దొంగ ఏజెంట్‌లను నమ్మకండి..


Sun,March 24, 2019 02:27 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఏజెంట్‌ల బారిన పడి విదేశాల్లో ఉద్యోగాల కోసం ఆశపడి బానిసలుగా మారుతున్న వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల శంషాబాద్‌లో వరుసగా నకిలీ వీసాలతో వచ్చి పట్టుబడ్డ మహిళలు, పురుషుల సంఘటనలపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ కడప, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మణికంఠ, పుష్పవతి ముఠాలకు చెందిన 15 మంది ఏజెంట్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వీరికి సహకరిస్తున్న ఇద్దరు ఎయిర్‌లైన్స్ ఉద్యోగులతో పాటు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్‌లను ఇచ్చిన చేవేళ్ల పోలీసు స్టేషన్ కానిస్టేబుల్‌ను కూడా అరెస్టు చేశారు. అదే విధంగా మార్చి నెలలో 71 నకిలీ వీసాలతో వచ్చిన అమాయకులు కూడా పోలీసులకు దొరికిపోయారు. దర్యాప్తులో పట్టుబడ్డ వారంతా వారికి ఉన్న ఆర్థిక కష్టాల నేపథ్యంలో కువైట్‌లో కార్మికుల ఉద్యోగాలు చేసేందుకు సిద్ధమై ఏజెంట్‌లకు లక్ష రుపాయలను చెల్లిస్తూ అక్రమ మార్గంలో వెళ్లేందుకు సిద్ధమవుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఏజెంట్‌లకు లక్ష రుపాయలు ఇచ్చే దానికి కన్నా నేరుగా ప్రభుత్వంతో రిజిస్టర్ అయిన ఏజెంట్‌లను సంప్రదిస్తే రూ.25 వేలతోనే మొత్తం ప్రక్రియ పూర్తవుతుందనే చాలా మందికి తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే పదవ తరగతి లోపు విద్యార్హత ఉండి విదేశాల్లో పని చేసేందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపే వారికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ పలు సూచనలు జాగ్రత్తలను వివరించారు. అవి ఇలా...

- కేంద్ర ప్రభుత్వంలో రిజిస్టర్ అయిన ఏజెంట్‌లను మాత్రమే సంప్రదించాలి.
- రిజిస్టర్ ఏజెంట్ సమాచారం www.emigrate. gov.in.లో ఉంటుంది. వాటిలో సమాచారం తెలుసుకోవచ్చు.
- నాంపల్లిలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రేట్ ఆఫీసులో విదేశాల్లోని కార్మిక ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వపరంగా నమోదైన కంపెనీల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఆ వివరాలు వెబ్‌సైట్లో ఉంటాయి.
- దరఖాస్తు చేసుకున్న వారికి విదేశాల్లో ఉద్యోగం లభిస్తే వారికి అక్కడి మెడికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
- విదేశాల్లో ఏ పనికి వెళ్లదల్చుకున్నారో వాటికి సంబంధించిన శిక్షణ కూడా ఉచితంగా ప్రొటక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రంట్స్ కార్యాలయం అందిస్తుంది.
- ప్రభుత్వపరంగా నమోదు చేసుకున్న ఏజెన్సీల ద్వారా వెళ్తే విదేశాల్లో ఎలాంటి వేదింపులకు గురికాకుండా అక్కడ ఉండే భారత ప్రభుత్వ రాయబార కార్యాలయం నందు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
- పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ మీరు నివాసముండే పోలీసు స్టేషన్‌లో దరఖాస్తు చేసుకుని తీసుకోండి. దీనికి కేవలం మీరు 135 రూపాయలను మీ సేవలో చెల్లించి క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు.
- ఏజెంట్‌ల మాయమాటలకు బోల్తాపడి వారికి పాసుపోర్టులు, డబ్బులు ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా ఇచ్చి ఉంటే వాటిని వెనక్కి తీసుకోండి. వారు తిరకాసు పెడితే పోలీసులను సంప్రదించండి.
- మీ విదేశీ స్టాంపింగ్, విమాన టికెట్ ధరలకు అధికంగా చెల్లించకండి. వాటికి నిర్ణయించి ధరనే కట్టండి.

- మీ జీతభత్యాలు, భోజన సదుపాయాలు, వసతి సౌకర్యం గురించి ముందుగానే తెలుసుకోండి.
- పని గంటలు, ఓటీ అలవెన్సులు, సెలవులు, సామాజిక భద్రత ప్రయోజనాలు, స్థానిక కార్మిక చట్టాల గురించి తెలుసుకోండి.
- వివాదాల పరిష్కార విధానం గురించి రిజిస్టర్ ఏజెంట్‌ల నుంచి తెలుసుకోండి.
- మీ విలువైన కష్టార్జితాన్ని దొంగ ఏజెంట్ల పాలు చేయకండి.
- నకిలీ ఏజెంట్లు ఇస్తున్న వీసాలతో విదేశాలకు వెళ్లకండి, పోలీసులకు దొరికిపోకండి.
రాష్ట్రం, కేంద్రం ప్రభుత్వం మీ క్షేమం కోసం అనేక చర్యలను తీసుకుంటుంది. ఆ విషయాన్ని గమనించండి, ప్రభత్వంలో రిజిస్టరైన ఏజెంట్‌ల ద్వారానే విదేశాలకు వెళ్లండి, ఈ విషయాలను అందరూ గమనించి తెలియని వారికి కూడా చెప్పాలని సీపీ సజ్జనార్ కోరారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...