కారు..జోరు


Sun,September 9, 2018 12:50 AM

-రెండేండ్లలో పెరిగిన ఓట్లు.. 25 శాతం
-2014 నుంచి 2016 మధ్య వచ్చిన ఓట్లలో పెద్ద ఎత్తున పెరుగుదల
-గ్రేటర్ ప్రగతితో టీఆర్‌ఎస్‌కే ప్రజల మద్దతు
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రానికి దిక్సూచి జీహెచ్‌ఎంసీ ఎన్నికలే. గ్రేటర్ హైదరాబాద్‌లో జనం ఎవరికి పట్టం కట్టారో తెలుసు. 2009, 2016 బల్దియా ఎన్నికల మధ్య తేడాను లెక్కిస్తే నగరవాసుల అభిప్రాయమేదో, ఆకాంక్షలేమిటో స్పష్టమవుతుంది. మొదటి ఎన్నికల్లో పోటీ చేయని టీఆర్‌ఎస్‌ను గత బల్దియా ఎన్నికల్లో ఏకపక్షంగా తీర్పునిచ్చి కిరీటాన్ని అందించారు. సెంటిమెంటు మాత్రమే కాదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకే మా ఓటంటూ 99 స్థానాల్లో అసాధారణ మెజార్టీని కట్టబెట్టారు. ఎంఐఎం 44 చోట్ల గెలిచింది. మిగిలిన పార్టీలకు సింగిల్ డిజిట్‌ను మించకుండా హైదరాబాద్ ఓటర్లు తీర్పునిచ్చారు. జాతీయ, రాష్ట్ర స్థాయి అనేక సంస్థలు, కొన్ని మీడియా సంస్థల సర్వేల అంచనాకు అందకుండా టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించారు. మెజార్టీ కూడా వేలల్లో ఉండడం విశేషం. ఆఖరికి ఎంఐఎంకు పాతబస్తీ కట్టని కోటగా అనుకుంటారు. కొన్నింట ఎంఐఎంతోనూ తలపడింది. స్వల్ప మెజార్టీతో టీఆర్‌ఎస్ ఓడిన డివిజన్లు ఉన్నాయని ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎల్బీనగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, సనత్‌నగర్, అంబర్‌పేట, సికింద్రాబాద్ తదితర నియోజకవర్గాల్లో మిగతా పార్టీలను తూడ్చేసింది. ఆఖరికి బీజేపీ రాష్ట్ర నాయకుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అంబర్‌పేటను కూడా క్లీన్ స్వీప్ చేసింది. దేశంలోనే ముందెన్నడూ క్లీన్ స్వీప్ వినని మెట్రో నగరాలకు ఆ పదాన్ని పరిచయం చేసింది. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చింది. 2014 అసెంబ్లీ, 2016 బల్దియా ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు జట్టు కట్టినా ఆశించిన ఫలితాలు రాలేదు. గ్రేటర్ ఎన్నికలొచ్చే సరికి చతికిలపడ్డాయి. అదే పరిస్థితి కాంగ్రెస్‌కూ వచ్చింది. 2009 ఎన్నికలతో పోలిస్తే కనీస పోటీనివ్వలేదని లెక్కలు చెబుతున్నాయి. మహానగరంలోనే మొదటిసారి పూర్తి స్థాయిలో పోటీ చేసిన టీఆర్‌ఎస్ సత్తాను చాటింది. తిరుగులేని శక్తిగా ఎదిగింది. రెండేండ్లల్లోనే 25.49 శాతం ఓట్లను పెంచుకోవడం విశేషం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ అభివృద్ధి నిరంతరం కావాలని, అమలు చేయగల పార్టీకే మద్దతు తెలపనున్నారని స్పష్టమవుతుంది.

తగ్గుతున్న కాంగ్రెస్ ప్రాబల్యం..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీల కంటే ఘోర పరాజయాన్ని చవిచూసింది. గతమెంతో ఘనకీర్తి లెక్కన పరిస్థితి మారింది. ఇప్పుడైతే మరింత అధోగతి పాలైంది. 2004 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గుతోందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 24 స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పొందలేదు. రిక్తహస్తమే మిగిలింది. గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే 2004 ఎన్నికల్లో 13 స్థానాల్లో నాల్గింట మంచి ఓట్ల శాతాన్ని పొందింది. 2009 ఎన్నికల్లో 14 స్థానాలను ఖాతాలో వేసుకున్నది.

కానీ 2014 ఎన్నికల్లో మాత్రం సున్నాకు పడిపోయింది. 2004 ఎన్నికల్లో 25.88 శాతం, 2009 ఎన్నికల్లో 27.88 శాతం, 2014 ఎన్నికల్లో కేవలం 15.25 శాతం ఓట్లను మాత్రమే పొందింది. అదే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 24 నియోజకవర్గాల్లోని ఆరింటిని క్లీన్ స్వీప్ చేసింది. 10 నియోజకవర్గాల్లో 90 శాతం సీట్లను గెలిచింది. రెండేండ్లల్లో ఎంతో మార్పును కనబర్చింది. రికార్డులను బద్దలు కొట్టింది. 150 డివిజన్లల్లో 99 సీట్లను సాధించిన టీఆర్‌ఎస్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనే చరిత్రను సృష్టించింది. సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ముచ్చెమటలను పట్టించింది. మినీ ఇండియాగా భావించే గ్రేటర్ హైదరాబాద్‌లోనూ తిరుగులేని మహాశక్తిమంతంగా మారింది.

టీఆర్‌ఎస్ అభివృద్ధి నమూనాపై..
ఇమామ్, మౌజమ్‌లకు వేతనాల పెంపు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రంజాన్, క్రిస్మస్ వేడుకలు, షాదీఖానాల నిర్మాణం, కల్లు దుకాణాల పునరుద్ధరణ. ఇలాంటి వందలాది సంక్షేమ పథకాలపై నగరవాసులు ఆసక్తిగా ఉన్నారు. మెట్రో సిటీలో ట్రాఫిక్ సిగ్నల్ లేని వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రూ.3 వేల కోట్లతో చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు కండ్ల ముందు కనబడుతున్నది. ఇప్పటికే ఐటీ కారిడార్ మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్ ప్రాంతంలో ఫలితాలు జనం చూస్తున్నారు. అనేక ఏరియాల్లో ైఫ్లె ఓవర్లు, మల్టీ ైఫ్లె ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మాణంలో ఉన్నాయి. నగర సుందరీకరణ, రోడ్ల మరమ్మతులు, నాలాల పూడికతీత, ముంపు నివారణ.. ఇలా ఒకటీ రెండు కాదు. వందలాది ప్రాజెక్టులు నడుస్తున్నాయి.

ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ముందెప్పుడూ అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులేవీ అమలు చేసిన దాఖలాలు లేవు. టీఆర్‌ఎస్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తూ చేపట్టే అభివృద్ధి నమూనా నగరవాసులను ఆకట్టుకుంటున్నది. నామమాత్రపు పనుల కంటే శాశ్వత మార్గాల రూపకల్పనను స్వీకరిస్తున్నారు. అందులో భాగంగా చేపట్టే అనేక ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగింది. కొన్నేమో పూర్తి కాగా, మరికొన్ని పురోగమనంలో ఉన్నాయి. ఇంకొన్ని డీపీఆర్ దశలో ఉన్నాయి. అందుకే ఈ అభివృద్ధి పథం కొనసాగాలని బల్దియా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...