నగరాల ఆధునికీకరణలో సవాళ్లు


Sun,March 24, 2019 02:29 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నగరాలను ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పద్మశ్రీ డాక్టర్. బిమల్ పటేల్ అభిప్రాయపడ్డారు. మెరుగైన ప్రణాళికలతో సవాళ్లను అధిగమించవచ్చన్నారు. ముఖ్యంగా ఆయా భూసేకరణ కోసం ప్రజలను ఒప్పించడం, పునరావాసం అతిపెద్ద సవాలుగా మారినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ప్రైవేటు వ్యక్తుల స్థలాలు సేకరించకుండానే వినూత్న ప్రణాళికల ద్వారా అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు ఆయన చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ డిజైనర్స్ ఇండియా(ఐయుడీఐ) ఆధ్వర్యంలో శనివారం ఖైరతాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)లో మోడ్రనైజేషన్ ఆఫ్ ఇండియన్ సిటీస్‌అనే అంశంపై సదస్సు జరిగింది. ప్రముఖ ఆర్కిటెక్ట్, పట్టణ ప్రణాళికా నిపుణులు, అహ్మదాబాద్‌లోని సీఈపీటీ యూనివర్శిటీ అధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్. బిమల్ పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొని తాను చేపట్టిన సాబర్మతి రివర్‌ఫ్రంట్, ముంబాయి పోర్ట్ ట్రస్ట్‌కు చెందిన ఈస్టర్న్ ఫ్రంట్, కాశీ విశ్వనాథ్ మందిర్ ప్రాజెక్టు తదితర రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జనాభా పెరుగుదల కారణంగా ప్రజలకు ఖాళీ జాగాలు కరువవుతున్న నేపథ్యంలో ప్రజా ఉపయోగకరమైన స్థలాలను సృష్టించడమే లక్ష్యంగా ఇటువంటి ప్రాజెక్టుల ఆవశ్యకత ఏర్పడిందన్నారు. సబర్మతి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 10వేలమందికి పునరావాసం కల్పించినట్లు, దీనికి 1000కోట్లు ఖర్చుకాగా, ఇరువైపులా కారిడార్ల నిర్మాణం, మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు, పచ్చదనం అభివృద్ధి తదితర పనుల కోసం మరో రూ. 1200 కోట్లు వ్యయం అయినట్లు పేర్కొన్నారు. అతి తక్కువ ఖర్చుతో అత్యంత ఆధునిక పద్ధతుల్లో సాబర్మతి ప్రాజెక్టును తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును 20 ఏండ్లలో పూర్తిచేశామన్నారు.

నదికి ఇరువైపులా కారిడార్లు, బట్టలు ఉతికేవారికి ప్రత్యేక ఏర్పాటు, సండే మార్కెట్, వరదనీటి కాలువ వ్యవస్థ, మురుగునీటి పారుదల పైప్‌లైన్లు, చేశామన్నారు. దీని నిర్మాణంతో అహ్మదాబాద్ నగరానికి సరికొత్త అందాలు సమకూరాయన్నారు. ప్యారీస్, లండన్, న్యూయార్క్, సింగపూర్ తదితర నగరాల్లో ఎన్నో ఏండ్ల కిందటే వారు రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. ముంబాయి పోర్ట్ ట్రస్ట్ ప్రాజెక్టుపై మాట్లాడుతూ, 190 0సంవత్సరంలో ఈ పోర్టును నిర్మించగా, ఇప్పుడది పనికిరాకపోవడంతో మరో పోర్టు నుంచి కార్యకలాపాలు సాగుతున్నాయి. తీవ్ర కాలుష్యంగా మారిందన్నారు. దీన్ని ప్రజలకు ఉపయోగంలోకి తేవాలనే ఉద్దేశంతో రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామన్నారు. నగరం మధ్యలో ఎంతో విలువైన ఈ స్థలాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు ఇతర ప్రాంతాలతో దాన్ని అనుసంధానం చేశామన్నారు. దీంతో ఇప్పుడు కొత్తకొత్త భవనాలు వస్తున్నాయన్నారు. కాశీ విశ్వనాథ్ మందిర్ ప్రాజెక్టుకు వెళ్లేందుకు సరిగా రోడ్లు కూడా లేవని, నది వడ్డున గల ఆలయానికి వెళ్లేందుకు చిన్నచిన్న నడకదారులే ఉన్నాయన్నారు. ప్రఖ్యాతిగాంచిన చారిత్రక ఆలయం కావడంతో దేశవిదేశాలనుంచి కూడా భక్తులు వస్తుంటారని, కాశీ నగరం నిత్యం జనం రద్దీతో కిటకిటలాడుతుందన్నారు. నది ఒడ్డు నుంచి గుడివరకు వెళ్లేందుకు దారులను ఏర్పాటుచేయడం, రెండు వైపులా భక్తులు వచ్చిపోయేందుకు ద్వారాలు నిర్మించడం, భక్తుల కోసం సత్రాల నిర్మాణం, రోడ్ల విస్తరణ తదితర పనులను చేపట్టామన్నారు. తమ స్థలాలు వదులుకునేందుకు స్థానికులను ఒప్పించడం చాలా కష్టంతో కూడుకున్నపని అని చెప్పారు. అయినప్పటికీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయన్నారు. కాలానుగుణంగా నగరాలు అభివృద్ధి చెందకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవని పటేల్ పేర్కొన్నారు. రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుల అభివృద్ధితో ప్రజలు సేదదీరేందుకు అవకాశం లభించడమే కాకుండా భూగర్భజలాలు వృద్ధి చెందుతాయన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలతో సవాళ్లను అధిగమించవచ్చన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...