రూ. 40 కోట్లతో సుందరీకరణ..


Tue,February 19, 2019 12:15 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :మీరాలం ట్యాంక్ అభివృద్ధి, సుందరీకరణ పనులు వడివడిగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మీరాలం ట్యాంకు ఎడమవైపున ఆరు ఎకరాల స్థలంలో పార్కును అభివృద్ధిచేస్తున్నారు. పార్కులో లైటింగ్, దక్కన్ శైలి పెయింటింగ్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట వస్తువులు, ఫౌంటెన్, మినీ సైన్స్ పార్కు, దక్కన్ శైలి శిల్పాలు, చిత్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఈ నెల 15న ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ, నెలాఖరుకు పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను జీహెచ్‌ఎంసీ రూ. 40 కోట్ల అంచనాతో చేపట్టింది. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ దీనిపై ప్రత్యేక శ్రద్ధతీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గత జనవరిలో ఆయన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో పనులను వేగవంతం చేసిన అధికారులు జూపార్కు ప్రధాన గేటువద్ద పెద్ద ఎత్తున పేరుకుపోయిన నిర్మాణవ్యర్థాలు, చెత్త కుప్పలను తొలగించారు. అంతేకాకుండా పార్కు చుట్టూ మొక్కలు నాటడంతోపాటు ప్రత్యేకంగా ఓపెన్ జిమ్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నారు. అలాగే బల్దియా లేక్స్ విభాగం ఆధ్వర్యంలో మీరాలం ట్యాంక్ కట్ట పటిష్టపరిచే పనులతో పాటు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు, పాత్-వే, లైటింగ్, సుందరీకరణ పనులు నిర్వహిస్తున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...