ప్రీ పెయిడ్ బూత్...వీడ్కోలు వేదిక..


Wed,March 20, 2019 12:16 AM

-కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలు
-భద్రత కోసం త్వరలో మూడు బ్యాగేజ్ స్కానర్ల ఏర్పాటు
అంబర్‌పేట/కాచిగూడ, నమస్తే తెలంగాణ : కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల కోసం అధికారులు పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ స్టేషన్ నుంచి ప్రయాణం చేసేవారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రయాణికులు తాగేందుకు ప్లాట్‌ఫామ్‌పై స్వచ్ఛమైన మంచినీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అధికారులు రైలు దిగగానే ప్రయాణికులు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రీపెయిడ్ ఆటోలను అందుబాటులోకి తెచ్చారు. ఈ స్టేషన్ ఆవరణలో ఉన్న ప్రీపెయిడ్ ఆటో బూత్ రైలు దిగి బయటకు వచ్చిన ప్రయాణికులకు దూరంగా ఉంది. దీంతో ప్రయాణికులు అక్కడివరకు లగేజీతో నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను గమనించిన అధికారులు ఇప్పుడు ఉన్న ప్రీ పెయిడ్ ఆటో బూత్‌ను ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా మరింత దగ్గరకు తీసుకొస్తున్నారు. రైలు దిగి బయటకు వచ్చిన వెంటనే వారి ముందే ఆటోలు కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్యాసింజర్ అసెంబ్లింగ్ ఏరియా ఏర్పాటు...
కాచిగూడ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు వచ్చే వారి కోసం స్టేషన్ ఆవరణలో ఒక ప్యాసింజర్ అసెంబ్లింగ్ ఏరియాను ఏర్పాటు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికుడితో పాటు స్టేషన్ ప్లాట్‌ఫామ్ వరకు ఇతరులు వస్తే వారు టిక్కెట్ కొనాల్సి వస్తుంది. అది వారికి భారంగా మారుతోంది. ఎక్కువ మంది వస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టేషన్ ఎదురుగా ఉన్న పోస్టాఫీసు వద్ద సుమారు 200 మంది కోసం ప్యాసింజర్ అసెంబ్లింగ్ ఏరియాను ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయంలో లాగా ఆహ్వానం పలుకడం, వీడ్కోలు పలుకడం వంటివి ఇక్కడి నుంచే చెప్పాలి.
బ్యాగేజ్ స్కానర్స్ ఏర్పాటు...
రైల్వే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని చాలా రైల్వేస్టేషన్లలో ఉన్నట్టు ప్రస్తుతం ఈ కాచిగూడ రైల్వేస్టేషన్‌లో కూడా మూడు బ్యాగేజ్ స్కానర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్ గేటు వద్ద ఒకటి, బుకింగ్ ఆఫీస్, గోల్నాక వైపు రెండు స్కానర్లను పెడుతున్నారు. ఇప్పటికే స్కానర్స్ వచ్చాయి. స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికుల లగేజీని ఇవి స్కానింగ్ చేస్తాయి. ప్రమాదకర వస్తువులు ఏమైనా తీసుకొస్తున్నారా? అనే అనుమానం లేకుండా బ్యాగులను స్కానింగ్ చేసేందుకు వీటిని త్వరలోనే ఏర్పాటు చేస్తున్నారు.

ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలు
కాచిగూడ స్టేషన్‌లో రైల్వే ప్రయాణికుల కోసం ఇప్పుడున్న సౌకర్యాలు కాకుం డా మరిన్ని సౌకర్యాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నాం. ప్రీ పెయిడ్ ఆటో విధానం ప్రస్తుతం ఉన్నా అది అందుబాటులో లేదు. ఇప్పుడు ప్రయాణికులకు మరింత దగ్గరగా తీసుకొస్తున్నాం. ప్యాసింజర్ అసెంబ్లింగ్ ఏరియాను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే స్టేషన్‌లో మూడు బ్యాగేజ్ స్కానర్లను కూడా నెలకొల్పుతున్నాం. ప్రయాణికుల అవసరాలను బట్టి అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నాం.
- పి.ఎ.పుష్పరాజ్, స్టేషన్ డైరెక్టర్

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...