కుప్పకూలిన రిటైనింగ్‌వాల్


Thu,March 21, 2019 02:04 AM

బంజారాహిల్స్, (నమస్తే తెలంగాణ): ఎలాంటి జాగ్రత్తలు లేకుండా భారీ రిటైనింగ్ గోడ నిర్మాణాన్ని చేపట్టిన బిల్డర్ నిర్లక్ష్యానికి 10 నెలల పసిపాప బలైంది. నిర్మాణంలో ఉన్న భారీ గోడ కుప్పకూలి కింది భాగంలో ఉన్న ఇండ్లపై పడడంతో నాలుగు ఇండ్లు ధ్వంసం కావడంతో పాటు చిన్నారి మృతి చెందింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిలింనగర్ సైట్-2లోని జూబ్లీహిల్స్ రోడ్ నం. 87లోని 1000 గజాల స్థలంలో ఇంటి నిర్మా ణం కోసం పనులు చేపట్టారు. దీనిలో భాగంగా స్థలం చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. స్థలాన్ని అనుకుని కింద ఉన్న బస్తీకి చెందిన ఇండ్ల యజమానులకు ఎలాం టి సమాచారం లేకుండా బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పనులు ప్రారంభించారు.

సరైన విధంగా సెంట్రింగ్‌బాక్స్‌లు ఏర్పాటు చేయకుండా రెడీమిక్స్‌ను నింపడంతో ఉదయం 7 గంటల ప్రాంతంలో రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలింది. కాంక్రీట్ ఒక్కసారిగా పడిపోవడంతో దిగువభాగంలోని హకీంపేట కుంటలోని నాలుగు ఇండ్లు ధ్వంసమయ్యాయి. మహ్మద్ ఖురేషీ అనే వ్యక్తికి చెందిన రేకుల ఇంటిపై భా రీగా కాంక్రీట్ పడడంతో రేకులు విరిగిపోయి మంచంపై నిద్రిస్తున్న ఖురేషీ కూతురు 10 నెలల షాహీన్ మాయిన్ పై పడిపోయాయి. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటన సమయంలో అదృష్టవశాత్తూ మిగిలిన కుటుంబ సభ్యులు ఇంటిబయట ఉండడంతో పెనుము ప్పు తప్పింది. ఈ సంఘటనలో ఖురేషీ ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా బీరువాలు. మంచాలు, ఫర్నిచర్, ఫ్రిజ్, టీవీ మొత్తం విరిగిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కళింగరావు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు కారణమైన బిల్డర్ శ్రీనివాసరాజుపై కేసు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ సందర్శించి బాధితులను పరామర్శించారు. బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని, కూలిన ఇండ్లను మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...