నేతలకు పొత్తు భయాలు


Thu,November 15, 2018 12:38 AM

-మీమాంసలో కాంగ్రెస్ ప్రముఖులు
-రెండో జాబితాలోనూ దక్కని చోటు
-ఆగని నిరసనలు
సిటీబ్యూరో: కాంగ్రెస్ ప్రముఖులకు పొత్తుల భయం పట్టుకున్నది. పార్టీ బుధవారం విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో కూడా ప్రముఖులకు మొండిచెయ్యి చూపింది. దీంతో వారికి టికెట్లు దక్కుతాయా, లేక పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు కేటాయించిన స్థానాల్లో నిరసనలు ఆగకపోగా, టికెట్లు ఆశించి భంగపడ్డ వారు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గత సోమవారం రాత్రి విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో గ్రేటర్ పరిధిలోని ఎనిమిది స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించగా, బుధవారం వెల్లడించిన రెండో జాబితాలో మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

దీంతో గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాలకుగాను పది స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించినైట్లెంది. ఉప్పల్, శేరిలింగంపల్లి, మలక్‌పేట స్థానాలకు టీడీపీకి, అంబర్‌పేట, మల్కాజిగిరి స్థానాలకు జనసమితికి కేటాయించారు. ఈ పదిహేను స్థానాలుపోగా, మరో తొమ్మిది స్థానాలకు ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో టీడీపీ, జనసమితి పార్టీలకు ఎన్ని కేటాయిస్తారో, కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో అనేది స్పష్టత రావడం లేదు. ఇందులో ముఖ్యంగా ఎల్బీనగర్, సనత్‌నగర్, సికింద్రాబాద్ తదితర స్థానాల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నా.. పార్టీ ఈ మూడు స్థానాలపై రెండో జాబితాలో కూడా స్పష్టత ఇవ్వకపోవడం విశేషం. ఎల్బీనగర్ నుంచి సుధీర్‌రెడ్డి ఇప్పటికే ప్రచారం చేసుకుంటుండగా, సనత్‌నగర్ సీటు కోసం మర్రి శశిధర్‌రెడ్డి, సికింద్రాబాద్ సీటు కోసం నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండో జాబితాలో కూడా ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఈ స్థానాలను కూడా పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నిరసన జ్వాలాలు..
మల్కాజ్‌గిరి, శేరిలింగంపల్లి, ఉప్పల్ స్థానాలను ఇతర పార్టీలకు కేటాయించవద్దని ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ధర్నాలు నిర్వహించగా, అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో సైతం నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కంటోన్మెంట్, శేరిలింగంపల్లి స్థానాల్లో అధికారిక అభ్యర్థులకు సొంతపార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు గాంధీ భవన్ వద్ద నిరసనలకు దిగుతుండడంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో నేతలు క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రచిస్తున్నారు. ఇక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మూడు రోజులు గడిచినా ఇంతవరకూ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించక కాంగ్రెస్ తర్జనభర్జన పడుతుండడంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. నామినేషన్లకు ఐదురోజులే గడువున్నప్పటికీ పార్టీలో ఉత్సాహం లేకపోవడంతో గత ఎన్నికల మాదిరి ఫలితాలే పునరావృతమవుతాయనే వాదనలు పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన స్థానాలు ఇవే....
ముషీరాబాద్, కంటోన్మెంట్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, గోషామహల్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, మహేశ్వరం తదితర ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా రెండో జాబితాలో ఖైరతాబాద్ స్థానానికి దాసోజు శ్రవణ్, జూబ్లీహిల్స్ స్థానానికి విష్ణువర్థన్‌రెడ్డి పేర్లను పార్టీ ప్రకటించింది. ముషీరాబాద్ స్థానానికి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం తమ నానినేషన్ పత్రాలు దాఖలుచేశారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...