నియమావళి అమలుకు120 బృందాలు


Wed,November 14, 2018 12:18 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ జిల్లాలోఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుతో పాటు ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు వివిధ రకాల 120 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం. దానకిశోర్ తెలిపారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన వ్యయ పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి మూడు వీడియో సర్వెలెన్స్ టీమ్‌లు, మూడు ైఫ్లెయింగ్ స్కాడ్‌లు, ఒక్కో అకౌంటింగ్ టీమ్, వీడియో వ్యూయింగ్ టీమ్‌ను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఈ బృందాలను నియమించినట్లు, ముందుగానే వీరికి తగిన శిక్షణనిచ్చినట్లు చెప్పారు. దీంతోపాటు సీ-విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి గణాంకాల్లో సుశిక్షితులైన గ్రూపు-బీ స్థాయి అధికారిని సహాయ వ్యయ పరిశీలకుడిగా నియమించామన్నారు. అలాగే వివిధ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలన్నింటినీ వీడియో సర్వెలెన్స్ టీమ్‌లు పూర్తిగా వీడియో గ్రఫీ చేస్తాయని, ఆయా వీడియో సీడీలను వీడియో వ్యూయింగ్ బృందాలు పరిశీలించి తగిన చర్యలు ప్రతిపాదిస్తాయని ఎన్నికల అధికారి తెలిపారు.

ఎన్నికల సిబ్బందికి నేడు శిక్షణ..
జిల్లాలోని 15 నియోజకవర్గాల కోసం నియమించిన ఎన్నికల సిబ్బందికి బుధవారం తొలి విడుత శిక్షణను ఏర్పాటు చేయనున్నారు. సుమారు 10 వేల మందికి ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆడిటోరియం, వనిత మహావిద్యాలయం ఆడిటోరియం, కోఠి ఉమెన్స్ కాలేజ్, ఆర్టీసీ కల్యాణమండపం, హరిహర కళాభవన్, వాసవీ సేవా కేంద్రం,ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీ తదితరచోట్ల శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

24 గంటలూ సీ విజిల్ ఫిర్యాదులు

సీ-విజిల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించేందుకు 24 గంటలపాటు మూడు షిఫ్టులుగా ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు దానకిశోర్ తెలిపారు. ఇప్పటివరకు సీ-విజిల్ ద్వారా 79 ఫిర్యాదులు అందగా, వీటిలో 44ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ఇప్పటివరకు రూ. 17.44 కోట్ల నగదు, రూ. 11.50 లక్షల విలువైన వెండి, రూ. 72.51 లక్షల విలువైన వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన 34 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ప్రవర్తనా నియమావళి అమలుపై కేంద్ర పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యయ పరిశీలకులతోపాటు నగర పోలీసు అదనపు కమిషనర్ డి.ఎస్. చౌహాన్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ కెనడీ, విజిలెన్స్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...