కుండపోత..వెంటనే చేయూత


Wed,September 12, 2018 01:04 AM

-గంటన్నర పాటు భారీ వర్షం
-చెరువుల్లా మారిన రోడ్లు
-వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది
-ఎక్కడా ఇబ్బందులు రాకుండా చర్యలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో గంటన్నర పాటు వాన దంచికొట్టింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో కుండపోతగా కురిసిన వర్షంతో రహదారులు, లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. జీహెచ్‌ఎంసీ, విద్యుత్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా నాలాలను సరిచేశారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగించారు.

వాన దంచికొట్టింది.. ఆకాశానికి చిల్లు పడిందా..! అన్నట్లుగా మంగళవారం సాయంత్రం సమయంలో సుమారు గంటకుపైగా ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. రహదారులు చెరువులను తలపించాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి.. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ప్రధాన రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతోపాటు వాహనాల్లోకి చేరడంతో వాహనాలు మొరాయించాయి. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ప్రత్యక్ష నరకాన్ని చవి చూశారు. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. పలు ఇండ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉన్నప్పటికీ, సాయంత్రం ఒక్కసారిగా వరుణుడు ఉగ్రరూపం చూపాడు. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, లక్డీకపూల్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బంజారాహిల్స్, ఎస్సార్ నగర్, సుల్తాన్ బజార్, సనత్‌నగర్, బేగంపేట, ఎర్రగడ్డ, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చిక్కడపల్లి, జవహర్‌నగర్, అంబర్‌పేట, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, పాతనగరం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ప్రధానంగా సచివాలయం, అసెంబ్లీల ముందు మోకాల్లోతు వర్షపు నీరు నిలిచిపోవడంలో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కాగా, జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమై ప్రమాదాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేయడంతోపాటు ట్రాఫిక్ సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు వర్షంలో రంగంలోకి దిగారు. వాటర్ లాంగింగ్ పాయింట్లు, ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన సమాచారాన్ని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సోషల్‌మీడియా ద్వారా సమాచారం అందించారు.
HYD
సహాయక చర్యల్లో జీహెచ్‌ఎంసీ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు తమ అత్యవసర సహాయక బృందాలు, విపత్తుల నిర్వహణ బృందాలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో బృందాలను మోహరించి సహాయక చర్యలు చేపట్టారు. వర్షం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. వాతావరణ సమాచారం అందుకున్న వెంటనే ఆయన జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో మ్యాన్‌హోల్స్‌పై మూతలు తీయకూడదని ప్రజలకు సూచించారు. ప్రధాన రహదారులపై మ్యాన్‌హోళ్ల మూతలను తొలిగించకుండా మేనేజర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. మ్యాన్‌హోళ్లకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే 155313నంబర్‌కు తెలుపాలని కోరారు. రోడ్లు జలమయం అయినప్పుడు సాధ్యమైనంతవరకు ప్రయాణం చేయవద్దని, లేనిపక్షంలో అత్యంత అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతేకాదు, వర్షాల వల్ల సమస్యలు ఎదురైతే డయల్-100, కాల్ సెంటర్- 040-21111111కు ఫోన్ చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డుకు చెందిన క్షేత్రస్థాయి అధికారులు, ఇంజినీర్లు పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని మ్యాన్‌హోళ్లను తనిఖీ చేసి మూతలు సరిగా ఉన్నాయో, లేదో పరిశీలించాలని వాటర్‌బోర్డు అధికారులను కమిషనర్ ఆదేశించారు.

ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లు
వర్షం వల్ల జరిగే సమస్యలకు : 100
ఇబ్బందులు ఎదురైతే జీహెచ్‌ఎంసీ
కాల్ సెంటర్ : 21 11 11 11
మ్యాన్‌హోల్ ఫిర్యాదులకు
ఫోన్ చేయాల్సిన నంబర్ : 155313

159
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...