వివాదానికి దారితీసిన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు


Sun,April 14, 2019 03:06 AM

ఖైరతాబాద్ : పంజాగుట్ట చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు వివాదానికి దారి తీసింది. అంబేద్కర్ జయంతికి 24 గంటల ముందు దళిత సంఘాలు ఓ భారీ విగ్రహాన్ని పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్‌ఆర్ విగ్రహం పక్కన తెల్లవారుజామున 3.30 గంటలకు ఏర్పాటు చేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అనుమతిపై ఆరా తీశారు. అనుమతి కోసం లేఖ రాశామని, ఇంకా రావాల్సి ఉందని దళిత సంఘాల నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులకు పోలీసులు సమాచారం ఇవ్వగా జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోన్ సర్కిల్-17 టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుభాష్ నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదని చెప్పారు. దీంతో అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గుడిమల్ల వినోద్‌కుమార్ నేతృత్వంలో దళిత సంఘాల నాయకులు తాము శాంతియుతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తామని తెలిపారు. దీంతో అధికారులు వాటిని తొలిగిస్తామని చెప్పడంతో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసుల సహకారం కోరగా సుమారు వంద మందికిపైగా పోలీసు సిబ్బంది, ప్రత్యేక బలగాలు అక్కడ మోహరించాయి. ఆందోళన చేస్తున్న దళిత సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సుభాష్ నేతృత్వంలో పోలీసుల రక్షణ మధ్య అంబేద్కర్ విగ్రహాన్ని లారీలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియానికి తరలించారు. కాగా, అక్కడి నుంచి విగ్రహం కొన్ని గంటలకే జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో దర్శనమిచ్చింది. విషయం తెలుసుకున్న కొందరు దళిత సంఘాల నాయకులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. అప్పటికే అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో దళిత సంఘాలు ఒక్కసారిగా ధ్వజమెత్తాయి. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని వరుసగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

అక్కడి నుంచి ఎలా తరలించారో తెలియదు
జీహెచ్‌ఎంసీ సిబ్బంది పోలీసుల సహకారంతో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వరకు భద్రంగా విగ్రహాన్ని చేర్చారు. అయితే అక్కడ ఈవీఎం భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉన్నదని, అయితే స్టేడియం నుంచి డంపింగ్ యార్డుకు ఎవరు తరలించారో తెలియదని సెంట్రల్ జోన్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖి తెలిపారు. ఈ మేరకు పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్నను వివరణ కోరగా తమ సిబ్బంది ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియానికి తరలించారని, ఆ తర్వాత తిరిగి వచ్చేశారని, విగ్రహాన్ని డంపింగ్ యార్డుకు ఎవరు తరలించారో విచారణ చేపడుతున్నామన్నారు.

పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన
అంబేద్కర్ విగ్రహాన్ని చెత్తకుప్పలో వేయడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరుస్తూ డంపింగ్ యార్డుకు తరలించడం హేయమైన చర్య అని, బాధ్యులైన జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ, శానిటేషన్ అధికారులు, డంపింగ్ యార్డు ఏఈపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పంజాగుట్ట సీఐ మోహన్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, టీఎమ్మార్పీఎస్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.రాజేశ్ మాదిగ, యువసేన అధ్యక్షుడు వనం శ్రీనివాస్, అధికార ప్రతినిధి ఇటుక గోపి మాదిగ, మాలమాల ఉపకులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు రాంచందర్, అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కేవీ ప్రసాద్, రామోహన్, పిడమర్తి రాంబాబు పాల్గొన్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకోండి : జాతీయ ఎస్సీ
కమిషన్ సభ్యులు రాములు
అంబేద్కర్ విగ్రహాన్ని చెత్తకుప్పలో వేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు కోరారు. శనివారం రాత్రి పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏసీపీని కోరారు. ఆయన వెంట మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య, వివిధ దళిత సంఘాల నాయకులు ఉన్నారు.

విగ్రహాన్ని తొలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలి
ముషీరాబాద్, నమస్తే తెలంగాణ : పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలిగించిన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని టీఎంఆర్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యలు కోరారు. శనివారం విద్యానగర్‌లోని టీఎంఆర్‌పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని తొలిగించడం శోచనీయమన్నారు. సమావేశంలో టీఎంఆర్‌ఎస్ నాయకులు జన్ను కనకరాజు, లక్ష్మి, భాగ్యమ్మ, జ్యోతి పాల్గొన్నారు.

ఘటనపై ప్రత్యేక విచారణ : దానకిశోర్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఖైరతాబాద్ సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట అనంతరం జరిగిన సంఘటనలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించగా, పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది దాన్ని తొలిగించి యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియానికి తరలించినట్లు ఆయన ప్రకటనలో తెలిపారు. కాగా, అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని జీహెచ్‌ఎంసీ సిబ్బందికి తెలియకుండా గుర్తు తెలియని వ్యక్తులు ఇతర ప్రాంతాలకు తరలించారని, ఈ క్రమంలో విగ్రహం వాహనం నుంచి కిందపడి దెబ్బతిన్నదని చెప్పారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొంటూ, దీనిపై జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ ఐఏఎస్ అధికారిచే అంతర్గత విచారణ జరుపడంతోపాటు సమగ్ర విచారణ చేయాలని పోలీసు కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా యూసుఫ్‌గూడ యార్డు ఆపరేటర్ బాలాజీని విధుల నుంచి తొలిగిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు.

ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ బాలాజీ సస్పెన్షన్
ఖైరతాబాద్ : అంబేద్కర్ విగ్రహాన్ని చెత్త డంపింగ్ యార్డులో వేయడాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున పంజాగుట్ట చౌరస్తాలో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియానికి తరలించారు. అయితే అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు ఎలా తరలించారన్న విషయంపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు అందుకు బాధ్యుడైన జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు విభాగం ఆపరేటర్ బాలాజీని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ నేతృత్వంలో కమిటీ వేశారని, ఇంకెవరైనా బాధ్యులు ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటారని జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖి తెలిపారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...