సీఎం విజన్‌తోనే ఫ్రెండ్లీ పోలీసింగ్


Mon,February 18, 2019 12:56 AM

-శాంతిభద్రతలతో రాష్ట్రాభివృద్ధి
-హోం మంత్రి మహమూద్ అలీ
-రాచకొండ కమిషనరేట్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన హోం మంత్రి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ముందుచూపుతోనే లాఠీని మైమరిపించిన ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. నేరేడ్‌మెట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మన పోలీసులను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిందన్నారు. బంగారు తెలంగాణ సాధనగా ముఖ్యమంత్రి ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు పోలీసు శాఖను పటిష్టం చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే విజుబుల్ పోలీసింగ్‌ను పెంచేందుకు అత్యాధునిక టెక్నాలజీతో పాటు 11,500 పెట్రోలింగ్ వాహనాలను అందించామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండటంతో ఆర్థికాభివృద్ధితో పాటు పెట్టుబడులను ఆకట్టుకోవడంలో 29 శాతం పురోగతిని సాధించామన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతో హైదరాబాద్‌లో పటిష్ట భద్రత పెరిగిందన్నారు. పోలీసు శాఖకు 750 కోట్ల రూపాయలను అందించడంతో పాటు 18వేల మంది పోలీసు నియామకాలను చేపడుతున్నారన్నారు. అంతకుముందు 28వేల చదరపు అడుగుల్లో 5.10 కోట్లతో నిర్మించిన రాచకొండ పోలీసు కమిషనరేట్ నూతన కార్యాలయం, 7 వేల చదరపు అడుగుల్లో 35 లక్షలతో పునర్నిర్మించిన క్వార్టర్స్‌ను హోంమంత్రి ప్రారంభించారు.

కార్యాలయంలో రాష్ట్రంలో మొదటి సారిగా ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ రికార్డు మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఆయన పరిశీలించారు. ఈ నూతన భవనాన్ని 18 నెలల్లో పూర్తిచేసిన పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎండీ మల్లారెడ్డిలను హోంమంత్రి అభినందించారు. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సమక్షంలో ఇన్ఫోసిస్ సంస్థ ఉప్పల్ నుంచి కేపాల్ వరకు 5 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల ప్రాజెక్ట్‌కు ఒప్పందం కుదుర్చుకున్నది. అదే విధంగా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ బీపీఎల్ (బిలో పావర్టీ లైన్) కాలనీలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 25 లక్షల నిధులను అందిస్తూ పోలీసు అధికారులతో ఒప్పందం కుదుర్చుకుంది. జీఎంఆర్ సంస్థ లక్ష రూపాయలను సీసీ కెమెరాల ఏర్పాటుకు అందించింది. హోంమంత్రి పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, మల్లారెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి, పాషా ఖాద్రి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, రాంచంద్రారావు, కలెక్టర్లు ఎంవీ రెడ్డి, అనితా రాంచంద్రన్, లోకేశ్‌కుమార్, ఇంటలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, డైరక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వైజయంతి, స్థానిక కార్పొరేటర్లు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ జాయింట్ సీపీ సుధీర్‌బాబు, డీసీపీలు, ఏసీపీలు,ఇన్‌స్పెక్టర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులకు పోచంపల్లి శాలువాతో పాటు మెమొంటోలను సీపీ మహేశ్‌భగవత్ అందించారు. కార్యక్రమంలో జమ్ము కాశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వీర సైనికులకు నివాళులర్పించారు.

అడ్వాన్స్‌డ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టం
రాష్ట్రంలోనే మొదటి సారిగా నేరేడ్‌మెట్‌లో ఏర్పాటు చేసిన రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో అడ్వాన్స్‌డ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇక పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన సిబ్బంది రికార్డులు, పరిపాలన అంశాలకు సంబంధించిన పత్రాలు సురక్షితంగా భద్రపర్చుకోవచ్చు. ఒక క్లిక్‌తో కమిషనరేట్ పరిధిలోని ఏ పోలీసు స్టేషన్ నుంచైనా అధికారులు వారి రికార్డులను పరిశీలించుకోవచ్చు. ప్రతి రికార్డుకు ఓ కోడ్ నంబరు ఆధారంగా వీటిని ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లోనూ భద్రపర్చనున్నారు. ఏ ఫైల్ ఎక్కడ ఉందో కూడా ఒక క్లిక్‌తో అధికారులు తెలుసుకోవచ్చు. టెక్ మార్క్ సంస్థ సహకారంతో 22 ర్యాక్‌లతో కూడిన ఆటోమెషన్ పద్ధతిలో ఫైళ్ల భద్రతను ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ ఏఆర్‌ఎంఎస్ విధానాన్ని హోంమంత్రి మహమూద్‌అలీ ఆదివారం ప్రారంభించి పరిశీలించారు. ఈ సిస్టమ్‌లో దాదాపు 3500 మంది సిబ్బంది, పరిపాలన అంశాలకు సంబంధించిన ఫైళ్లను భద్రపరచవచ్చు. ఈ సిస్టమ్ ద్వారా ఫైళ్లను హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కాపీలుగా మార్చుకుని అవసరానికి అనుగుణంగా మల్చుకోవచ్చు.ఈ టెక్నాలజీని రూపొందించిన దంపతులను హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ మహేశ్‌భగవత్‌లు సన్మానించారు.

5 లక్షల సీసీ కెమెరాలు : డీజీపీ
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు సహకరించడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఐదు లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయని, ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనంగా చెప్పుకోవచ్చని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాచకొండ పోలీసు కమిషనరేట్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల సహకారంతో మన పోలీసింగ్ ఇప్పుడు విదేశాల పోలీస్ వ్యవస్థలకు దీటుగా ఉందన్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న సమయంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం బంజారాహిల్స్‌లో పలు ప్రాంతాలను సందర్శించానన్నారు. అప్పుడు ఫుట్‌పాత్ వ్యాపారులకు అవగాహన కల్పించామని, సీసీ కెమెరాలతో భద్రత ఉంటుందని వివరించానన్నారు. ఇప్పుడు వారు ప్రశాంతంగా చట్టబద్ధంగా వారి వ్యాపారాలను చేసుకుంటున్నారని గుర్తు చేశారు. మన భద్రత, రక్షణ కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందరూ కలిసినప్పుడే సమాజాభివృద్ధి, భద్రత పటిష్టంగా ఉంటుందన్నారు. ప్రజలు పోలీసు యూనిఫాంలేని పోలీసులుగా, పోలీసులు సాధారణ ప్రజలుగా మెలిగినప్పుడే సహకారం, భాగస్వామ్యం బలపడుతాయన్నారు. మన పిల్లలను ఇతర దేశాలకు ఒంటరిగానే పంపుతాం ఎందుకంటే అక్కడ ఉండే పోలీసింగ్‌పై నమ్మకంతోనే, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలతో ఆ పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి సురక్షితమైన నగరానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

శాంతిభద్రతలకు పెద్దపీట
ప్రజలకు మెరుగైన పోలీసింగ్ కోసం ఏర్పాటు చేసిన రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని సీపీ మహేశ్‌భగవత్ అన్నారు. ప్రభుత్వం, డీజీపీ మహేందర్‌రెడ్డి సహకారం, ప్రజల భాగస్వామ్యంతో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పామని పేర్కొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...