వేడెక్కుతున్న రాజకీయం


Fri,March 22, 2019 04:09 AM

బడంగ్‌పేట: మహేశ్వరం నియోజక వర్గంలో రాజకీయం వేడెక్కింది. పార్లమెంట్ ఎన్నికలలో పట్టు సాధించడానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పావులు కదుపు తున్నారు. సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు హమీల వర్షం కురిపిస్తున్నారు. ప్రచారం కోసం రథాలు సిద్ధం చేసుకున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డిపై విజయం సాధించారు. ప్రస్తుతం అప్పుడున్న పరిస్థితి లేదు. సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. టీఆర్‌ఎస్ నుంచి విజయం సాధించిన కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీచేసిన కార్తీక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.

దీంతో పరిస్థితి తలకిందులైంది. గతంలో చేవెళ్ల పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు పట్టు ఉండేది. ప్రస్తుతం ఆపరిస్థితి లేదు. చేవెళ్ల చెల్లెమ్మగా మారున్న మాజీ మంత్రి సబితారెడ్డికి మంచి పట్టున్న ప్రాంతం. ఆమె కూడా త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పాటు కాంగ్రెస్, టీడీపీలో ఉన్న వారంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ విజయం ఖాయమని ఆపార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని ఏ విధంగానైనా సాధించాలని ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గంలో రెండు దఫాలు సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లోకి పోకుండా నివారించే ప్రయత్నం బెడిసికొట్టింది. మాజీ మంత్రి, రాజసభ సభ్యుడు టీ.దేవేందర్‌గౌడ్‌ను కలిసి మద్దతివ్వాలని కోరారు. చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు.

మహేశ్వరం నియోజక వర్గంలో బీజేపీ నాయకులు కూడా సభలు సమావేశాలు పెడుతున్నారు. అయితే బీజేపీకి ఎంపీ సీటు గెలిచేంత బలంలేదు. చేవెళ్ల ఎంపీ సీటును టీఆర్‌ఎస్ ఎలాగైనా వదులు కోవద్దన్న పట్టుదలతో ఉంది. సబితారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత చేవెళ్ల ఎంపీ గెలుపు నల్లేరు మీద నడకేనని వినిపిస్తున్నది. పార్టీల బలాబలాలు ఏ విధంగా చూసినా టీఆర్‌ఎస్ పార్టీకి అన్ని విధాలు కలిసి వస్తున్నదని వివిధ రాజకీయ పార్టీల నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు. గతంలో కన్నా ప్రస్తుతం టీఆర్‌ఎస్ బలం పుంజుకున్నది. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా కారు వేగానికి కొట్టుకపోవడం ఖాయమని నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం జోరందుకున్నది.

నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ కొండా విశ్వేశ్వరరెడ్డి నెల రోజుల నుంచి నియోజకవర్గంలో సభలు సమావేశాలు పెడుతున్నారు. శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచార రథాలపై నాయకులు ప్రచార హోరులో పాల్గొననున్నారు. దీంతో నియోజక వర్గం వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలయ్యింది.

184
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...