ధాన్యం కొనుగోళ్లలో అంతులేని అక్రమాలు


Thu,December 5, 2019 01:18 AM

-అధికారుల విచారణలో బట్టబయలు
-గత రబీలోనే కాదు అంతకుముందు ఖరీఫ్‌లోనూ భారీగా అవకతవకలు n అక్రమంగా ‘మద్దతు ధర’ను కొల్లగొట్టిన ఘనులు
-ఒక్కరు అమ్మినవే 1,302 క్వింటాళ్లు..
-12 మందిపై క్రిమినల్‌ కేసుల కోసం సీపీకి జేసీ ఫిర్యాదు
-మిల్లర్ల పాత్రపైనా దర్యాప్తు కోసం వినతి
-విజిలెన్స్‌ విచారణ కోసం కమిషనర్‌కు లేఖ
-సంచలనం సృష్టిస్తున్న ‘నమస్తే’ వరుస కథనాలు
-అక్రమార్కుల్లో గుబులు


(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి కొనుగోలు కేంద్రం లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నారు. ఈ కేంద్రంలో అక్రమాలు జరిగినట్లు వెల్లడికావడంతో కేంద్రాన్ని నిర్వహించిన చిగురుమామిడి సింగిల్‌ విండో సీఈవోను సస్పెండ్‌ చేశారు. అంతే కాకుండా ఐదుగురు దళారులపై ఈ నెల 1న సీఎస్‌సీఎల్‌ డీఎం ఎం.శ్రీకాంత్‌ గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే ఈ నెల 2న జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌తోపాటు పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులతో మంత్రి గంగుల కమలాకర్‌ సమావేశమయ్యారు. కొనుగోళ్లలో అక్రమాలపై లోతుగా విచారణ జరపాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

12 మందిపై క్రిమినల్‌ కేసులకు ఫిర్యాదు
చిగురుమామిడి మండలం నవాబ్‌పేటకు చెందిన బుర్ర శ్రీనివాస్‌తోపాటు గత ఖరీఫ్‌లో తప్పుడు పత్రాలు సమర్పించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన మరి కొందరి బండారం అధికారుల విచారణలో బట్టబయలైంది. ఈ దందా ఒక్క చొక్కారావుపల్లికే పరిమితం కాలేదనీ, జిల్లా వ్యాప్తంగా పలు కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి అక్రమాలు జరిగినట్లు తేలింది. నవాబ్‌పేటకు చెందిన బుర్ర శ్రీనివాస్‌, బుర్ర రజితతోపాటు మరో 10 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌తోపాటు జిల్లా సరఫరాల అధికారి సురేశ్‌రెడ్డి, సీఎస్‌సీఎల్‌ డీఏ ఎం. శ్రీకాంత్‌ బుధవారం నగరంలో సీపీ కమలాసన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వీరిలో యాట వెంకటరెడ్డి నవాబ్‌పేట కొనుగోలు కేంద్రంలో 11,68,200 విలువైన 660 క్వింటాళ్ల ధాన్యం విక్రయించినట్లు, ఈ ధాన్యాన్ని తిమ్మాపూర్‌ మండలం రేణికుంటలోని ఆర్‌కే ఇండస్ట్రీస్‌కు తరలించినట్లు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, కొట్టె భూమయ్య, కొట్టె మాధవి అనే మరో ఇద్దరు గన్నేరువరం మండలం యాస్వాడలోని కొనుగోలు కేంద్రంలో 5,48,700 విలువైన 310 క్వింటాళ్లు విక్రయించినట్లు, ఈ ధాన్యాన్ని మానకొండూర్‌ మండలం సదాశివపల్లిలోని సాయిట్రేడర్‌, శ్రీలక్ష్మీ మినీ రైస్‌మిల్లుకు తరలించినట్లు ఫిర్యాదు చేశారు. అలాగే తమ్మిశెట్టి సత్తయ్య, తమ్మిశెట్టి స్వరూప అనే వీరు 15,00,252 విలువైన 847 క్వింటాళ్ల ధాన్యాన్ని చిగురుమామిడి మండలం రేకొండ కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లు, ఈ ధాన్యం తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌లోని అరుణోదయ ఇండస్ట్రీస్‌, మమత మినీ రైస్‌ మిల్లుకు తరలించినట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు.


బూట్ల దేవదాసు అనే వ్యక్తి 16,94,240 విలువైన 957.20 క్వింటాళ్ల ధాన్యాన్ని గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్‌లో విక్రయించగా, తిమ్మాపూర్‌ మండలం రేణికుంటలోని ఆర్‌కే ఇండస్ట్రీస్‌, మానకొండూర్‌ మండలం సదాశివపల్లిలోని ఉమా ఇండస్ట్రీస్‌కు తరలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొమ్ముల రాంచంద్రారెడ్డి, కొమ్ముల అరుణ అనే వ్యక్తులు నవాబ్‌పేటలోని కొనుగోలు కేంద్రంలో 15,90, 876 విలువైన ధాన్యాన్ని విక్రయించగా, రేణికుంటలోని శ్రీసాయిశ్రీనివాస్‌ అగ్రోటెక్‌కు తరలించారు. నరహరి మధుసూదన్‌రెడ్డి అనే మరో వ్యక్తి చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి కొనుగోలు కేంద్రంలో 1215,356 విలువైన ధాన్యాన్ని విక్రయించగా సదాశిపల్లిలోని శ్రీ అంజనీ పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లుకు తరలించారు. తమ్మిశెట్టి లక్ష్మి, తమ్మిశెట్టి ప్రవీణ్‌కుమార్‌, తమ్మిశెట్టి సాయిమనీషా కలిసి చిగురుమామిడి మండలంలోని సుందరగిరి, ఉల్లంపల్లి, నవాబ్‌పేట కొనుగోలు కేంద్రాల్లో 24,87,912 విలువైన 1,405.60 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించారు. ఈ ధాన్యాన్ని అల్గునూర్‌లోని అరుణోదయ, మమత, విజయలక్ష్మి మిల్లులకు తరలించారు.

చిలువేరి రేణుక 1,54,344, విలువైన 87.20 క్వింటాళ్లు, చిలువేరి స్వామిగౌడ్‌ 58,058 విలువైన 32.80 క్వింటాళ్ల ధాన్యాన్ని చిగురుమామిడి మండలం ముల్కనూర్‌ కేంద్రంలో విక్రయించారు. రేణుకు విక్రయించిన ధాన్యం హుజూరాబాద్‌లోని రామాంజనేయ ఇండస్ట్రీస్‌కు, స్వామిగౌడ్‌ విక్రయించిన ధాన్యం కరీంనగర్‌లోని హారికా ఎంటర్‌ప్రైజెస్‌, రామలింగేశ్వర మినీ రైస్‌ మిల్లుకు తరలించారు. రేణుక, స్వామిగౌడ్‌ పేరిట అసలు భూమే లేదని అధికారులు తేల్చారు. తాట్ల వెంకట లక్ష్మి, తాట్ల శ్రీను అనే వీరిద్దరు కలిసి 15,58,308 విలువైన 880.40 క్వింటాళ్ల ధాన్యాన్ని ఉల్లంపల్లి, నవాబ్‌పేట కేంద్రాల్లో విక్రయించారు. ఈ ధాన్యాన్ని రేణికుంటలోని శ్రీసాయి శ్రీనివాస ఆగ్రోటెక్‌కు తలరించారు. ఇక కొమ్ముల రాజేశేఖర్‌ అనే వ్యక్తి 8,49,600 విలువైన 480 క్వింటాళ్ల ధాన్యాన్ని నవాబ్‌పేట కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఈ 12 మంది అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడయ్యిందనీ, వీరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా కాజేసిన ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని సీపీ కమలాసన్‌రెడ్డికి చేసిన ఫిర్యాదులో జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌, డీఎస్‌వో సురేశ్‌రెడ్డి, డీఎం శ్రీకాంత్‌ కోరారు.

విజిలెన్స్‌ విచారణకు లేఖ..
ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రబీలోనే కాకుండా ఖరీఫ్‌ సీజన్‌లో కూడా అక్రమాలు పెచ్చుమీరి జరిగాయని భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయి విజిలెన్స్‌ అధికారులతో విచారణ జరిపించాలని బుధవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డికి జేసీ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ లేఖ రాశారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన విచారణ నివేదికను కూడా కమిషనర్‌కు నివేదించినట్లు తెలుస్తున్నది. ఒక్క చొక్కారావుపల్లి కొనుగోలు కేంద్రం జరిగిన అక్రమాల విషయంలో కూపీ లాగితే జిల్లాలోని మరి కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇవే పరిస్థితులు వెలుగు చూడడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఈ విషయంలో మిల్లర్లు, మరికొందరి ప్రమేయం కూడా ఉండి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సీపీకి చేసిన ఫిర్యాదులో మిల్లర్ల పాత్రపైనా విచారణ జరపాలని కోరడం ఇందుకు నిదర్శనం. కాగా, అధికారులు ఫిర్యాదు చేసిన 12 మందిలో ‘ఎవరికి ఎంత భూమి ఉన్నది?’, ‘ఆ భూముల్లో ఎంత పంట వస్తుంది?’, ‘భూమి లేని వారు ఎవరైనా ఉన్నారా?’ అనే కోణంలో సీపీ దర్యాప్తు చేయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు తిమ్మాపూర్‌ సీఐ తాళ్లపల్లి మహేశ్‌గౌడ్‌ను దర్యాప్తుకు ఆదేశించారు. ఆయన మరికొన్ని వివరాలను అధికారుల నుంచి సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి మంత్రి గంగుల ఆదేశాల మేరకు జిల్లాలో జరిగిన ధాన్యం అక్రమాలపై లోతైన విచారణ జరుగుతుండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.


‘నమస్తే’ కథనాల ఆధారంగా..
కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన వరుస కథనాలను సీపీ కమలాసన్‌ రెడ్డికి చేసిన ఫిర్యాదులో అధికారులు పేర్కొన్నారు. ‘బియ్యం అటు.. ధాన్యం ఇటు’, ‘తవ్విన కొద్దీ అక్రమాలు’ శీర్షికతో వచ్చిన కథనాలను ధాన్యం అక్రమాలకు నిదర్శనాలుగా చూపారు. జిల్లాలో కొందరు అక్రమార్కులు సాగిస్తున్న ఈ దందాను ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. ఈ కథనాల అధారంగానే అధికారులు విచారణ సాగించి నిజాలను వెలికి తీస్తున్నారు. గత నెల 30న గన్నేరువరం మండలానికి చెందిన హన్మాజిపల్లి, గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్‌ రైతులు దళారులపై ఫిర్యాదు చేసిన సందర్భంలో వారికి జరిగిన మోసాన్ని ‘చొక్కారావుపల్లిలో మేం అమ్మలేదు’ శీర్షికన ఒక్కో రైతు వారీగా ఎలాంటి వంచన జరిగిందో ‘నమస్తే తెలంగాణ’ కథనం వివరించింది. దీనిపై జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌ స్పందించి ఆదేశాలు జారీ చేయగా, గన్నేరువరం పోలీసులకు ఐదుగురు దళారులపై సీఎస్‌సీఎల్‌ డీఎం శ్రీకాంత్‌ ఫిర్యాదు చేయడం, వారిపై కేసు నమోదు చేయడం సంచలనం సృష్టించింది.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...