నవంబర్ కల్లా..మూడో కారిడార్


Thu,March 21, 2019 02:08 AM

- జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇమ్లిబన్..హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు ..మరో ఆరు నెలల్లో సేవలు
- రెండు నెలల్లో ట్విన్‌లేన్
- త్వరలోనే కామన్ మొబిలిటీ కార్డు
- హైటెక్ సిటీ నుంచి నాగోలుకు కేవలం 50 నిమిషాల ప్రయాణం
- ఒక మెట్రో రైలు 7 బస్సులతో సమానం


-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మెట్రో రైలు మూడో కారిడార్ నవంబర్ కల్లా పూర్తికానున్నది. ఈ కారిడార్‌కు సంబంధించి అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు 10 కిలోమీటర్ల మార్గాన్ని గవర్నర్ బుధవారం ప్రారంభించారు. హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు మరికొంత మార్గం నిర్మాణంలో ఉన్నది. నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు 27 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. కాగా ప్రస్తుతం ప్రతిరోజు ప్రయాణికులు 90 వేల మెట్రో కార్డులు ఉపయోగిస్తున్నారు. కామన్‌కార్డులూ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రోడ్డుపై నడిచే వాహనాలతో పోల్చితే కేవలం 20 శాతం ఇంధనంతోనే మెట్రో రైలు ప్రయాణిస్తుంది. బ్రేక్స్ ద్వారా 40 శాతం రీ ఎనర్జీ వస్తుంది.

కొండాపూర్/మాదాపూర్ : ఐటీ కారిడార్‌కు అత్యంత వేగంగా చేరుకునేందుకు మార్గం సుగమమైంది. గత కొంత కాలంగా ఐటీ ఉద్యోగులతోపాటు హైటెక్‌సిటీ వైపు ప్రయాణాలు సాగించే వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమీర్‌పేట్ - హైటెక్‌సిటీల మధ్య మెట్రో రైలు బుధవారం పరుగులు తీసింది. దీంతో ఎల్‌బీనగర్, ఉప్పల్ వైపుల నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చే ఐటీ ఉద్యోగులకు ప్రయాణ సమయంతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి. ఇది వరకే ప్రారంభమైన రెండు మెట్రో కారిడార్‌లతో అందుబాటులోకి వచ్చిన దూరానికి హైటెక్‌సిటీ 3వ కారిడార్‌తో మరో 10 కిలోమీటర్లు కలుపుకుని 56 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అమీర్‌పేట్ పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ల నుంచి హైటెక్‌సిటీ మార్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఐటీ కారిడార్ మెట్రో ఊరటనిస్తుంది. కాగా, ఎల్‌బీనగర్, ఉప్పల్ నుంచి హైటెక్‌సిటీకి వచ్చే ప్రయాణికులు అమీర్‌పేట్‌లో మెట్రో ఇంటర్‌ఛేంజ్ అవ్వాలి. ఎన్నో సమస్యలను అధిగమిస్తూ అనుకున్న సమయానికి మెట్రో ప్రారంభానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో ఐటీ కారిడార్‌కు మెట్రో రైలు చేరుకోవడంపై ఐటీ ఉద్యోగులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్ సమస్యకు ఊరట
నిత్యం రద్దీగా ఉండే హైటెక్‌సిటీలో మెట్రో రాకతో ట్రాఫిక్ సమస్యకు కొంత ఊరట లభించనున్నది. ఇప్పటికే అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో సమస్య దూరమైంది. ఇప్పుడు మెట్రో రాకతో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోనున్నది. అమీర్‌పేట్ -హైటెక్‌సిటీ రూట్లలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగించే ప్రయాణికులు మెట్రోలో ప్రయాణాలు కొనసాగిస్తే సమస్య తీరుతుంది.
- రాజగోపాల్‌రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్

ట్రాఫిక్ ఇబ్బందులు దూరం
అమీర్‌పేట్ - హైటెక్‌సిటీ మెట్రో రైలు ప్రారంభంతో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గనున్నది. ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణాలు సాగించే వారిలో 90శాతం మంది మెట్రో ప్రయాణానికే మొగ్గు చూపుతారు. ఇప్పటికే మెట్రో ప్రారంభమైన ఎల్‌బీనగర్, ఉప్పల్ వైపు అధిక రద్దీతో కొనసాగుతుంది. హెటెక్‌సిటీ మెట్రో రైలుకు సైతం అదే స్థాయిలో ప్రజాదరణ ఉంటుంది.
- వేణుగోపాల్‌రావు, దిల్‌సుఖ్‌నగర్

ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు
విధుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొనే ఐటీ ఉద్యోగులకు సకల సౌకర్యాలతో కూడిన మెట్రో ప్రయాణం ఎంతో మేలు చేస్తుంది. ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభినందనీయం.
- రాజశేఖర్, ఐటీ ఉద్యోగి

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...