కాంగ్రెస్ గాడి తప్పింది.. కారు దూసుకుపోతున్నది


Sun,March 24, 2019 02:32 AM

- 16 మంది ఎంపీలతో ఢిల్లీని శాసిద్దాం
- జాతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమే
- కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం
- లాల్‌బజార్ సభలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కంటోన్మెంట్, నమస్తే తెలంగాణ : లాల్‌బజార్ సభలో స్థానిక బోర్డు సభ్యురాలు ప్యారసాని భాగ్యశ్రీ, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు గౌరీశంకర్, మాజీ బోర్డు సభ్యుడు శ్యాంకుమార్, బీజేపీ నాయకుడు శ్రీగణేశ్‌లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలు ఈ దేశానికే మార్గదర్శకంగా మారాయని అన్నారు. కేసీఆర్ ఆలోచనలోంచి రూపుదిద్దుకున్న రైతుబంధు పథకాన్నే కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి పీఎం సమ్మాన్ నిధి పథకంగా అమలు చేస్తుందని గుర్తు చేశారు. పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు కూడా మన పథకాలనే కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

మనతో మరో 160 మంది..
టీఆర్‌ఎస్ నుంచి 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీలో మన సత్తా చాటుతామన్నారు. జాతీయ స్థాయితో మరో 160 మంది ఎంపీలు మనతో జతకడుతారని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు లేని చోటనే జాతీయ పార్టీలకు మనుగడ ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.

పేదల గురించి ఆలోచించేది కేసీఆరే..
నిరుపేదల కోసం ఆలోచించి పనిచేసే ప్రభుత్వం టీఆర్‌ఎస్ తప్పా దేశంలో మరొకటి లేదన్నారు. ఆసరా పథకం కింద మే నుంచి రూ.2016 ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఆడబిడ్డకు సొంత మేనమామ మాదిరిగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రూ.1,00,116 అందిస్తున్నారన్నారు.

కొడంగల్‌లో చెల్లని రూపాయి..
కాంగ్రెస్‌లో కొంత మంది ఇక్కడి నుంచి బరిలో నిలిచారని, రెండు నెలల కింద అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతనే మళ్లీ అదే గుర్తుపై పోటీలో ఉన్నారన్నారు. కొడంగల్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు.

రెండు ైఫ్లెఓవర్లు నిర్మిస్తాం
కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రెండు పై వంతెనలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇందుకోసం 100 ఎకరాల రక్షణ శాఖ స్థలాన్ని ఇవ్వమని ముగ్గురు రక్షణ మంత్రులను కలిసి విన్నవించినా.. పట్టించుకోలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కంటోన్మెంట్‌లో నీటి బిల్లుల సమస్యను పరిష్కరిస్తామన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్ నిర్ణయాత్మక శక్తి..
కేంద్రంలో ఎవరు ప్రధాని కావాలో నిర్ణయించేది టీఆర్‌ఎస్ పార్టీయేనని, అప్పుడు కేంద్రం మెడలు వంచైనా కంటోన్మెంట్‌లో నివసిస్తున్న పేదల భూములకు పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి ఇక్కడివాడే అని, బోర్డు మెంబర్ల మాదిరిగానే ఎల్లప్పుడూ మీ అందరికీ అందుబాటులో ఉంటాడని తెలిపారు.

బ్లాక్ మెయిలర్లతో జాగ్రత్త: మంత్రి మల్లారెడ్డి
కొడంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి లోక్‌సభకు పోటీ చేస్తున్నాడు.. నాన్‌లోకల్..బ్లాక్ మెయిలర్ అయిన రేవంత్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీ శంభీర్‌పూర్ రాజు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ, సభ్యులు కె.పాండుయాదవ్, జక్కుల మహేశ్వర్‌రెడ్డి, కేశవరెడ్డి, కార్పొరేటర్ ఆకుల రూప, కో అప్షన్ సభ్యుడు నర్సింహాముదిరాజ్, నాయకులు క్రిశాంక్, శ్రీగణేశ్, మాజీ సభ్యుడు ప్రభాకర్ పాల్గొన్నారు.

పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్దేశం..
కంటోన్మెంట్, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాత్రి బోయిన్‌పల్లిలోని మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు జి.సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్‌రెడ్డి, వివేకానంద, టీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీర్‌పూర్‌రాజు,బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ, సభ్యులు పాండుయాదవ్, మహేశ్వర్‌రెడ్డి, కేశవరెడ్డి, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...