వెంటిలేటర్ క్లూనే.. పట్టిచ్చింది


Wed,September 12, 2018 12:56 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రపంచంలోని పలు దేశాల్లో మ్యూజియాల్లో అక్కడక్కడ దొంగతనాలు జరిగాయి... అయితే భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోను ఆయా కేసుల విచారణ రెండేండ్లలో కొన్ని ప్రాంతాల్లో పూర్తిచేసి, కొంత సొత్తును రికవరీ చేయ డం.. మరికొన్ని కేసుల్లో ఎలాంటి ఆధారాలు దొరకక పక్కన పడేసిన ఘటనలు ఉన్నాయి. దాదాపు 1985 తరువాత యూరప్, స్వీడన్, నార్వే, అమెరికా లాంటి దేశాల్లోని ప్రధాన మ్యూజియాల్లో జరిగిన దొంగతనాల్లో దర్యాప్తు అంతంత మాత్రమే ఉంది. అందుకు భిన్నంగా ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్ పోలీసులు తమ ప్రతిష్టను పెంచుకున్నారు. కోట్లాది రూపాయల విలువైన వారసత్వ సంపదను దొంగల చేతి నుంచి రికవరీ చేసి రికార్డు సాధించారు. తెలంగాణ రాష్ట్రంతో భారతదేశానికి చెందిన వారసత్వ సంపదను దొంగలు కొల్లగొట్టుకుపోయారనే అపవాదు రాష్ట్ర పోలీసుల మీద వస్తుందనే భావ న హైదరాబాద్‌లోని ప్రతి పోలీస్‌ను వెంటాడింది. ఎట్టి పరిస్థితిల్లోను పోయిన సొత్తును రికవరీ చేసి, దొంగలను పట్టుకోవాలనే పట్టుదల హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని ప్రతి పోలీస్ అధికారిలో కన్పించింది. దీంతోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. సౌత్‌జోన్ పోలీసులతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీస్‌లతో 20 బృందాలను రంగంలోకి దింపారు. హాలీవుడ్ సినిమా తరహాలో పక్కా ఫ్లాన్ తో నిజాం మ్యూజియంలో దొంగతనం జరిగినట్లు పోలీసులు సంఘటన జరిగిన రోజే అంచనాకు వచ్చారు. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్ దొంగతనం జరిగినప్పటి నుంచి ఆయా బృందాలకు దిశా నిర్ధేశం చేశారు. ఎట్టకేలకు నిజాం మ్యూజియం కేసును ఛేదించడంలో చైతన్యకుమార్ అతని టాస్క్‌ఫోర్స్ బృం దం తమ ప్రత్యేకతను చాటుకున్నది.

600 టవర్ల విశ్లేషణ
దొంగలెవరో తెలియదు.. స్థానికులా..? అంతర్రాష్ట్ర , అంతర్జాతీయ దొంగలా? ఎవరు మ్యూజియంలో దొంగతనం చేసి ఉంటారని దానిపై పోలీసుల్లో ఒకొక్కరిది ఒక్కో అభిప్రాయం. జరిగిన ఘటన వద్ద సీసీఎస్ నేతృత్వంలోని క్లూస్‌టీం పోలీసులకు కొన్ని ఆధారాలను అం దించింది. బంగారం టిఫిన్ బాక్స్ ఉంచిన ర్యాక్ తా ళాన్ని తీసిన విధానంతో ఇది పక్కా పాత నేరస్తులే అయి ఉంటారని, దొంగతనాల్లో అనుభవం ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని సూచించారు. దీంతో పా టు వెంటిలేటర్‌ను మనిషి పట్టేంత తొలగించే నైపుణ్యం.. అది కేవలం నిర్మాణ రంగంలో పనిచేసే మేస్త్రీలకే అనుభవం ఉంటుందనే అభిప్రాయాన్ని పోలీసులు తీసుకున్నారు. దొంగతనం చేసిన వ్యక్తులు బక్కగా ఉంటారనే ఒక అభిప్రాయానికి వచ్చారు. సీసీ కెమెరాల్లో, ఫోన్లో మాట్లాడిన ఆనవాళ్లను పోలీసులు తెలుసుకున్నారు. నిందితులు వాడిన సెల్‌నెంబర్‌ను తెలుసుకోవడం కోసం ఒక ప్రత్యేక బృందం పాతబస్తీతో పాటు నగరంలోని పలు అనుమానిత ప్రాంతాల్లో సెల్‌టవర్ల డంప్‌ను సేకరించిం ది. ఇలా 600 సెల్‌టవర్ల నుంచి ఆ రోజు వెళ్లిన ఫోన్ కాల్స్‌తో అనుమానిత నంబర్ కోసం కొన్ని లక్షల ఫోన్ నంబర్లను పోలీసులు విశ్లేషించారు. ఇదే విధంగా సీసీ కెమెరాలను విశ్లేషించారు. ఒక్కో పని కోసం ఒక్కో బృం దం పనిచేస్తూ సీసీ కెమెరాలను విశ్లేషిస్తూ వెళ్లారు.

వచ్చారు.. కొల్లగొట్టారు
పట్టుబడ్డ ఇద్దరు దొంగలు గౌస్‌పాష, మహ్మద్ ముబీన్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరికి నేర చరిత్ర ఉంది. ముబీన్ మ్యూజియంలోకి వెళ్లి పరిశీలించి, అక్కడ భద్రత లోటుపాట్లను చూసి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నా రు. ముందుగా ఎంతో కొంత దొంగతనం చేస్తే సరిపోతుందిలే అనుకున్నారు. రెక్కీ నిర్వహించడం నుంచి దొంగతనం జరిగే వరకు వారి ఆలోచనలో మార్పు వచ్చింది. దీంతో రెక్కీ నిర్వహించిన అనంతరం విలువైన పాత్రలను దొంగిలించి సునాయసంగా బయటపడ్డారు. గౌస్‌పాష ఇండ్లల్లో దొంగతనం చేయడంలో దిట్ట. హైదరాబాద్ పోలీసులు టెక్నాలజీ వాడడంలో ముందున్నారనే విషయాన్ని గుర్తించిన దొంగలు, పోలీసులకు దొరకకుండా ఆ టెక్నాలజీతో నే పోలీసులను తికమక పెట్టాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా దొంగతనం చేసిన తరువాత వెంటనే నగరానికి దూరంగా పరారవ్వకుండా.. పాతబస్తీ ప్రాంతంలోనే గల్లీలు తిరుగుతూ రెండు గంటల పాటు సమయం గడిపారు. అనంతరం ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్లను ఉపయోగించి రాజేంద్రనగర్, ముత్తంగి, జహీరాబాద్‌కు రాకపోకలు సాగించారు. రాజేంద్రనగర్ ప్రాం తంలో వృత్తిరీత్యా గౌస్ సెంట్రింగ్ పని.. ముబీన్ వెల్డింగ్ పనిచేస్తుంటాడు.

పాతనేరస్తులు, మేస్త్రీలపై ప్రత్యేక దృష్టి
వెంటిలేటర్‌ను తొలిగించిన విధానంతో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. దొంగతనాలు చేస్తూ గతంలో అరెస్టయిన పాత నేరస్తుల చిట్టాపై ఆరా తీశారు. అందు లో మేస్త్రి పనిచేసి అరెస్టయిన 12 మందికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. అలాగే సీసీ కెమెరాల్లో లభ్యమైన ఆధారాలను అనుమానిత ప్రాంతాల్లో చూపిస్తూ వెళ్లారు. చోరీ సొత్తు కోట్ల రూపాయల విలువైంది.. అది ఎవరి చేతిలో పడ్డా కష్టమేననే ఆవేదన.. బ్లాక్‌మార్కెట్‌కు తరలివెళ్లడం.. తద్వారా దేశ సరిహద్దులను దాటిపోతే చేసేది ఏమి ఉండదు.. ఆ తరువాత దొంగలు దొరికినా చారిత్మక సంపద పోయినట్లవుతుందని పోలీసులు భావించారు. దీంతో ఒక పక్క టెక్నాలజీతో వచ్చిన ఆధారాలను, మానవ మేథస్సుకు అనుసంధానిస్తూ పాత పద్ధతిలో దర్యాప్తును మొదలు పెట్టా రు. దీంతో ఉహించనట్లే పోలీసులకు పక్కా ఆధారాలు లభించాయి. వెంటిలేటర్‌ను కట్ చేయడం.. అందులో నుంచి వెళ్లిన వ్యక్తి బక్కగా ఉంటాడని పోలీసులు అనుమానించడం కలిసి వచ్చింది.. పోలీసులకు లభ్యమైన సీసీ ఫుటేజీలను పాత నేరస్తులకు చూపిస్తూ వెళ్లారు. దీంతో రాజేంద్రనగర్ ప్రాంతంలో దొంగలకు సంబంధించిన కొంత సమాచారం లభ్యమయ్యింది. పాతనేరస్తులు, మేస్త్రీ పనిచేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులకు సెం ట్రింగ్ పనిచేసే గౌస్ ఇటీవల సరిగ్గా కన్పించడం లేదనే మాట ఒక పాత నేరస్తుడి నుంచి విన్పించింది. దీంతో అతనిపై ఆరా తీశారు. అలాగే సీసీ కెమెరాల్లో లభ్యమైన ఫుటేజీలను విశ్లేషించడంతో పాటు అప్పటికే అన్ని బృందాలు సేకరించిన సమాచారాన్ని అంతా ఒక వద్ద చేర్చి.. దొంగపై నిర్ధారణకు వచ్చారు. మహ్మద్ గౌస్ పాషా కోసం వెతకడం ప్రారంభిస్తున్న క్రమంలోనే ముబీన్‌కు సంబంధించిన సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు తమ దర్యాప్తులో వేగాన్ని పెంచి, రాజేంద్రనగర్‌లోని హిమాయత్‌సాగర్ ప్రాంతంలో నిందితులను పట్టుకున్నారు. చిన్న చిన్న గుడిసెల్లాంటి ఇండ్లల్లో వీరు ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అమ్మకంలో తడబాటు..
ఎంతో కొంత దొంగతనం చేద్దామనుకున్నారు. దొంగతనం చేసింది కేవలం టిఫిన్ బాక్స్ 1950 గ్రాములు, బంగారు కప్, సాసర్‌లు 172 గ్రాములు, చెంచ 14 గ్రాముల బరువు ఉన్నాయి. వాటిని ఎక్కడ విక్రయించాలనే విషయంలో తడబడ్డారు. ముబీన్ దుబాయ్ జైల్లో ఉన్న సమయంలో కొందరు నేరస్తులతో పరిచయం అయ్యింది, ముంబయిలో విక్రయించాలని, అందుకు తమ వెంట బంగారం చెంచను శాంపూల్‌గా తీసుకెళ్లారు. అయితే వాటి విలువ ఎంత అనే విషయంలో స్పష్టత రాకపోవడం, కొనేవారు దొరకకపోవడంతో అమ్మకంలో తడబడ్డారు. దీంతో ముంబాయి నుంచి తిరిగి వచ్చారు. అయితే దొంగిలించిన బంగారం టిఫిన్ బాక్స్‌లో మాత్రం మూడు రోజుల పాటు భోజనాలు చేశారు. దొంగతనం చేసినా... బంగారం టిఫిన్ బాక్సులో తినడం గమనార్హం.

200
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...