రెండేండ్ల నిర్లక్ష్యం


Sat,April 20, 2019 01:04 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కనీసం ప్రతి పదివేల మందికి ఒక మార్కెట్ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. మోండా మార్కెట్‌ను స్వయంగా అయన సందర్శించి దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు శిథిలావస్థకు చేరిన ఇటువంటి ప్రధాన మార్కెట్లను ఆధునీకరించాలని దాదాపు నాలుగేండ్ల కిందట జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. దీంతో మోడల్ మార్కెట్లను నిర్మించిన అధికారులు వాటి కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిర్మాణం పూర్తయి రెండేండ్లు, వేలంపాట నిర్వహించి ఏడు నెలలైనా లబ్ధిదారులకు కేటాయించకుండా తాత్సారం చేస్తున్నారు.

జనాభాకు అనుగుణంగా..
జనాభాకు అనుగుణంగా మార్కెట్లు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 42 మోడల్ మార్కెట్లను నిర్మించాలని అప్పటి కమిషనర్ సోమేశ్ కుమార్ హయాంలో ప్రతిపాదించారు. ఇందులో భాగంగా రూ. 19.37కోట్ల వ్యయంతో 38 మార్కెట్ల నిర్మాణం చేపట్టగా, అందులో 35 మా ర్కెట్ల నిర్మాణం రెండేండ్ల కిందటే పూర్తయింది. పార్కింగ్ సౌకర్యం సహా మౌలిక సదుపాయాల కల్పన పూర్తికాలేదనే కారణంతో మొదలు వాటి కేటాయింపును నిలిపివేశారు. అనంతరం మార్కెట్ ధరలకన్నా అధిక అద్దెలు నిర్ణయించడంతో ఎవరూ వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బిల్టప్ ఏరియా ప్రస్తుత మార్కెట్ ధర(రిజిస్ట్రేషన్ శాఖ నిర్థారిత ధర)లో 10శాతం మొత్తాన్ని వార్షిక అద్దెగా నిర్థారించారు. అనంతరం వేలం పాట నిర్వహించగా, పలువురు వాటిని తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఇది జరిగి ఏడు నెలలు పూర్తయినా ఇంతవరకు వాటిని లబ్ధిదారులకు కేటాయించకుండా లబ్ధిదారులను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు.

మోండా అభివృద్ధి ప్రతిపాదన
ఎంతో ఘనమైన చరిత్రగల మోండా మార్కెట్‌ను అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు నాలుగేండ్ల కిందట జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. అంతేకాదు, ఆయన స్వయంగా మార్కెట్‌ను సందర్శించి ఏ విధంగా అభివృద్ధి చేయాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీని ప్రకారం అధికారులు ఓ కన్సల్టెంటుతో మార్కెట్ నమూనాను రూపొందించారు. ప్రస్తుతం అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి ఇబ్బంది కలుగకుండానే మార్కెట్ నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఆ తర్వాత ముందుకు సాగలేదు.

సౌకర్యంతో పాటు 525మందికి ఉపాధి
రూ. 20కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మోడల్ మార్కెట్ల వల్ల స్థానికులకు మార్కెట్ సౌకర్యం లభించడమే కాకుండా ఒక్కో మార్కెట్‌లో 15 మంది చొప్పున మొత్తం 525మందికి ఉపాధి లభించే వీలుంది. అంతేకాదు, దీంతో బల్దియాకు ఆదాయం కూడా సమకూరే అవకాశముంది. కాగా, జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మార్కెట్ల వ్యవహారం పూర్తిగా వృథాగా మారింది. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఓ ప్రణాళికాబద్ధంగా మార్కెట్లు నిర్మించి నిర్దేశిత సమయానికి వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అధికార యంత్రాంగం ఎందుకు జాప్యం చేస్తుందో అంతుబట్టడంలేదు. దీనిపై ఓ ఉన్నతాధికారిని వివరణ కోరగా, అంతా సర్కిల్ స్థాయిలో చూస్తున్నారని, తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని పేర్కొనడం విశేషం.

మార్కెట్ల వివరాలు...
మొత్తం చేపట్టిన మార్కెట్లు - 38
అంచనా వ్యయం - రూ. 19.37కోట్లు
పూర్తయినవి - 35
వాటికి అయిన వ్యయం - రూ. 17.83కోట్లు
పురోగతిలో ఉన్నవి - 3
వాటి అంచనా వ్యయం - రూ. 1.54కోట్లు
మార్కెట్‌ల నమూనా.....మార్కెట్ నమూనా - జీ+1

- గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏడు దుకాణాలు(పొడి సరుకులు, కూరగాయలు, తిరు బండారాలు, ఫార్మసీ, ఏటీఎంలు)
- పై అంతస్తులో ఎనిమిది దుకాణాలు(గ్రోసరీ, డ్రైఫ్రూట్స్, నాన్ వెజ్ తదితర దుకాణాలతోపాటు ఒక కేర్ టేకర్ గది)
- బోరుబావితో సహా పదివేల లీటర్ల సామర్థ్యంగల సంపు, పది వేల లీటర్ల సామర్థ్యంగల ఓవర్‌హెడ్ ట్యాంక్
- మార్కెట్ మొత్తం బిల్టప్ ఏరియా- 3758.38చ.అ.లు

hyd

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...