జబ్బులు రాకుండా .. సుస్తీ చేయకుండా..


Sun,September 9, 2018 12:41 AM

-60 వేల మందికి పైగా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు
-రాష్ట్రీయ బాల స్వాస్థ ద్వారా నిర్వహణ
-4,840 మందికి అస్వస్థత ఉన్నట్లు వెల్లడి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు సుస్తి చేసింది. పసి వయస్సులోనే పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎదిగే వయస్సులో.. తెలియని రోగాలతో సతమతమవుతున్నారు. జిల్లాలో 61 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే 4,840 మంది చిన్నారులు పలు రకాల వ్యాధులకు గురైనట్లుగా తేలింది. తక్షణమే రంగంలోకి దిగిన అధికారులు ఈ చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చొరవ చూపిస్తున్నారు. పసిప్రాయంలోనే రోగాల బారినపడ్డ వారికి అధికారులు అండదండలందిస్తున్నారు. వివరాల్లోకి వెలితే.. రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) కింద హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. మొత్తం 21 వైద్య బృందాలను ఏర్పాటు చేయగా, 30 వ్యాధులను గుర్తించేందుకు వీలుగా నిపుణులైన డాక్టర్లు, ఫార్మసిస్ట్‌లు, క్లస్టర్ల వారీగా విడిపోయి విద్యాలయాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. రిఫ్రాక్టిక్ ఎర్రర్స్ ఉన్నందున 1180 మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు.

తక్షణమే చికిత్స
పుట్టకతో వచ్చే లోపాలు, పోషకాహార లోపాలు, శారీరక లోపాలు, మానసిక లోపాలను గుర్తించేందుకు ఈ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. భవిష్యత్తులో ఎదురయ్యే ధీర్ఘకాలిక వ్యాధులను ముందే పసిగట్టడం, పుట్టుకతోనే అవయవలోపాలున్న వారికి గుర్తించడం. గుండెలో లోపాలు, ఐరన్‌లోపం, రక్తహీనత, కంటిచూపు మందగించడం, చర్మ వ్యాధులు, చెవి, అంటు వ్యాధులు వంటి వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించారు. ఇలా గుర్తించిన 4,840 మంది చిన్నారుల్లో 4,173 మంది చిన్నారులకు తక్షణమే చికిత్సను అందజేశారు. ఇక కంటి సంబంధ సమస్యలతో బాధపడుతున్న 1,180 మంది చిన్నారులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నిలోఫర్ దవాఖానలోని డిటెక్షన్ ఆఫ్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్ సెంటర్(డీఈఐసీ)కు పంపించి తదుపరి చికిత్సలను అందించారు. గతేడాది సైతం 5,546 మంది చిన్నారుల్లో లోపాలు గుర్తించగా, వీరిలో 4,831 మందికి చికిత్సను అందించి, వారికి మరలా వైద్య పరీక్షలను నిర్వహించారు.

బాలికల్లో రక్తహీనత..
ఆర్‌బీఎస్‌కే ద్వారా రక్తహీనత గల బాలికలను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 210 విద్యాసంస్థల్లో 32 వేల మంది బాలికలుండగా,16,238 మందికి హిమోగ్లోబిన్ టెస్ట్‌లు నిర్వహించారు. వీరిలో 154 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లుగా తేలింది. మొత్తం బాలికల్లో 21 శాతం బాలికలు 8 కంటే తక్కువ హిమోగ్లోబిన్ శాతం ఉన్నట్లుగా, 70 శాతం బాలికల్లో హిమోగ్లోబిన్ శాతం సాధారణంగా ఉన్నట్లుగా తేలింది. రక్తహీనత సమస్యను అధిగమించేందుకు రూ. 8 లక్షలలో పోలిక్ యాసిడ్, విటమిన్ సి మాత్రలను ఇప్పిస్తున్నారు. మూడు మాసాల తర్వాత వీరికి మరలా వైద్యపరీక్షలు నిర్వహించి, తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...