లక్నో తరహాలో బస్‌స్టేషన్లు


Mon,February 18, 2019 12:55 AM

-నగరంలో ఆధునిక బస్‌స్టేషన్లు
-మెట్రోతోపాటు ఆర్టీసీ ఆపరేషన్స్
-పీపీపీ పద్ధతిలో నిర్వహణ
-సీబీఎస్, జేబీఎస్, ముషీరాబాద్‌లలో నిర్మాణం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో ఆధునిక బస్‌స్టేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఆధునిక హంగులతోపాటు సకల సౌకర్యాలతో నిర్మించబోతున్నారు. ఇందులో ఏసీ విశ్రాంతి గదులు, మెట్రోరైలుతోపాటు, టీఎస్‌ఆర్టీసీ రాకపోకలకు సంబంధించిన సమాచారంతో కూడిన డిస్‌ప్లే బోర్డులు, ఎయిర్‌పోర్టు తరహా సెక్యూరిటీ విధానం, సినిమా థియేటర్లు, బస్‌బేలు, పార్కింగ్ ప్లేస్‌లు ఇలా సకలసౌకర్యాలతో కొత్త బస్‌స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) విధానంలో వీటిని నిర్మిస్తున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారీగా లక్నోలో నిర్మించిన ఆలంబాగ్ స్టేషన్ నిర్మాణాన్ని పోలి ఉండే విధంగా ఇక్కడ నిర్మించనున్నారు. విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న భాగ్యనగరంలో అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక హంగులతో బస్టాండ్లను తీర్చిదిద్దడానికి టీఎస్‌ఆర్టీసీ కసరత్తు చేసింది.

నిర్మాణానికి స్థలాలు ఎంపిక
ఇప్పటికే ఇదే తరహా బస్టాండు నిర్మాణం కోసం యాదాద్రిలో ప్రభుత్వం స్థలాన్ని కూడా ఎంపికచేసింది. ఇదే పద్ధతిలో కూలిపోయిన చారిత్రాత్మక గౌలిగూడ హ్యంగర్‌స్థలంతోపాటు, జేబీఎస్‌లో ఉన్న ఖాళీ స్థలంలో, ముషీరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ స్థలంలో ఇటువంటి బస్టాండ్లు నిర్మించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి అందచేసిన ఉన్నతస్థాయి కమిటీ రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు.
ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
నగరంలో నిర్మించే నూతన బస్‌స్టేషన్లకు వెళితే ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు నగర రాకపోకలతోపాటు జిల్లా ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. ఆర్టీసీ బస్సు దిగి మెట్రోలో ప్రయాణించేలా, మెట్రోరైలు దిగి ఆర్టీసీలో ప్రయాణించేలా ఈ స్టేషన్లలో ఏర్పాట్లు ఉంటాయి. మెట్రోరైలు ప్లాట్‌ఫాంలు బస్‌స్టేషన్లకు కనెక్టయ్యే విధంగా నిర్మాణం ఉంటుంది. సాధ్యమైనన్నీ ఎక్కువగా బస్‌బేలతోపాటు ఎక్కువ తెరలుగల మల్టీఫ్లెక్స్‌లు, వరల్డ్‌క్లాస్ హోటల్స్, మెగామాల్స్, ఫుడ్‌కోర్టులు, గేమింగ్‌జోన్ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎస్కిలేటర్లు, లిప్టులు ఇలా ప్రతీ స్టేషన్‌ను రోల్‌మోడల్‌గా నిర్మించనున్నారు. లక్నో స్టేషన్‌కు మించి దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా లేనివిధంగా వీటిని నిర్మించాలనే లక్ష్యంతో టీఎస్‌ఆర్టీసీ ఉంది.
రవాణేతర ఆదాయంపై ఆర్టీసీ దృష్టి
ఇప్పటికే నిర్వహణ భారంతో కుదేలైన టీఎస్‌ఆర్టీసీ రవాణేతర ఆదాయంపై దృష్టిసారించింది. ఖాళీ స్థలాల్లో పెట్రోల్‌బంకులు ఏర్పాటుచేసే యోచనలో ఉన్న ఆర్టీసీ, మరిన్ని ప్రణాళికలతో నష్టాలను పూడ్చుకుని లాభాలను ఆర్జించాలనే యోచనలో ఉంది. ఒక్కో స్టేషన్‌కు రూ.250 కోట్ల వరకు నిర్మాణ వ్యయం అవుతున్నందున పీపీపీ విధానాన్ని ఆర్టీసీ హైలెవెల్ కమిటీ సూచించింది.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...