గతం కంటే తక్కువే


Sat,April 13, 2019 03:02 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరవాసులు ఈసారి కూడా ఓటింగ్‌కు ఆసక్తి కనబర్చలేదు. గతంలో జరిగిన అన్ని ఎన్నికలకన్నా ఈసారి అతితక్కువ ఓటింగ్ నమోదుకావడమే ఇందుకు నిదర్శనం. గురువారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో 45.51శాతం ఓటింగ్ నమోదైంది. ఇందులో హైదరాబాద్ స్థానంలో 44.75శాతం ఓటింగ్ నమోదు కాగా, సికింద్రాబాద్‌లో 46.26శాతం నమోదైంది. ఈ మేరకు రెండు పార్లమెంటు స్థానాల రిటర్నింగ్ అధికారులు వివరాలు వెల్లడించారు. వాస్తవానికి గురువారం సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ గడువు ముగిసినప్పటికీ అప్పటికే క్యూలైన్లలో ఉన్నవారు ఓటింగ్‌లో పాల్గొన్న అనంతరం ఆయా పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులు ఓటింగ్ వివరాలను రిటర్నింగ్ అధికారికి అప్పగించేవరకు రాత్రి కావడంతో ఓటింగ్ వివరాలను శుక్రవారం ఉదయం అధికారులు వెల్లడించారు. ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో అంబర్‌పేట్‌లో అత్యధికంగా 52.70 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా నాంపల్లిలో 38.77 శాతం ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్‌లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను అంబర్‌పేట్, సికింద్రాబాద్ సెగ్మెంట్లలో మాత్రమే పోలింగ్ 50శాతం దాటడం విశేషం. నాంపల్లి, జూబ్లీహిల్స్‌లో 40శాతానికి తక్కువగా నమోదుకావడం మరో విశేషం. అలాగే, హైదరాబాద్ విషయానికొస్తే, గోషామహెల్‌లో అత్యధికంగా 53.51శాతం నమోదుకాగా, అత్యల్పంగా మలక్‌పేట్‌లో 37.40 శాతం మాత్రమే నమోదైంది. గోషామహల్ స్థానంలో మాత్రమే ఓటింగ్ 50శాతం మించగా, యాకత్‌పురా, మలక్‌పేట్‌లలో 40శాతానికి లోపే ఓటింగ్ నమోదైంది.

గతంతో పోల్చితే అతితక్కువ ఓటింగ్
గతంలో జరిగిన అన్ని ఎన్నికలకన్నా నగరంలో ఈసారి అతితక్కువ ఓటింగ్ నమోదుకావడం విశేషం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 50.86 శాతం ఓటింగ్ నమోదు కాగా, 2014లో జరిగిన ఎన్నికల్లో 52.99 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే, గత ఏడాది (2018) అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 15అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4057488 మంది ఓటర్లకుగాను కేవలం 50.06 శాతం, అంటే సగానికి కాస్త అటుఇటుగా మాత్రమే ఓట్లు పోలయ్యాయి. 2009 సార్వత్రిక ఎన్నికల్లో 53.86 శాతం పోలింగ్ నమోదైంది.మొత్తంగా చూస్తే 2009 నుంచి 2018వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో ఇంచుమించు 50శాతానికి కాస్త అటుఇటుగా ఓటింగ్ నమోదైంది. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలు ఈ అన్ని ఎన్నికలకన్నా తక్కువ ఓటింగ్ నమోదుకావడం విశేషం. అయితే 2016 బల్దియా ఎన్నికల్లో భాగంగా గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలోని 150 డివిజన్లకు పోలింగ్ జరుగగా అందులో 45. 27శాతం ఓటింగ్ నమోదైంది. ఎండ వేడి, పొరుగు రాష్ట్రవాసులు సొంత ప్రాంతాలకు వెళ్లడం తదితర కారణాల వల్ల ఓటింగ్ శాతం తగ్గినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మల్కాజిగిరి @ 49.40
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 49.40శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు అధికారులు అధికారికంగా ప్రకటించారు. గురువారం ఐదు గంటల వరకు 49.11శాతం పోలింగ్ నమోదు జరిగిందని, పలు పోలింగ్ స్టేషన్లలో ఐదు గంటల్లోపు వచ్చి లైన్లలో ఉన్న వారికి అధికారులు ఓటింగ్ అవకాశం కల్పించారు. దీంతో గురువారం రాత్రితో పోల్చితే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌ల (మేడ్చల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీగర్, కంటోన్మెంట్,) పరిధిలో మొత్తం ఓటర్లు 31,49,710 (పురుషులు 16,37,505, స్త్రీలు-15,11,860, ఇతరులు-349) ఉండగా, వీరిలో 50.6శాతం ఓటర్లు 17వ లోకసభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గ్రామీణ ప్రాంతాలున్న మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో అత్యధికంగా 56.58 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 44.49శాతం పోలింగ్ నమోదైంది. పట్ణణ ప్రాంతాలతో పాటు, విద్యాధికులు ఎక్కువగా నివాసమున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం పోలింగ్ శాతం క్రమంగా తగ్గింది. ఎల్బీనగర్-44.49శాతం, మల్కాజిగిరి-50.16శాతం, కుత్బుల్లాపూర్‌లో 49.63శాతం, కూకట్‌పల్లిలో-50.72శాతం, ఉప్పల్‌లో 46.34 శాతం, కంటోన్మెంట్‌లో-47.85శాతం పోలింగ్ నమోదైంది. 2014 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే 1.45శాతం, 2009 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే 2.03 శాతం పోలింగ్ తగ్గింది.

చేవెళ్ల @ 53.22
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో 53.22 శాతం పోలింగ్ నమోదైంది. అయితే గురువారం పోలింగ్ ముగిసే సమయానికి 53.08 శాతం పోలింగ్ నమోదయ్యింది. శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్ విడుదల చేసి పోలింగ్ శాతం ప్రకారం అదనంగా మరో 12 శాతం పోలింగ్ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో పెరిగింది. అత్యధికంగా షాద్‌నగర్ నియోజకవర్గంలో 74.6 శాతం, అత్యల్పంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 41.80 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎం బాక్స్‌లను శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రానికి తరలించారు. నగర శివారు ఓటర్ల కంటే గ్రామీణ జిల్లాలోనే ఓటింగ్ నమోదు అధికం కావడంతో గమనార్హం. అయితే ఇది అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే తక్కువే. శివారు ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవవర్గాల్లో పోలింగ్ శాతం అశించిన స్థాయిలో నమోదు కాలేదు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...