హరితహారం పార్కులొస్తున్నాయ్..


Tue,February 19, 2019 12:14 AM

-స్థలాల పరిశీలన
- 25 ప్రాంతాల్లో ప్రతిపాదన
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొత్త పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలకు సంబంధించి ఆయా ఖాళీ జాగాలను సోమవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్‌తో పాటు అధికారుల బృందం పరిశీలించింది. ఒక్కో జోన్‌లో మూడు నుంచి నాలుగు చొప్పున మొత్తం గ్రేటర్‌లో 25 థీమ్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని హరితహారం పార్కులుగా వ్యవహరించనున్నారు. కొత్త పార్కుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ఇదివరకే మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలోని జీహెచ్‌ఎంసీ స్థాయీ సంఘం ఆమోదించింది. ఈ నేపథ్యంలో అధికారులు రోడ్ నం-11 నుంచి రోడ్ నెం-36 వరకు పర్యటించి ఖాళీ స్థలాలను పరిశీలించి వాటిల్లో పార్కుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ప్రతి జోన్‌లో కనీసం ఐదు పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన కమిషనర్, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. అంతేకాదు, ఈ పార్కులను హరితహారం పార్కులుగా వ్యవహరించనున్నట్లు ఆయన చెప్పారు. కనీసం ఐదు ఎకరాలు, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలోని ఖాళీ జాగాల్లో థీమ్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తాగు, మురుగునీటి పైపులైన్లను మార్చండి
రోడ్డు విస్తరణ పనులు చేపట్టే ప్రాంతాల్లో సివరేజీ, మంచినీటి సరఫరా పైపులైన్లను రోడ్డు పక్కకు తరలించాలని, ఇందుకు సంబంధించి అంచనాలు రూపొందించి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. సోమవారం బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో అధికారులతో కలిసి దానకిశోర్ పర్యటించారు. బంజారాహిల్స్ రోడ్ నం. 11ను మోడల్ రోడ్‌గా తీర్చిదిద్దేందుకు ఇరు శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. జలమండలి డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎం విజయరావు, జీఎం ప్రభు తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...