హై అలర్ట్


Sun,November 10, 2019 01:33 AM

-సుప్రీం తీర్పు నేపథ్యంలో జిల్లాలో భారీ భద్రత
-సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించిన బలగాలు
-ప్రార్థనా స్థలాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు
-సోషల్‌మీడియాపై కొనసాగుతున్న నిఘా
-శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని పోలీస్ అధికారుల హెచ్చరిక

రాజన్నసిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అయోధ్యలో రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై శనివారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో జిల్లా పోలీస్‌శాఖ హై అలర్ట్ అయింది. శుక్రవారం రాత్రి నుంచే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలను ఎంచుకుని బలగాలను తరలించింది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా ఎలాంటి విద్వేషాలకు పోకుండా ఉండేందుకు మూడు రోజులుగా వివిధ మతాల ప్రతినిధులు, పెద్దలతో శాంతి సంక్షేమ కమిటీ సమావేశాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి నుంచి జిల్లా కేంద్రంలోకి వచ్చే ప్రధాన రహదారులపై వాహన తనిఖీలు ఏర్పాటు చేసి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రార్థన మందిరాల వద్ద సిబ్బందిని మొహరించారు. వేములవాడ రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో డీఎస్పీ చంద్రకాంత్, సీఐ నవీన్, ఎస్‌ఐ రమేశ్‌నాయక్, కోనరావుపేట మండల పరిధిలోని గ్రామాల్లో ఎస్‌ఐ పర్శరాములు బందోబస్తును పర్యవేక్షించారు. రుద్రంగి మండల పరిధిలో తాసీల్దార్ మహమ్మద్ తఫాజుల్ హుస్సేన్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మందుస్తు చర్యలు తీసుకున్నారు.

అన్నివర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించి సమన్వయ పరిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సామాజిక మాధ్యమాలపై కొద్ది రోజుల పాటు నియంత్రణ కొనసాగుతుందనీ, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరూ వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల మతాలపై అనుకూల, ప్రతికూల విషయాలను కాకుండా ఐకమత్యం పెంపొందించే విధంగా నడుచుకోవాలని సూచనలు జారీ చేశారు. న్యాయస్థానం తీర్పు వెలువడిన అనంతరం వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా వీడియోలు, ఫోటోలు, సందేశాలు చేయవద్దని, అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...