మైనర్ డ్రైవింగ్‌పై సీరియస్


Thu,April 25, 2019 04:11 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మైనర్ బాలలు వాహనాలు నడుపొద్దని.. తల్లిదండ్రులు తమ పిల్లలకు దీనిపై విస్తృతమైన అవగాహన కల్పించాలని ట్రాఫిక్ డీసీపీ బాబూరావు సూచించారు. మైనర్ డ్రైవింగ్‌పై ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మైనర్లకు, వారి తల్లిదండ్రులకు బుధవారం నాంపల్లిలోని రెడ్‌రోజ్ ఫంక్షన్ హాల్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. హైదరాబాద్‌ను సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ట్రాఫిక్ విభాగం.. రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నిలువరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. వాహనాన్ని అదుపు చేయలేని వయస్సు లో పిల్లలు వాహనాలు నడుపుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలలు .. చేతికి వాహనం చిక్కగానే వేగంగా వెళ్లడం.. రోడ్లపై విన్యాసాలు కూడా చేస్తున్న ఘటనలున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకుండా ప్రయాణించడం జరుగుతుందన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపొద్దని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలన్నారు. మైనర్ డ్రైవింగ్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా ఉంటారని, మరో రెండు నెలల పాటు స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగుతుందన్నారు.

172 కేసులు
సోమ, మంగళవారాల్లో నగర వ్యాప్తంగా నిర్వహించిన మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్‌లో 172 మందిపై కేసులు నమోదయ్యాయని డీసీపీ వివరించారు. పిల్లల భద్రత ప్రధానమైందని, ప్రమాదం జరిగిన తరువాత ఆలోచించడం కంటే.. ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడడం మంచిదన్నారు. నగరంలో తిరిగే ప్రతి వాహనదారుడు ట్రాపిక్ నిబంధనలు పాటించాలనే లక్ష్యంతో తాము ముందుకెళ్తున్నామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడంపై కేసులు నమోదవుతున్నాయి, ఇలాంటి వారిపై న్యాయస్థానాలు సీరియస్‌గా ఉన్నాయి, జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మైనర్ డ్రైవింగ్‌లతో జరిగే అనర్థాలను, ప్రమాదాలను డీసీపీ వారికి వివరించారు. పిల్లలు, తల్లిదండ్రులతో మరోసారి మైనర్ డ్రైవింగ్ చేయించమని డీసీపీ ప్రమాణ స్వీకారం చేయించా రు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కరుణాకర్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...