పరిషత్ సంగ్రామం షురూ..


Sun,April 21, 2019 01:00 AM

- షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
- మేడ్చల్ జిల్లాలో మొదటి విడుతలో, రంగారెడ్డి జిల్లాలో మూడు విడుతల్లో ఎన్నికలు
- 22నుంచి నామినేషన్ల స్వీకరణ
- ఎన్నికల నిర్వహణపై అధికారులతో.. జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి సమీక్ష

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పరిషత్ ఎన్నికల సంగ్రామం షురువైంది. మండల, జిల్లా పరిషత్, (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి శనివారం విడుదల చేశారు. రాష్ట్రంలో మూడు విడుతలుగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించినప్పటికీ మేడ్చల్ జిల్లాలో మొదటి విడుతలోనే ఎన్నికలు పూర్తి కానున్నాయి. మేడ్చల్ జిల్లాలో మొత్తం 61 గ్రామాల్లో 42 ఎంపీటీసీ స్థానాలకు 5 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఐదు మండలాల పరిధిలో మొత్తం 1.40లక్షల వరకు ఓటర్లుండగా, వీరి సౌకర్యార్థం 61 గ్రామాల్లో 297-300 వరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లాలోని 5 మండలాల పరిధిలోని 61 గ్రామాల్లో 42 ఎంపీటీసీ స్థానాలకు(ఘట్‌కేసర్-9, కీసర-8, మేడ్చల్-10, శామీర్‌పేట్-9, మూడుచింతపల్లి-6), 5 జడ్పీటీసీ (ఒక్కో మండలాన్ని ఒక్కో జడ్పీటీసీ)స్థానాలకు మొదటి విడుతలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.

ఇదీ షెడ్యూల్...
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ఈ నెల 22 నుంచి 24 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఫిర్యాదులకు అవకాశం. 27న వచ్చిన ఫిర్యాదుల పరిశీలన. 28న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 6న పోలింగ్ నిర్వహిస్తారు. మే 23న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తరువాత ఈ ఓట్లను అంటే మే 27న లెక్కించడంతో పాటు అదేరోజున ఫలితాలను వెల్లడిస్తారు.

అధికారులు సన్నద్ధంగా ఉండాలి
జిల్లా పరిధిలోని 5 మండలాల పరిధిలో జరుగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి ఆదేశించారు. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నోడల్ అధికారులు, ఎంపీడీవోలు, ఆర్డీవోలు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన ఎన్నికల నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని, ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలానికి మూడు ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలను ఏర్పాటు చేసి బాధ్యతతో విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కౌంటింగ్ సెంటర్, స్ట్రాంగ్‌రూమ్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పటిష్ట భద్రత కల్పించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ఇవ్వాలని, రవాణా సౌకర్యం కోసం బస్సులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఫిర్యాదులను స్వీకరించేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల మెటీరియల్‌ను సిద్ధం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 113 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయని, వీటి వద్ద కూడా అదనపు భద్రత ఏర్పాటు చేయాలన్నారు.

అలాగే డీఆర్‌సీ సెంటర్ల వద్ద వాటర్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో మధుకర్ రెడ్డి, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లాలో ...
-5 డివిజన్లు..3 విడుతల్లో ఎన్నికలు
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నగరా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. జిల్లాలో 21గ్రామీణ మండలాలు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో 7 మండలాల్లో, సెకండ్ ఫేజ్‌లో 8, మూడో దశలో 6 మండలాల్లో ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిలో మొదటి దశలో శంకర్‌పల్లి, మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మంచాల, రెండో దశలో నందిగామ,కొత్తూరు, ఫరూఖ్‌నగర్, కేశంపేట్, కొందర్గు, చౌదరిగూడ, కందుకూరు, మహేశ్వరం, మూడోదశలో అమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, శంషాబాద్, మాడ్గుల, యాచారం మండలాల్లో ఉన్నాయి. ఎంపీటీసీలకు పింక్, జెడ్పీటీసీలకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేశారు. అలాగే జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థుల కోసం 60 గుర్తులు, ఎంపీటీసీ అభ్యర్థుల కోసం 30 గుర్తులు సిద్ధం చేశారు.అలాగే పార్టీల గుర్తులపై పోటీ చేసే వారికి ఆ పార్టీ గుర్తులు కేటాయించానున్నారు. 257 ఎంపీటీసీ స్థానాలకు 582 పోలింగ్ లోకేషన్లలో 1433 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో 7లక్షల 31వేల 726 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఇందుకు సంబంధించి 2,716 పీవోలను నియమించారు.

5 డివిజన్లు 3 విడుతలు
జిల్లాలోని 5 డివిజన్లు 3 విడుతలుగా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి దశలో చేవెళ్ల, ఇబ్రహీంపట్నం,రెండోదశలో షాద్‌నగర్, కందుకూరు, మూడోదశలో రాజేంద్రనగర్, కందుకూరు డివిజన్లలో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థులకు 60 గుర్తులు, ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థులకు 30గుర్తులను ప్రస్తుతానికి ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఇందులో 4 జాతీయ పార్టీలకు, 4 ప్రాంతీయ పార్టీలకు, మరో 3 ఇతర రాష్ర్టాలకు సంబంధించిన గుర్తులు కేటాయించారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...