నేటితో ముగియనున్న ఇఫ్లూ డైమండ్ జూబ్లీ


Tue,April 16, 2019 03:18 AM

- ఐదు నెలల పాటు ఉత్సవాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ / ఉస్మానియా యూనివర్సిటీ : ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) డైమండ్ జూబ్లీ ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. 2018 నవంబర్ 15వ తేదీన వర్సిటీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగా ఈ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) గతేడాదితో 60 ఏండ్లు పూర్తిచేసుకోవడంతో డైమండ్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించింది. అయితే ఈ ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. 2018 నవంబర్ 15వ తేదీ నుంచి వర్సిటీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు మొదలయ్యాయి. దాదాపు ఐదు నెలల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే.. డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలను చేపట్టింది. కేవలం విద్యార్థులు, అధ్యాపకులకే కాకుండా సోషల్ రెస్పాన్సిబులిటీ కింద పలు ప్రోగ్రామ్‌లను నిర్వహించింది. లాంగ్వేజ్‌ల అభివృద్ధి కోసం పలు అంతర్జాతీయ సదస్సులను ఏర్పాటు చేశారు.

అయితే మంగళవారం నిర్వహిస్తున్న ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి అతిథులుగా హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ కెథరిన్ బి. హడ్డా, టర్కిష్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ టర్కీ డాక్టర్ అడ్నాన్ అల్టే అల్టీనర్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సులేట్ జనరల్ సురేశ్ చుక్కపల్లి హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం నిర్వహించిన సమావేశంలో ఇఫ్లూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఇ.సురేశ్‌కుమార్ వెల్లడించారు. ఇఫ్లూను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్లూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ రేవతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవాల్లో నిర్వహించిన కొన్ని కార్యక్రమాలు
- అరబిక్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఎస్సే లిటరేచర్ ఇన్ అరేబియన్ గల్ఫ్ అంశంపై మూడు రోజలు అంతర్జాతీయ సదస్సు నిర్వహణ.
- కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్.
- భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫిబ్రవరి 9న ఇఫ్లూ యూనివర్సిటీ ప్రాంగణంలో డైమండ్ జూబ్లీ ఉత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు.
- ఏసియన్ లాంగ్వేజస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో చైనీస్ స్టడీస్‌లో ప్రస్తుత ధోరణులు- పోకడలు అంశంపై జాతీయ సెమినార్.
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్నో క్యాంపస్‌లో పత్ర సమర్పణ, ప్రసంగాలు, కవిత్వం, నాటక కార్యక్రమాలు.
- యూనివర్సిటీలో దస్తాన్-2019 కల్చరల్ ఫెస్ట్ నిర్వహణ.
- 4కే రన్‌తో పాటు ట్రాక్ ఫీల్డ్ స్పోర్ట్స్‌లో పరుగుపందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్ పోటీలు.
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్సిలేషన్ స్టడీస్ ఆధ్వర్యంలో ఒక్క రోజు వర్క్‌షాప్.
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవెలప్‌మెం ట్ ఆధ్వర్యంలో ఓరల్ కమ్యూనికేషన్‌పై ఒక్కరోజు వర్క్‌షాప్.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...