అద్దె కార్లతో... మోసం


Thu,April 25, 2019 04:13 AM

- నెలకు రూ.30వేలు అంటూ ఆశ
- సీఎం కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ బురిడీ
- 30 కార్లు తాకట్టుపెట్టి రుణం
- డ్రైవర్, ఫైనాన్సియర్ అరెస్ట్
- 23 కార్లు.. రూ.4.7లక్షల నగదు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు భారీ మోసానికి స్కెచ్ వేశాడు... ము ఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నానని... కార్లను అద్దెకు పెడితే నెలకు రూ.30వేలు ఇస్తామని నిమ్మించాడు... ఇలా 30 కార్లను అద్దెకు తీసుకుని, వాటిని తాకట్టుపెట్టి డబ్బులు తీసుకున్నాడు.. ఎట్టకేలకే మోసం బయటపడ డంతో ప్రధాన నిందితుడితోపాటు ఇతనికి సహకరించిన ఫైనాన్షియన్‌ను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 2.46 కోట్లు విలువ చేసే 23 కార్లు, రూ.4.7లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

బుధవారం ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ చిక్కడిపల్లి ప్రాంతానికి చెందిన శ్రీకాంత్‌చారి 7వ తరగతి వరకు చదివా డు. ఆ తర్వాత డ్రైవర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో 2017లో ముఖ్యమం త్రి కార్యాలయంలో తాత్కాలిక డ్రైవర్‌గా 10 నెలలు పని చేశాడు. అయితే విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. స్నేహితులు, బంధువులు, తెలిసిన వారి వద్ధ భారీగా అప్పులు చేశాడు. వాటిని తిరిగి చె ల్లించకపోవడంతో..తిరిగి ఎక్కడ కూడా అప్పు పుట్టలేదు.

ఈ క్రమంలో శ్రీకాంత్‌చారి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మోసాలు చేయాలనుకున్నాడు. భారీ గా అద్దె చెల్లిస్తానంటూ తెలిసినవారి నుంచి కార్లను తీసుకుని.. వాటిని ఫైనాన్సియర్ వద్ద గిరివి పెట్టి లక్షలు సంపాదించాలని స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా తాను ము ఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్నాను.. మీ కార్లు అద్దెకు పెడితే నెలకు రూ.30 వేలు చెల్లిస్తారని నమ్మించాడు. ఇలా.. చాలా మంది నుంచి కార్లను అద్దెకు తీసుకుని...వాటిని అమీర్‌పేట్‌లో ఉన్న ఫైనాన్సియర్ వద్ద గిరివి(మార్టిగేజ్ లోన్) పెట్టి కారుపై రూ.3 నుంచి 4 లక్షల వరకు రుణం తీసుకుని కార్లను అక్కడే వదిలేసేవాడు. ఆ డబ్బుతో కారు యజమానులకు ముందుగా రూ.30 వేలు చెల్లించేవాడు. యజమానులకు అనుమానం రాకుండా అగ్రిమెంట్‌లను కూడా రాసిచ్చేవాడు. ఇతని వ్యవహారాన్ని గమనించిన ఫైనాన్సియర్ మహేందర్ సింగ్ అతనికి కమీషన్ల ఆశ చూపించాడు. దీంతో శ్రీకాంత్‌చారి జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 కార్లను మహేందర్‌సింగ్ వద్ద తనఖా పెట్టాడు. ఈ కార్లను మహేందర్ సింగ్ ట్రావెల్స్ రూపం లో నడిపిస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే ఇటీవల దాదాపు ఏడుగురు కారు యజమానులు శ్రీకాంత్‌చారి నెలసరి అద్దెలు చెల్లించకపోవడంతో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా రోడ్లపై తిరుగుతున్న కార్లను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే శ్రీకాంత్‌చారి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్‌రూంలను ఇప్పిస్తానని పలువురి వద్ద దాదాపు రూ.15 లక్షలు వసూలు చేశాడు. వీటిపై పంజాగుట్ట, బంజారాహి ల్స్ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. ఈ కార్ల వ్యవహారంపై మీర్‌పేట్ పీఎస్‌లో-6, సరూర్‌నగర్ పీఎస్-1, వనస్థలిపురం పీఎస్‌లో-1 కేసు నమోదైంది. దర్యాప్తులో ఈ మోసాన్ని గుర్తించిన రాచకొండ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ బృందం బుధవారం శ్రీకాంత్‌చారి, మహేందర్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 23 కార్లు, రూ.4.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్‌సింగ్, ఎస్‌ఓటీ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...