ఇంజినీరింగ్‌తో ఉజ్వల భవిష్యత్


Thu,April 18, 2019 12:59 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇంజినీర్ వృత్తి అత్యంత ప్రాధాన్యత, బాధ్యతాయుతమైన వృత్తి అని, ఇలాంటి వృత్తిని ఎంచుకుని విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. మౌలిక వసతులు, విద్యుత్, రవాణా, సైనిక దళాలు సహా పలు రంగాల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలున్నాయని వివరించారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, కాలేజ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఆధ్వర్యంలో మౌలిక వసతుల రంగంలో ఇంజినీర్లకు ఉపాధి అవకాశాలు అనే అంశంపై జాతీయ సెమినార్‌ను నిర్వహించారు. టీఎస్‌ఐఐసీ ప్రాజెక్ట్‌ల విభాగం సీఈవో వి.మధుసూదన్, క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి తదితరులు హాజరై పలు అంశాలపై ప్రసంగించారు.

సెక్టార్ల వారీగా క్లస్టర్లు..
తెలంగాణలో మౌలిక వసతుల రంగ అభివృద్ధికి ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల రంగం సంస్థ ప్రాజెక్ట్‌ల విభాగం సీఈవో మధుసూదన్ అన్నారు. సెక్టార్ల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం 1.20 లక్షల ఎకరాలను కేటాయించామని ఆయన చెప్పారు. ముచ్చర్లలో ఫార్మాసిటీ, జహీరాబాద్‌లో నిమ్జ్, సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్క్, ఆదిబట్లలో ఎయిరోస్పేస్ సెజ్, వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్, ఖమ్మంలో మెగా ఫుడ్‌పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంజినీరింగ్ వృత్తిదారులు తమ సబ్జెక్ట్‌పై విస్తృత అవగాహన, మల్టీ టాస్కింగ్ నైపుణ్యతలు కలిగి ఉండాలని ఆయన సూచించారు. వర్తమాన సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఇంజినీర్లు మారితేనే రాణించగలరని క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్మాణ రంగం పుంజుకోవడంతో సివిల్ ఇంజినీర్లకు పుష్కలంగా అవకాశాలున్నాయని వివరించారు. నగరంలో ఒకప్పుడు మల్టీస్టోర్ భవనాలంటే బాబుఖాన్ ఎస్టేట్, గృహకల్ప భవనాలు మాత్రమే కనిపించేవని, ఇప్పుడు వాటిని మించిన భవనాలు లక్షల్లో నిర్మాణమయ్యాయన్నారు. ఇటీవల కాలంలో పర్యావరణహిత భవనాల కోసం గ్రీన్‌హౌజ్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ ఆదరణ లభిస్తున్నదని, విద్యార్థులు, కాలేజీల ఫ్యాకల్టీ ఎప్పటిప్పుడు నూతన అంశాలను అవపోసన పట్టాలని సూచించారు. శివదీప్ పంజ్వాని, ఆర్‌కే మందన్, నారాయణరావు, క్రిష్ణారెడ్డి తదితరులు పలు అంశాలపై ప్రసంగించగా ఎంఎల్ నర్సింహారావు, చంద్రమోహన్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...