గులాబీ జోరు..


Thu,March 21, 2019 02:04 AM

- ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్
- అత్యధిక ఎమ్మెల్యేలతో బలోపేతం
- చేరికలు, సన్నాహక సమావేశాలతో కార్యకర్తల్లో ఉత్సాహం
- నేడు ఖరారు కానున్న అభ్యర్థులు
- 30 నుంచి కేటీఆర్ రోడ్ షోలకు ఏర్పాట్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూకుడు మరింత పెంచింది. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలను పూర్తి చేసుకుని నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలను ఉధృతం చేసింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పార్లమెంట్‌లోనూ విజయం సాధించడానికి ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఈ నెల 30వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి ప్రచారంలో కేటీఆర్ పాల్గొనేలా పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున రోడ్ షోలు ఉండేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ రోడ్ షోలకు అపూర్వ ఆదరణ లభించినట్లుగానే ప్రచారంలో కేటీఆర్ తనదైన మార్కును సొంతం చేసుకున్నారని, హైదరాబాద్ మినహా మిగిలిన మూడు స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

రోజుకు రెండు నియోజకవర్గాల్లో రోడ్ షో
సికింద్రాబాద్ పరిధిలో సికింద్రాబాద్, సనత్‌నగర్, ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, మాల్కాజిగిరి పరిధిలో మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, మేడ్చల్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, చేవెళ్ల పరిధిలో రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, మహేశ్వరం, పరిగి, తాండూరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. రోజుకు రెండు నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు ఉండేలా పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది. ఉదయం సమయంలో కేటీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని, సాయంత్రం గ్రేటర్‌లో రోడ్ షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్‌లో జరిగిన శాసనసభ, బల్దియా ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ తనదైన ముద్ర వేశారు.

గెలుపు ఖాయం.. మెజార్టీయే లక్ష్యం
చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ ఎమ్మెల్యేలతో బలమైన శక్తిగా ఉన్నది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం పార్టీకి తిరుగులేదు. కాగా మిగిలిన మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లో ఆదరణ కోల్పోయాయని, టీఆర్‌ఎస్‌లోకి నేతల చేరికలే ఇందుకు నిదర్శమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...