్‌ ఉద్యోగినికి భారత్‌ మ్యాట్రిమోని సైట్‌లో ఉన్న బినయ్‌ మనీష్‌ పేరుతో ఉన్న ఐడీతో పెండ్లి సంబంధం మాట్లాడారు. తాను ఇంగ్లాండ్‌లో ఉద్యోగం చేస్తున్నానని, త్వరలోనే ఇండియాకు వచ్చి పెండ్లి చేసుకోవాలనుకుంటున్నాంటూ మాట్లాడుకున్నారు. ఇద్దరి ప్రొఫైల్స్‌ నచ్చడంతో పెండ్లికి ఓకే చేసుకున్నారు. ఆ తరువాత ఇద్దరు ఫోన్లలో మాట్లాడుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే తాను ఇండియాకు వచ్చేస్తున్నానని, ‘నీకు 50 వేల పౌండ్ల విలువైన బహుమతిని పంపిస్తున్నాన’ంటూ.. ఆశపెట్టాడు. మరుసటి రోజు ఏపీసీ కొరియర్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరుతో ఒక పార్శిల్‌ వచ్చిందని, అందులో విలువైన వస్తువులున్నాయని, రూ. 25 వేలు ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె దఫ దఫాలుగా రూ. 1.3 లక్షలు సైబర్‌నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసింది. మరుసటి రోజు తాము కస్టమ్స్‌ నుంచి మాట్లాడుతున్నామని, ‘మీ పేరుతో ఉన్న పార్శిల్‌కు ఎలాంటి అనుమతులు లేవని, విలువైన వస్తువులు, పౌండ్లు పంపించా’లంటూ ప్రభుత్వం నుంచి అనుమతులు కావాల్సి ఉంటుందని భయపెట్టించారు.

‘మీ పార్శిల్‌ను బ్లాక్‌ చేస్తున్నాం, మీరు రూ. 3.5 లక్షలు చెల్లిస్తే.. ఇక్కడి నుంచి రిలీజ్‌ చేస్తామ’ంటూ.. ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె వేరు ఖాతాల నుంచి మే 6, 7వ తేదీలలో రూ. 3.3 లక్షలు డిపాజిట్‌ చేసింది. విదేశీ కరెన్సీ రవాణా చేస్తే ఎలాంటి నిబంధనలున్నాయనే అంశాలను సూచిస్తూ , తదుపరి రూ. 1.95 లక్షలు నిబంధనల ప్రకారం చెల్లించాలని ఆ తరువాత మీ పార్శిల్‌ రిలీజ్‌ చేస్తామంటూ.. ఆమెకు ఈ-మెయిల్‌ వచ్చింది. ఆర్బీఐ పేరుతో వచ్చిన లెటర్‌ను పరిశీలించిన ఆమె అదంతా నకిలీదని గుర్తించి, సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.
-సికింద్రాబాద్‌కు చెందిన మరో యువతి ఇలాగే మ్యాట్రిమోని సైట్‌తో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్‌ చేసింది. ఓ సైబర్‌ చీటర్‌ తాను లండన్‌లో ఉంటానని, ‘మీ ప్రొఫైల్‌ నచ్చింది పెండ్లి చేసుకుంటన్నా’ంటూ నమ్మిస్తూ ఆమెకు వల వేశాడు. విలువైన బహుమతిని పంపిస్తున్నానని నమ్మించిపై పై ఘటన మాదిరిగానే రూ. 3.5 లక్షలు వసూలు చేశారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...